జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరస్రసాద్, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి.
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్యాంగ్‌లీడర్‌లా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. మంగళవారం గుంటూరులో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసిన అనంతరం ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి కూడా వారి వెంట ఉన్నారు.
మహిళలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని, రమ్య హత్య కేసు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకుందని, 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. రమ్య హత్య ఘటన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేగంగా స్పందించిన తీరు, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను ఎస్సీ కమిషన్ అభినందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసిందని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలూ ఇంతగా స్పందించలేదని కమిషన్ సభ్యులు చెప్పారన్నారు. రమ్య కుటుంబానికి చట్ట ప్రకారం న్యాయం చేస్తామని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి వారం లోపే సాయాన్ని అందచేశామని చెప్పారు.
కమిషన్ దృష్టికి గత సర్కారు అఘాయిత్యాలు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితులకు జరిగిన తీవ్ర అన్యాయాలు, అఘాయిత్యాలను ఎస్సీ కమిషన్‌కు వివరించినట్లు జూపూడి ప్రభాకర్ తెలిపారు. రమ్య కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రి జగన్ తమకు న్యాయం చేశారని చెబుతున్నారని, ఇకనైనా చంద్రబాబు నీచ రాజకీయాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.
దళితులపై వ్యాఖ్యలు గుర్తున్నాయ్ బాబూ: ఎమ్మెల్యే నాగార్జున
రమ్య హత్య ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచిందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఇంత వేగంగా న్యాయం చేయడం బహుశా దేశంలో ఎక్కడా జరగలేదని, రమ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతోపాటు ఇంటి స్థలం పట్టా కూడా ఇచ్చినట్లు చెప్పారు. గత సర్కారు దళితులను అంటరానివారిగా చూసిందని ఎమ్మెల్యే నాగార్జున గుర్తు చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ అధికారంలో ఉండగా చంద్రబాబు దురహంకారంతో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఎస్సీలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆయన్ను విచారించాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలను సైతం అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. చంద్రబాబు దళితులను మోసగించి లాక్కునన్ని భూములు చరిత్రలోనే ఎవరూ లాక్కోలేదన్నారు. ఆయన కులమతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
సీఎం తక్షణమే స్పందిస్తున్నారు: మాణిక్యవరప్రసాద్
ముఖ్యమంత్రి జగన్ అందరికంటే ముందే స్పందించి బాధితురాలు రమ్య కుటుంబానికి ఆసరాగా నిలిచారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, పేదలు, దళితులపై ఏ చిన్న ఘటన జరిగినా ముఖ్యమంత్రి తక్షణమే స్పందిస్తున్నారని గుర్తు చేశారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచిన దళిత సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.
దళితులపై ఈగ వాలకుండా చూస్తున్నారు: ఎమ్మెల్యే రజని
దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ స్పందించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రమ్య కుటుంబానికి కొండంత అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులపై ఈగ కూడా వాలకుండా అండగా నిలుస్తున్నారని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి పరిహారం, ఇంటి స్థలంతోపాటు వ్యవసాయ భూమి కూడా ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతురాలు రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడేలా న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన ఫోన్‌లో స్వయంగా దిశ యాప్ పనితీరును ఎస్సీ కమిషన్ బృందానికి వివరించారు. దళితులకు అన్యాయం జరిగిన సమయాల్లో ప్రభుత్వాలు ఇలానే శరవేగంగా స్పందిస్తే సమాజం బాగుంటుందని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment