సమర్థంగా విధులు నిర్వహించండి
ఎస్పీలతో రేంజ్ ఐజీ సంజయ్
గుంటూరు క్రైం :జిల్లాలో రాజధాని ఏర్పాటు జరుగుతున్న క్రమంలో వీవీఐపీలు,వీఐపీలు తరచూ పర్యటించే అవకాశం ఉన్నందువల్ల పోలీస్ అధికారులు తమ విధులను సమర్థంగా నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ సూచించారు. ఐజీ తన క్యాంపు కార్యాలయంలో రేంజ్ పరిధిలోని ముగ్గురు ఎస్పీలతో బుధవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎప్పటికప్పుడు స్టేషన్‌లను పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వా లన్నారు. నేరాల నియంత్రణపై దృష్టి సారించి నేరస్తుల కదలికలపై నిఘా కొనసాగించాలన్నారు. తీరప్రాంత గ్రామాలపై పోలీసుల నిఘా కొనసాగుతున్న తీరు, తదితర అంశాల గురించి ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
సమర్థత చాటే సిబ్బందికి రివార్డులు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. మూడు జిల్లాల పరిధిలో పర్యటిస్తానని తెలిపారు. అందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుగా తెలియజేస్తానన్నారు. అదేవిధంగా రేంజ్ కార్యాలయానికి రావాల్సిన నివేదికలను త్వరితగతిన పంపాలన్నారు. సమావేశంలో గుంటూరు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీ సి.హెచ్.శ్రీకాంత్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ ఎస్.సెంథల్‌కుమార్ పాల్గొన్నారు.
పలువురి అభినందనలు
ఐజీగా బాధ్యతలు చేపట్టిన ఎన్.సంజయ్‌ను అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్, గుంటూరు పశ్చిమ ఎమ్యెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మోదుగుల జిల్లాలోని పరిస్థితులపై ఐజీతో చర్చించారు. తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు.
ఐజీని కలిసినవారిలో అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జె.భాస్కర్‌రావు, డీఎస్పీలు బి.మెహర్‌బాబు, కె.నరసింహ, గంగాధరం, ఎన్.ప్రసాద్, సీఐలు, అర్బన్ ఎస్పీ కార్యాలయ ఏవో వివేక్‌దూబే, సూపరింటెండెంట్లు కరిముల్లా, శివకుమార్, రూరల్ జిల్లా అదనపు ఎస్పీలు గోళ్ల రామాంజనేయులు, టి.శోభామంజరి, కె.శ్రీనివాసరావు, డీఎస్పీలు జి.చెంచుబాబు, కె.సుధాకర్, ఐ. పూజ, బి.సత్యనారాయణ,ఎం. మధుసూదనరావు, సీఐలు, రూరల్ ఎస్పీ కార్యాలయ ఏవో ఎం.సంపత్తు, సూపరింటెండె ంట్లు షేక్ కరిముల్లా, జయశ్రీ, నారాయణమూర్తి, ఆర్‌ఐలు ఉన్నారు. తొలుత ఐజీ సీసీ హిమవంతరావు, కార్యాలయ మేనేజర్ నాగలక్ష్మి, ఉద్యోగులు సంజయ్‌ను కలిశారు.. తనను కలిసినవారిని ఐజీ సాదరంగా ఆహ్వానించి ఎక్కడ పనిచేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు.