సమస్యల్లో సాగర సంగమం | The confluence of maritime issues | Sakshi
Sakshi News home page

సమస్యల్లో సాగర సంగమం

Published Mon, Oct 27 2014 2:33 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

The confluence of maritime issues

  •  కార్తీకమాసం ప్రారంభమైనా కనిపించని సౌకర్యాలు
  •  అధ్వానంగా సంగమ రహదారులు
  •  తాగునీరు,మరుగుదొడ్లు లేక అల్లాడుతున్న యాత్రికులు
  • కోడూరు : సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయమైన శ్రీకృష్ణాసాగర సంగమ ప్రాంతం సమస్యల నిలయంగా మారింది.  సుదూర ప్రాంతాల నుంచి  ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు సేదతీరేందుకు  వచ్చే వారికి కనీస సౌకర్యాలు కూడా మృగ్యంగా మారాయి.  కార్తీకమాసంలో ఈ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం వేలాదిమంది భక్తులు వస్తారు. కార్తీకమాసం ప్రారంభమై  నాలుగు రోజులు గడుస్తున్నా సంగమ ప్రాంతంలో అధికారులు ఏ విధమైన సౌకర్యాలు కల్పించిన దాఖలాలు కనుచూపు మేరలో కానరావడం లేదు.

    సముద్రతీరంలో పర్యాటకులకు అశ్రయం కల్పిస్తున్న డాల్ఫిన్ భవనం ఆధుని కీకరణ పేరుతో అధికారుల అనాలోచిత చర్యల వల్ల నిర్మాణం పనులు అస్తవ్యస్తంగా నిర్వహించారు. భవనానికి సరిగ్గా తలుపు లేకపోవడంతో కళావిహీనంగా మారింది.  అధికారుల  పర్యవేక్షణ లోపం కారణంగా  పాలకాయతిప్ప గ్రామం వద్ద నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన తాగునీటి వ్యవస్థ అధ్వానంగా మారడంతో  తాగేందుకు నీరు లేక భక్తులు దాహంతో అల్లాడుతున్నారు.  

    కోడూరు-దింటిమెరక, కోడూరు-ఉల్లిపాలెం గ్రామాల మీదగా కోట్లాది రూపాయలతో నిర్మించిన సంగమ ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారులు గుంతలు పడి అధ్వానంగా మారాయి. విశ్రాంతి భవనాల వద్ద ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో దుస్తులు మార్చుకునేందుకు మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
     
    కృష్ణమ్మ పాదాలకు రక్షణ కరువు..

    గణపతి సచ్చిదానంద స్వామీజీ సాగరతీరంలో ప్రతిష్టించిన కృష్ణమ్మ పాదాలకు రక్షణ కొరవడి శిథిలావస్థకు చేరాయి. పాదాలను ప్రతిష్టించిన సమయంలో సంగమ ప్రాంతాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దుతామని ఉపన్యాసాలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఆ మాటలను గాలికి వదిలేశారు.  
     
    పర్యాటక శోభ అంటే ఇదేనా..


    రాష్ట్రం విడిపోయిన తరువాత జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పిన ప్రభుత్వ పెద్దలకు సాగర సంగమంలో ఇన్ని సమస్యలు తిష్టవేసిన కనిపించడం లేదా.. అని కోడూరు ప్రజానీకం ప్రభుత్వం వైఖరి పట్ల అసహసం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా అధికారులు సాగరసంగమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement