సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘మన జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు పూర్తిగా పట్టు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నవారి సాయంతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నారు. కేవలం పట్టు సడలినప్పుడు భయంతో చేసే కార్యక్రమాలే ఇవి. ఇది నిజంగా వారికి ఆత్మహత్యా సదృశమే. అయినా మేం వెనక్కు తగ్గేది లేదు. వాళ్లు ఎంతమందిని చంపితే మేం అంత బలం పుంజుకుంటాం.
మా అసలైన వనరులు ఎక్కడున్నాయో కనుక్కోవడం వారికి ఎప్పటికీ సాధ్యం కాదు’ అని జిల్లా పోలీస్ బాస్ ఎ.వి.రంగనాథ్ స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాలను తమకు అనుకూలంగా మలుచుకుని వారిని ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలు, సార్వత్రిక ఎన్నికలకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతున్న తీరు, పోలీసు సిబ్బంది సంక్షేమానికి చేపడుతున్న చర్యలతో పాటు ఇతర అంశాలపై పలు విషయాలను ఎస్‌పీ వెల్లడించారు.
ఆ విశేషాలివి...
సాక్షి: సార్వత్రిక ఎన్నికల కసరత్తు ఎలా సాగుతోంది? ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు ప్రారంభించిందా?
ఎస్పీ: త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకోసం మేం సిద్ధమవుతున్నాం. ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి జిల్లాలో ఎస్‌ఐలు, సీఐలను బదిలీ చేశాం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి, ప్రొబెషన్‌లో ఉన్న ఎస్‌ఐలకు పోస్టింగ్‌లిచ్చాం. సీఐలు, డీఎస్పీలపై ప్రధాన బాధ్యతలు పెట్టేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం.
సాక్షి: ఎన్నికల సందర్భంగా పోలీసు బలగాల మొహరింపుపై ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు?
ఎస్పీ: ముఖ్యంగా పోలింగ్‌బూత్‌ల వారీగా దృష్టి సారిస్తున్నాం. జిల్లాలో ఉన్న సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు జరిగింది. ఇందులో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న బూత్‌లపై పెద్ద ఎత్తున నిఘా ఉంటుంది. ఎస్‌ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో దాదాపు 10 మంది పోలీసు సిబ్బంది పనిచేస్తారు. సమస్యాత్మంగా ఉన్న చోట్ల నలుగురైదుగురు పోలీసులు పహారా కాస్తారు. అవసరమనుకుంటే పారామిలటరీ బలగాలను కూడా మొహరిస్తాం. ఏదైనా ప్రస్తుతానికి మా అవగాహన కోసం కసరత్తు చేస్తున్నాం. షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతాం. ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా సిద్ధంగా ఉన్నాం.
సాక్షి: జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఏజెన్సీలో మళ్లీ మావోయిస్టుల అలజడి కనిపిస్తోంది. ఏజెన్సీపై మీ పట్టు ఏమైనా సడలిందా?
ఎస్పీ: గతంలో మావోయిస్టులను జిల్లాలో పూర్తిగా నియంత్రించగలిగాం. అయితే, పట్టు పోయిందన్న భయంతో ఏదో చేద్దామని వాళ్లు ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే ఇన్‌ఫార్మర్లంటూ అమాయక గిరిజనులను చంపుతారు. సెల్‌టవర్‌లను పేల్చివేసి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారు. వారి పట్టు పోయిన కారణంగానే ఇలాంటి పిరికిచర్యలకు పాల్పడుతున్నారు. మేం ఏజెన్సీపై పట్టు సడ లించే సమస్యే లేదు. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాం. మా అసలైన వనరులను కనుక్కోవడం మావోలకు సాధ్యమయ్యే పనికాదు.
సాక్షి: ఇటీవల దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టులు పోలీసులకు తారసపడినా కాల్పులు జరపలేదని, ఇందుకు పోలీసుల కన్నా అక్కడ మావోయిస్టుల సంఖ్య ఎక్కువ ఉండడమే కారణమని వార్తలొస్తున్నాయి... నిజమేనా?
ఎస్పీ: అదంతా ఊహాగానం మాత్రమే. మాకున్న సమాచారం మేరకు మేం అక్కడికి కూంబింగ్ కోసం వెళ్లాం. కొందరు మావోయిస్టులు అప్పుడు షెల్టర్ గ్రామాల్లో ఎక్కడో నక్కి ఉన్నారని తెలిసింది. కానీ, మాకు తారసపడలేదు. మావోయిస్టులు తారసపడితే వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే ఉండదు.
సాక్షి: మేడారం జాతరకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు వెళ్లారంటున్నారు?
ఎస్పీ: అలాంటి పరిస్థితి జిల్లాలో లేదు. గోదావరి అవతల చందూరు అటవీప్రాంతంలో కూడా మేం కూంబింగ్ చేశాం. అలాంటి వార్తల్లో నిజం లేదు.
సాక్షి: అసలు జిల్లాలో మావోయిస్టులు ఎంత మంది ఉంటారని మీ అంచనా?
ఎస్పీ: మా అంచనా ప్రకారం జిల్లాలో ఉన్న మావోయిస్టుల సంఖ్య 60 నుంచి 70 మంది మాత్రమే. అయితే, మన జిల్లాను ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వారి ప్రాబల్యం బాగానే ఉంది. వారి ధైర్యంతోనే జిల్లాలో అప్పుడప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటారు. అయినా, ఈ మధ్య ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల మధ్య కూడా విభేదాలొచ్చాయని మాకు సమాచారం ఉంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మావోయిస్టులు ఎన్ని రోజులు ఛత్తీస్‌గఢ్‌లో ఉంటారని అక్కడి మావోయిస్టులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మేమైతే అలర్ట్‌గా ఉంటాం.
సాక్షి: మావోయిస్టుల మాట అటుంచితే, జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటి? మీతో-మీ ఎస్పీ, ప్రజాదివస్ లాంటి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి?
ఎస్పీ: జిల్లా అంతా ప్రశాంతంగానే ఉంది. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి లేదు. ఇక పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఉద్దేశించిన మీతో-మీఎస్పీ కార్యక్రమం ద్వారా పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాం. అసలు ప్రజాదివస్‌కు ఇంత స్పందన వస్తుందని నేను ఊహించలేదు. దీనిపై ప్రజల్లో అంచనా పెద్ద స్థాయిలో ఉంది.
భద్రాచలం నుంచి ఇటీవల వచ్చిన ఒకామె తాను మూడు రోజులపాటు బస్టాండ్‌లో ఉండి ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పింది. అప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది. మనపై మరింత బాధ్యత ఉందనిపించింది. ఏది ఏమైనా జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. ప్రజాదివస్ జరిగే రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు పనిచేస్తున్నాం. స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై ఫాలోఅప్ చేస్తున్నాం.
సాక్షి:హోంగార్డులను కుదించాలనే ప్రతిపాదన ఏమైనా ఉందా? జిల్లాలో హోంగార్డుల పరిస్థితి ఏంటి?
ఎస్పీ: హోంగార్డులను కొంతమందిని తొలగించాలని రాష్ట్రస్థాయిలో ప్రతిపాదన ఉన్న మాట వాస్తవమే. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. అయితే, జిల్లాలో మాత్రం అలాంటిదేమీ ఉండదు. జిల్లాలో మొత్తం 845 హోంగార్డు పోస్టులు మంజూరు కాగా, 1100 మంది పనిచేస్తున్నారు. అలా అని ఎక్కువగా ఉన్నారని ఎవరినీ తొలగించం.
విధుల్లో అలసత్వం వహించినా, విధులకు హాజరుకాకపోయినా చర్యలు తీసుకుంటాం. అయినా, హోంగార్డులతో పాటు ఆర్మ్‌డ్‌రిజర్వ్‌డ్ పోలీసులకు కూడా సెలవులిస్తున్నాం. హోంగార్డులకు కూడా కానిస్టేబుళ్ల తరహాలోనే సర్వీసు రిజిస్టర్ మెయింటెయిన్ చేస్తాం. వారికి ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలో తామిచ్చే ఐడెంటిటీ కార్డులను చూపించి హోంగార్డులు కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు.
సాక్షి: జిల్లా ప్రజలకు ‘సాక్షి’ ద్వారా మీరేమైనా చెపుతారా?
ఎస్పీ: శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలన్నదే ప్రజానీకానికి మా ప్రధాన విజ్ఞప్తి. ఎన్నికల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా... సేవ చేయగలిగిన వారిని ఎన్నుకోవాలి. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా చూడడమే మా ప్రధాన కర్తవ్యం. ఆ దిశలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తాం.
వెనక్కు తగ్గేది లేదు
Published Sun, Feb 16 2014 2:02 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement