దళితులపై మంత్రి ఆది వ్యాఖ్యలు సిగ్గుచేటు
కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్
సాక్షి, న్యూఢిల్లీ: దళితులను కించపరిచేలా ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ (ఈఈఏ) సభ్యుడు బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు కేంద్ర మంత్రి సూచించారు. దళితులు శుభ్రంగా ఉండరు, చదువుకోరంటూ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మంత్రి ఆది చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రికి అనిల్ బుధవారం ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దళితులను తీవ్రంగా అవమానించడమేనని అనిల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పూర్తి వివరాలు కోరినట్లు అనిల్ తెలిపారు. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కటారియకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.