లక్ష్యం.. ఈ-గవర్నెన్స్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఈ-ఆఫీసులుగా మారుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం సచివాలయంలో చంద్రబాబుతో సమావేశమైన విప్రో బృందం ఏపీ రాష్ట్ర ఎంటర్‌ప్రైజర్ ఆర్కిటెక్చర్(ఏపీఎస్ ఇఏ) ప్రాజెక్టుపై ప్రెజంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దశాబ్దం క్రితమే ఈ-సేవ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇవాళ ఈ-ప్రొక్యూర్‌మెంట్ సహా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు ఎన్నో మీ-సేవా కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని గుర్తు చేశారు.
ప్రభుత్వంలోని అన్ని విభాగాలను ఈ-ఆఫీసులుగా మార్చి తొలి ఈ-గవర్నెన్స్ రాష్ట్రంగా పేరు తెచ్చుకోవడమే ధ్యేయమని చెప్పారు. ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టును ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టడానికి సిద్ధపడాలని, అప్లికేషన్స్, సాప్ట్‌వేర్ రూపొందించి ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా దీని నిర్వహణలోనూ పాలుపంచుకోవాలని విప్రో ప్రతినిధులకు ఆయన సూచించారు. ఇవాళ అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నామని చెప్పారు.
ఏపీని దేశంలోనే తొలి స్మార్ట్ రాష్ట్రంగా మార్చాలన్నదే తన తాపత్రయమన్నారు. ఈ నేపథ్యంలో నూతన రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించడానికి విప్రో వంటి సంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు తొలి దశలో రెవెన్యూ, ఆర్థిక, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య వంటి ముఖ్యమైన పది విభాగాలను చేర్చిన విషయాన్ని ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ సీఎంకు వివరించారు.
విశాఖలో బిట్స్ పిలానీ: బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ)కు అనుబంధంగా విశాఖపట్నంలో కళాశాల ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా సంసిద్ధత వ్యక్తం చేసిన ట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సచివాలయం లో గురువారం తనతో భేటీ అయిన బిర్లాను రాష్ర్టంలో కళాశాల ఏర్పాటు చేయాల్సిందిగా బాబు కోరారు.
విశాఖలో బిట్స్ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బిర్లాకు చెందిన ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనువుగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు వద్ద 1866 ఎకరాల విస్తీర్ణంలో సున్నపురాయి గనుల ప్రాస్పెక్టింగ్ లెసైన్సుకు సంబంధించి నిరంభ్యతర పత్రం ఇప్పించాల్సిందిగా తన కార్యాలయ ముఖ్య కార్యదర్శిని బాబు ఆదేశించారు.