
'ఆదినారాయణ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలి'
హైదరాబాద్: ఎస్సీలను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేశ్, నారాయణ స్వామి, సునీల్‌కుమార్‌లు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆదినారాయణ రెడ్డిని తక్షణమే కేబినేట్ నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో మరెవ్వరూ అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేకుండా ఆదినారాయణ రెడ్డిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎస్సీలకు రాజ్యాంగంలో పదేళ్లు మాత్రమే రిజర్వేషన్ ఇస్తే ఏడుపదులైనా వారు మారలేదని; ఎస్సీల వెనుకబాటుకు వారే కారణమని, వారికి ఎంతో మేలు చేయాలని ఆలోచించినా.. ఎస్సీలు సరిగా చదవరని; ఎస్సీలు శుభ్రంగా ఉండరని; ఎస్సీల చేతిలో పట్టా భూమి ఉండదని.. ఆదినారాయణ రెడ్డి నోటికి హద్దు లేకుండా మాట్లాడారని అన్నారు.
స్వతంత్ర దినోత్సవ నాడు మంత్రి స్ధాయిలో ఉండి ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశంలోని దళితులందరినీ కించపరిచేవిధంగా ఉన్నాయని అన్నారు. రాజకీయంగా దిగజారి మంత్రి పదవి దక్కించుకున్న ఆది నారాయణ రెడ్డి.. ఇప్పుడు మనిషిగా కూడా దిగజారిపోయారని విమర్శించారు.