
బిల్లు కాగితాలు కాదు...చంద్రబాబు చొక్కా చింపండి
= టీడీపీ నేతలకు ఉదయభాను సూచన
= కృత్తివెన్నులో హోరెత్తిన సమైక్య శంఖారావం
కృత్తివెన్ను, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లు కాగితాలు చింపటం కాదు.. సమైక్యం ఊసెత్తని చంద్రబాబు చొక్కా చింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. కృత్తివెన్నులో ఆదివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమైక్య శంఖారావం సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడ్డపర్రకు చెందిన ప్రముఖుడు ముత్యాల రాధాకృష్ణతో పాటు సుమారు 200 మంది వివిధ పార్టీలకు చెందినవారు ఉదయభాను సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
ఈ సభలో భాను మాట్లాడుతూ మరువలేని మహానేత వైఎస్సార్ వారసుడైన జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని నాయకుడన్నారు. చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని, రకరకాల యాత్రల పేరుతో రోడ్ల వెంట తిరుగుతున్నా ఎక్కడా సమైక్యంపై నోరు విప్పకపోవటమే దీనికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో కొందరు నాయకులు చంద్రబాబు దయ వల్లే తెలంగాణ వచ్చిందని సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడి టీడీపీ నేతలు మాత్రం దానిపై నోరు మెదపకపోవడానికి వారి రెండు కళ్ల సిద్ధాంతమే కారణమని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీలో సీటిస్తే చేరడానికి ఎందరో టీడీపీ నాయకులు ఎదురుచూస్తున్నారన్నారు. చంద్రబాబు మాటలను సొంత పార్టీ నాయకులే నమ్మే స్థితిలో లేరన్నారు. సీమాంధ్రకు నీరు కావాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రకాల ఉన్నతస్థాయి చదువులు అభ్యసిస్తున్న ఎంతోమంది విద్యార్థుల భవిత అంధకారమవుతుందన్నారు. వివిధ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండి తీరాలన్నారు. ఇప్పటికే విడిపోయిన వివిధ రాష్ట్రాలు పడుతున్న ఇబ్బందులు మన రాష్ట్ర ప్రజలకు రాకూడదంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలిపారు.
అసెంబ్లీలో బిల్లు పెట్టినంత మాత్రాన రాష్ట్రం విడిపోదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నాయకులను కలిసి మద్దతు కూడగడుతున్నారని, సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ ఎనలేని పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి కాబోయే సీఎం జగన్‌మోహన్‌రెడ్డేనని జన సర్వేలు చెబుతున్నాయని, ఇవి ముమ్మాటికీ నిజమేనని తెలిపారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని చెప్పారు. పార్టీలో చేరినవారిలో ప్రస్తుత పంచాయతీ వార్డు సభ్యులు గంధం దుర్గ, తోట సుబ్బారావు, కొప్పర్తి రంగారావు, గ్రామస్తులు తోట ముసలయ్య, అడపాల నాగేశ్వరరావు, పాశం రాంబాబు, పిన్నెంటి రంగారావు, మేడపాటి సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
సభలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ మావులేటి వెంకటరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ కో-ఆర్డినేటరు మారుమూడి విక్టర్‌ప్రసాద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు శ్యామల, మండల కన్వీనర్ యాళ్ల బాబులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు పిన్నెంటి సతీష్, బంటుమిల్లి కన్వీనరు ముత్యాల నాగేశ్వరరావు, పెడన టౌన్ కన్వీనరు పిచ్చుక శంకర్, పెడన రూరల్ కన్వీనరు అంకెం సముద్రయ్య తదితరులు పాల్గొన్నారు.