స్వగ్రామం చేరుకున్న ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం
విశాఖపట్నం: ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం మెహిదీపట్నం నుంచి రావడంతో విశాఖ జిల్లా వేపగుంటలో విషాదకర వాతావరణం నెలకొంది. అప్పలరాజుని ముమ్మాటికీ హతమార్చారని ఆరోపిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. అప్పలరాజు హైదరాబాదు మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో విధుల్లో ఉండగానే పిస్తోలుతో కాల్చుకుని మరణించాడని అక్కడి అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అప్పలరాజు మృతదేహం మంగళవారం వేపగుంట సమీపించే సరికి కుటుంబసభ్యులు, స్థానికులు భారీగా చేరుకున్నారు.
అప్పలరాజు అమర్హ్రే... అంటూ నినాదాలిచ్చారు. మృతుని తల్లి ముత్యాలమ్మ, సోదరుడు ముత్యాలు, భార్య అనసూయ, పిల్లల రోదనలతో జనం చలించిపోయారు. వీరితోపాటు జనం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అప్పలరాజు ఆత్మహత్యకు పాల్పడేటంతటి పిరికివాడు కాడని... అతని మరణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పలరాజు భౌతికకాయానికి ఆర్మీఅధికారులు గౌరవవందనం ఏర్పాటు చేయకపోవడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
నా భర్తని వేధించారు...
‘నా భర్తని ముమ్మాటికీ మానసికంగా హింసించే చంపారు...మరణానికి ముందు నుంచీ పోలీసులు, ఆర్మీ అధికారులూ ఆయనను వేధించారు’ అంటూ అప్పలరాజు భార్య అనసూయ కన్నీటి పర్యంతమయింది. మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో ముస్తఫా అనే బాలుని మృతిపై కొద్ది రోజులుగా విచారణ జరుగుతుండగా.... కేసు నుంచి బయట పడడానికి ఇద్దరు జవాన్లు తన భర్తపై నింద మోపారని చెప్పింది.
చనిపోవడానికి మూడు రోజుల కిందటి నుంచీ పోలీసులు, ఆర్మీ అధికారులూ వేధించారని, ముస్తఫాని అప్పలరాజే చంపినట్లు బలవంతంగా ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తుండేవారని ఆరోపించింది. తన భర్త తుపాకీతో కాల్చుకుని మరణించే అవకాశం లేనే లేదని, ఎవరో ఆయనను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆందోళన వ్యక్తం చేసింది. తన బావ అప్పలరాజు మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, జ్యుడీషియల్ విచారణ జరపాలని అప్పలరాజు బావమరిది శివరామకృష్ణ డిమాండ్ చేశారు.
నిరసనలతో హోరెత్తిన వేపగుంట
Published Wed, Nov 5 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement