సిద్దిపేట/సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాలు మూతపడ్డాయి. ఉల్లి ధరను నియంత్రించేందుకు మార్కెటింగ్ శాఖ సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆగస్టు 26న ఈ కేంద్రాలను ప్రారంభించారు. బయటి మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సా మాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన అధికార యంత్రాంగం పౌర సరఫరాల శాఖ సహకారంతో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా రోజుకు వంద నుంచి 150 క్వింటాళ్ల వరకు ఉల్లి విక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
డిమాండ్‌కు తగ్గ ఉల్లి దిగుమతులు లేకపోవడంతో ప్రారంభించిన వారం రోజులకే విక్రయ కేంద్రాలను మూసివేశారు. ఈ కేంద్రాల ద్వారా కిలో రూ.34 చొప్పున విక్రయిస్తారని ప్రారంభ సమయంలో కలెక్టర్ దినకర్‌బాబుతోపాటు జేసీ శరత్ తెలిపారు. మరో వారం రోజుల్లో అన్ని మండల కేంద్రాల్లోనూ కేంద్రాలను తెరుస్తామన్నారు. అయితే అధికారులు ప్రారంభించిన వాటినే మూతపడకుండా చూడలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలా విక్రయ కేంద్రాలు ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. బయటి మార్కెట్‌లో రోజురోజుకు ఉల్లి ధరలు ఘాటెక్కడంతో సామాన్య ప్రజలు ఉల్లి విక్రయ కేంద్రాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. మెదక్ పట్టణంలో సైతం ఉల్లి విక్రయ కేంద్రాన్ని ఆర్డీఓ వనజాదేవి ప్రారంభించారు. కానీ 5 రోజులు తిరగకుండానే మూసివేశారు. సిద్దిపేటలోనూ అదే పరిస్థితి నెలకొంది.
నిల్వలు లేకపోవడమే కారణం...
జిల్లాకు అవసరమైన ఉల్లిగడ్డ సరిపోను నిలువ లేని కారణంగానే ఉల్లి విక్రయ కేంద్రాలు మూతపడినట్లు తెలుస్తోంది. జిల్లాకు ప్రతిరోజు వంద క్వింటాళ్ల ఉల్లిగడ్డ అవసరముంటుంది. కాగా డిమాండ్‌కు తగినంత మార్కెట్‌లో ఉల్లిగడ్డ లేకపోవడంతో ఈ విక్రయ కేంద్రాల ద్వారా సరఫరా చేయలేకపోవడం ఓ కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు మార్కెట్‌లో వీటి ధర పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఇవ్వకపోవడంతో సరఫరా చేయకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డ రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఇవ్వకపోవడంతో పాటు గతంలో ఉన్న 34 రూపాయల కిలో ఉల్లిగడ్డ నేడు 20 రూపాయలు పెరిగింది. దీంతోపాటు రవాణా చార్జీ అదనంగా వినియోగదారులపై పడనుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాల ద్వారా రూ.34కు కిలో ఉల్లిగడ్డను సరఫరా చేయడం తలకు మించిన భారమవుతుందని మూసివేసినట్టు తెలుస్తోంది.
శాఖల మధ్య సమన్వయ లోపం..
ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిన సమయంలో పౌ ర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్త ఆధ్వర్యం లో ఈ విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పెరిగిన ఉల్లిగడ్డ ధరలను దృష్టిలో పెట్టుకుని మార్కెటింగ్ శాఖ నెమ్మదిగా ఉల్లి విక్రయ కేంద్రాల నిర్వహణ నుంచి తప్పించుకుంది. షాపు నిర్వహణ మాత్రమే తాము చూస్తామని, మార్కెటింగ్ వ్యవహారమంతా ఆ శాఖ అధికారులు చూడాల్సి ఉందని పౌరసరఫరాల అధికారి తెలిపారు. శాఖల మధ్య సమన్వయ లోపతో వారం తిరగకుండానే ఉల్లి విక్రయ కేంద్రాలు మూతపడ్డాయి.
సిద్దిపేటలో పరిస్థితి ఇది..
కేంద్రం ప్రారంభించిన మొదట్లో వారం రోజులపాటు డీసీఎంలో ఓ సారి, ట్రాలీ ఆటోలో ఒక పర్యాయం హైదరాబాద్‌లోని మలక్‌పేట నుంచి ఉల్లిని రైతు బజారు వారు తెప్పించారు. 115 క్వింటాళ్లు తలా రెండు కిలోల చొప్పున జనానికి అమ్మారు. మూడో లోడు రాకుండానే ఈ కేంద్రం మూత పడింది. అనేక మందికి రూ.34కు కిలో చొప్పున కొనుక్కునే అవకాశం దక్కకముందే సెంటర్ గోవిందా అయింది. కర్నూలు నుంచి నిత్యం మలక్‌పేటకు 70-80 లారీల మేర ఉల్లి లోడు వచ్చేదని, కొన్ని రోజులుగా రెండు, మూడు లారీల లోడ్ మాత్రమే వస్తుండడంతో కొరత ఏర్పడిందని సిద్దిపేట రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ ప్రభాకర్ తెలిపారు. రైతు బజారులో విక్రేతలు రూ.43కు కిలో చొప్పున అమ్ముతున్నారని చెప్పారు.
ఉల్లి.. అదే లొల్లి
Published Sun, Sep 22 2013 5:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement