మరణంలోను ఈ దంపతుల మూడుముళ్ల బంధం విడిపోలేదు. భర్త మృతి చెందిన రెండు గంటల వ్యవధిలోనే భార్య కూడా...
మైలవరం : మరణంలోను ఈ దంపతుల మూడుముళ్ల బంధం విడిపోలేదు. భర్త మృతి చెందిన రెండు గంటల వ్యవధిలోనే భార్య కూడా మృతి చెందడం మైలవరం గ్రామంలో శనివారం చర్చనీయాంశమైంది. మైలవరం గ్రామానికి చెందిన తాడికొండ సుబ్బారావు(76) ఇటీవల అద్దెకు ఇచ్చిన భవనం మెట్లు దిగుతూ జారిపడటంతో కాలి విరిగి విజయవాడ ఆసుపత్రిలో చికిత్సపొంది రెండు రోజులు క్రింతం తిరిగి ఇంటికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎండదెబ్బ తట్టుకోలేక సొమ్మసిల్లి పడి మృతి చెందాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేక భార్య తాయారు(66) విలపిస్తూ షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది.
స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. భర్త మరణించిన రెండు గంటల లోపే అమె కూడా మృతి చెందింది. దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, భర్త బయటికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే వరకు తాయారు భోజనం కూడా చేసేది కాదని బంధువులు తెలిపారు, అందుకే ఈ దంపతులను మరణం కూడా వేరుచేయలేకపోయిందని బంధువులు, గ్రామస్తులు చెప్పుకోవడం విశేషం. శనివారం దంపతుల మృతదేహాలను ఒకే వాహనంపై శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.