తీరం.. కాలకూటం | The coast .. Background | Sakshi
Sakshi News home page

తీరం.. కాలకూటం

Published Thu, Jan 30 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

The coast .. Background

తుంగాతీరం కలుషితమవుతోంది. ఆహ్లాదకర వాతావరణం కనుమరుగవుతోంది. దుర్వాసనతో పరీవాహక ప్రాంత ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ముక్కు మూసుకుంటే తప్ప.. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని దయనీయ పరిస్థితి. నదీ తీరంలోని ఫ్యాక్టరీ వ్యర్థాలే ఇందుకు కారణమని ఊరంతా కోడై కూస్తున్నా.. చర్యలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మౌనం దాలుస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: అమీనాబీ రెండు వారాలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. శ్వాస పీల్చడం కష్టమవుతుండటం.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో మంచం పట్టింది. ఖాజాబాష కడుపు ఉబ్బరం, జ్వరంతో బాధపడుతున్నాడు. బషీరున్నీసాకు వాంతులు, విరేచనాలు. కుల్‌సున్‌బీ.. అమీనాబీ.. ఫాతిమా.. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది జనం వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇదీ జిల్లా కేంద్రంలో అత్యంత రద్దీ ప్రాంతమైన పాతబస్తీ దీనస్థితి. నెల రోజులుగా ముక్కుపుటాలదిరే దుర్వాసన ఇక్కడి ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధికారులకు తమ గోడు వినిపించినా.. ఇటువైపు కన్నెత్తి చూసేందుకూ సాహసించలేకపోయారు. కనీసం ఏమి జరుగుతుందోనని ఆరా తీసేందుకూ ముందుకు రాలేకపోయారు.
 
 ఇందుకు కారణం అధికార పార్టీ నేత ఒత్తిళ్లు. ప్రజా సంఘాలు తీరం వెంట పర్యటించి.. ఆల్కాలీస్ ఫ్యాక్టరీ వ్యర్థాలే దుర్వాసనకు కారణమని గుర్తించి నివేదికలను సిద్ధం చేశాయి. వీటిని అధికారుల ముందుంచినా బుట్టదాఖలయ్యాయి. ఆందోళనలు నిర్వహించినా.. కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించినా.. చివరకు సమస్యను రాష్ట్ర రాజధానిలోని గవర్నర్, సీఎం, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడం గమనార్హం. అయితే మానవ హక్కుల కమిషన్ మాత్రమే స్పందించింది. కలెక్టర్, జిల్లా పొల్యూషన్ శాఖ అధికారులను నివేదిక అందజేయాలని కోరింది. అధికారులెవరూ ముందుకురాని పరిస్థితుల్లో వైద్య శిబిరాల ఏర్పాటుకు మాజీ ఎంపీపీ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రూ.2 లక్షలను అందించేందుకు ముందుకొచ్చారు. అప్పటికీ అధికారుల్లో చలనం రాకపోవడంతో దాదాపు 2,500 మంది ప్రజలు తమ జీవితాలు ఇంతేననుకుని నిట్టూరుస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement