పైన ఫైన్.. లోపల రేషన్ | The city still selling adulterated rice | Sakshi
Sakshi News home page

పైన ఫైన్.. లోపల రేషన్

Published Thu, Sep 19 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

The city still selling adulterated rice

హన్మకొండటౌన్, న్యూస్‌లైన్ : సన్నబియ్యం అమ్మకాల పేరిట ప్రజలను మోసం చేసే వ్యాపారుల ముఠా ఒకటి నగరంలోకి ప్రవేశించింది. ట్రైసిటీలోని పలు కాలనీల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసిన ఈ ముఠా ఇప్పటికే పలువురిని మోసం చేసినట్లు తెలిసింది. తక్కువ ధరకు సన్నబియ్యం అందిస్తామంటూ ట్రాక్టర్, ఆటో ట్రాలీలపై బస్తాలను వేసుకుని ప్రచారం చేసి రేషన్ బియ్యం అంటగడుతూ పలువురు దొరికిన కాడికి దోచుకెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే..

మార్కెట్‌లో సన్నరకం బియ్యం క్వింటాల్‌కు రూ.4500 నుంచి రూ.5వేలకు పైగా ధర పలుకుతోంది. అయితే రూ.5వేల ధర ఉన్న సన్నాలను తాము రూ.3500లకే ఇస్తామంటూ కొంతమంది ముఠా సభ్యులు ఇటీవల నగరవాసులకు గాలం వేస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లకుండా తమ ఇంటి వద్దనే తక్కువ ధరకు మేలురకం బియ్యం తీసుకోవచ్చని భావిస్తున్న మహిళలు నకిలీ బియ్యం ముఠా మాటలను నమ్ముతున్నారు. అయితే తమను అనుమానంగా చూస్తున్న ఉద్యోగులు, మహిళలకు నమ్మకం కుదిర్చేందుకు వ్యాపారులు తమ సెల్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్తున్నారు.

ఇంత తక్కువ ధరకు ఎలా బియ్యం అమ్ముతున్నారని ప్రశ్నిస్తే ధాన్యం తక్కువ ధర ఉన్నప్పుడు వేలాది క్వింటాళ్లలో తాము కొనుగోలు చేశామని, స్టాక్ పెట్టిన సమయం గడిచిపోవడంతో బియ్యం పాడైపోతున్నాయని.. మిల్లర్లు తమకు కమీషన్‌పై విక్రయించాలని అప్పగించినట్లు నమ్మబలుకుతారు. దీంతో అనుమానం నివృత్తి కావడంతో పలువురు క్వింటాళ్ల కొద్ది బియ్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం హన్మకొండ కుమార్‌పల్లి మార్కెట్ సమీపంలో నివాసముంటున్న ముగ్గురు మహిళలు సుమారు రూ.25వేలకు పైగా చెల్లించి బియ్యం కొనుగోలు చేసి నష్టపోయారు.

వీరిలో ఒకరు మూడు క్వింటాళ్లు, మరో ఇద్దరు రెండు క్వింటాళ్ల చొప్పున బియ్యం తీసుకున్నారు. కొనుగోలు సమయంలో బియ్యం బస్తాల నుంచి షాంపిల్ చూపించినప్పుడు సన్నరకం ఉన్నాయని, తర్వాత బస్తాలను విప్పి చూస్తే లోపల దొడ్డురకం రేషన్ బియ్యం ఉన్నాయని బాధితులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ ముఠా నగరంలోని పలు ప్రాంతాల్లో పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా, మోసానికి గురైన వారు వ్యాపారులు ఇచ్చిన సెల్‌నంబర్‌ను పట్టుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఆ నంబర్‌కు డయల్ చేయగా అది కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. తక్కువ ధరకు బియ్యం ఇస్తామని అన్నప్పుడే ఫిర్యాదు చేస్తే తాము వచ్చి చర్యలు తీసుకునే వారమని పోలీస్ అధికారులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటికైనా తక్కువ ధరకు బియ్యం విక్రయిస్తామని ఎవరైనా అంటే తమకు సమాచారం అందించాలని వారు చెప్పారు. కాగా, మార్కెట్‌లో ధరలు మండిపోతున్న ప్రస్తుత సమయంలో తక్కువ ధర కు బియ్యం కొనుగోలు చేసి మోసపోవద్దని పోలీస్ అధికారులు నగరవాసులను హెచ్చరిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement