
బాబోయ్ !
► సంచలనం రేపిన ‘రాజధాని దురాక్రమణ’ కథనం
► గ్రామాల్లో బాధిత రైతుల ఆగ్రహావేశాలు
► సీఎం, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల మోసాలపై మండిపాటు
► వేలమంది రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన
‘రాజధాని దురాక్రమణ’ కథనం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సంచలనం సృష్టించింది. సీఎం ,మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల మోసాలు తెలుసుకున్న రైతు లోకం నివ్వెరపోయింది. దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతల కడుపుకొట్టిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ‘దురాక్రమణ’లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల భూములను రాబందుల్లా తన్నుకు పోయిన ప్రభుత్వ పెద్దల కుట్రలపై మండిపడింది.
సాక్షి గుంటూరు మంత్రులు, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బీనామీల పేర్లతో తక్కువ ధరలకు భూములు కాజేసిన ‘దురాక్రమణ’లు ఒక్కసారిగా సాక్ష్యాధారాలతో బయటపడడంతో తెలుగుదేశం పార్టీలోనే బుధవారం తీవ్ర కలకలం రేగింది. కొందరు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు అయితే మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే ముఖ్యమంత్రి వద్దకు పలువురు మంత్రులు క్యూ కట్టారు. కేబినెట్ సమావేశానికి ముందే మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చన్నాయుడు, సీఎంను కలిసి సాక్షి కథనంపై చర్చించినట్లు తెలిసింది. ఇక కేబినెట్ సమావేశం ఆసాంతం సాక్షి కథనంపైనే చర్చ జరిపినట్టు సమాచారం. మంత్రులు నారాయణ, పుల్లారావు ‘సాక్షి ’ దినపత్రిక ప్రతులను కేబినెట్ సమావేశానికి తీసుకెళ్ళారు.
ఓ వైపు సమావేశం జరుగుతుండగానే మంత్రి పుల్లారావు, నారాయణ హడావుడిగా బయట విలేకరుల సమావేశం నిర్వహించారు. తమకే పాపం తెలియదని బొంకేందుకు నానా తంటాలు పడ్డారు. అంతేకాక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షి దినపత్రికపై తమ ఆక్రోశాన్ని, అక్కసును వెళ్లగక్కారు.
బాధిత రైతుల్లో ఆగ్రహావేశాలు ...
రాజధాని ప్రాంతంలో తక్కువ ధరలకు భూములు కోల్పోయి టీడీపీ నేతల మోసాలకు బలైన అనేక మంది రైతులు ‘సాక్షి’ కథనంతో ధైర్యం కూడదీసుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. టీడీపీ నేతలు తమకు అన్యాయం చేసి అతి తక్కువ ధరకు భూములను కాజేశారని మండి పడ్డారు. మొదటి నుంచి రాజధాని ప్రాంతంలో టీడీపీ ముఖ్యనేతలు భూ ఆక్రమణలకు, భూ దందాలకు దిగుతున్నారని తెలిసినప్పటికీ ‘సాక్షి’ దినపత్రికలో పక్కా ఆధారాలతో బయటపడడంతో తమకు జరిగిన అన్యాయమే వేల మంది రైతులకు జరిగిందని తెలిసి ఆందోళన చెందారు. ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వ పాలకులే ధనార్జన కోసం రైతుల కడుపు కొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజధానిలో జరుగుతున్న భూ దందాలపై మేధావులు, అన్ని వర్గాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి పత్రిక ప్రతులు తగలబెట్టి అక్కసు వెళ్లగక్కిన టీడీపీ నేతలు
‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘రాజధాని దురాక్రమణ’ కథనంతో కంగుతిన్న తెలుగు తమ్ముళ్లు తమ అక్కసును వెళ్లగక్కారు. మంగళగిరి పట్టణంలో సాక్షి దినపత్రికల ప్రతులను దహనం చేసి తమ నేతల తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. రాజధాని దురాక్రమణనుఆధారాల సహా బయట పెట్టినప్పటికీ ఎదురుదాడితో ప్రజల దృష్టి మరల్చే కుట్రకు తెరతీశారు. ఇక మంత్రులు అయితే క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేక వివరణ ఇవ్వలేక చివరకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షి దినపత్రికపై దూషణలకు దిగారు.
ఎక్కడ చూసినా ‘సాక్షి’ కథనాలపై చర్చ
ప్రధానంగా రాజధాని గ్రామాలతోపాటు... విజయవాడ, గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన పట్టణాల్లో ‘రాజధాని దురాక్రమణ’పై చర్చ జోరుగా సాగింది. ఇదే స్థాయిలో కైకలూరు, నందిగామ, నూజివీడు, మైలవరం పట్టణాల్లోనూ పలువురు చర్చించుకోవడం విశేషం. కమ్యూనిస్టు పార్టీలు, ఇతర ప్రతిపక్ష వారు ‘సాక్షి’ పత్రికను ఆసక్తిగా చదివారు.
ఉద్యోగుల్లో ప్రత్యేక చర్చ ...
భూములు కొనుగోలు చేసిన వారంతా మంత్రులు, వారి అనుచరులు కావడంతో ఉద్యోగుల్లో ప్రత్యేక చర్చ జరిగింది. ఎన్జీవోల్లో చురుకైన చర్చ సాగింది. ఇటీవల ఎన్‌జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటమే కాకుండా చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నాడు. ఈ వార్త కనువిప్పు కావాలంటూ కొందరు అధికారులు వ్యాఖ్యానించడం విశేషం. కొందరు టీడీపీ నాయకులు ఓర్వలేక బుధవారం సాయంత్రం లెనిన్ సెంటర్‌లో ‘సాక్షి’ దినపత్రిక ప్రతులను తగులబెట్టారు.