ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం పట్టదా! | The construction of the Outer Ring Road grip! | Sakshi
Sakshi News home page

ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం పట్టదా!

Published Mon, Apr 11 2016 1:12 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

The construction of the Outer Ring Road grip!

మచిలీపట్నం : రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ నిర్మించే ఔటర్ రింగ్‌రోడ్డును పాలకులు పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి అవసరమైన రూ. 19,700 కోట్లను ఇచ్చేందుకు ఓకే చెప్పింది. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ నిర్మించే ఈ రింగ్‌రోడ్డుపై రెండు జిల్లాలకు చెందిన ఎంపీలు దృష్టిసారించకపోవడంతో నిర్మాణం తీవ్ర జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారుచేసేందుకు గతంలో సింగిల్ టెండరు దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆ టెండరును రద్దు చేశారు. మళ్లీ సర్వే పనుల కోసం టెండర్లు పిలవగా మళ్లీ సింగిల్ టెండరే వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్.వి. అసోసియేట్స్ సంస్థ ఈ టెండరును దాఖలు చేసినట్లు జాతీయ రహదారుల విభాగం అధికారులు చెబుతున్నారు.


రెండోసారి సింగిల్ టెండరు దాఖలైన నేపథ్యంలో ఈ టెండరును ఈ నెలాఖరు నాటికి ఖరారు చేసే అవకాశం ఉంది. సర్వే పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన అనంతరం 11 నెలల వ్యవధిలో నివేదిక తయారుచేసి ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రం విడిపోకముందు వీజీటీఎం ఉడా మాస్టర్ ప్లాన్‌ను ఆర్.వి. అసోసియేట్స్ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం అమరావతి మాస్టర్ ప్లాన్‌లోని 1.2 కిలోమీటర్ల వేలాడే వంతెనకు ఈ సంస్థ నమూనా రూపొందించినట్లు సమాచారం. పాలకులు రాజధాని నిర్మాణంపైనే దృష్టిసారిస్తున్నారని, ఏడాదిన్నర నుంచి రింగ్‌రోడ్డు ఊసే ఎత్తడం లేదనే వాదన వినబడుతోంది. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తే దానివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.


ప్రాథమిక అంచనా ఇలా
అమరావతి రాజధాని చుట్టూ తొలుత 180 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే ఆమోదించింది. గత ఏడాది డిసెంబరులో విజయవాడ వచ్చిన జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ద్వారా ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని ప్రకటన చేయించారు. అనంతరం ఈ రోడ్డును 180 కిలోమీటర్లకు బదులుగా 210 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. 500 అడుగుల వెడల్పున భూసేకరణ చేయాలని నిర్ణయించారు. సుమారు 7,500 ఎకరాల భూమి అవసరం కాగా భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఎనిమిది లేన్లుగా ఈ రహదారిని నిర్మించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా రెండు సర్వీసు రోడ్లు వస్తాయి. ఎనిమిది లైన్ల రహదారిపై కార్లు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేస్తారు. ఈ రహదారిని ఎక్స్‌ప్రెస్ వేగా పిలుస్తారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై కొల్లిపర-పెదఓగిరాల మధ్య ఒక వంతెన, చెవిటికల్లు-అమరావతి మధ్య మరో వంతెన నిర్మించాలని ప్రాథమిక అంచనాగా ఉన్నట్లు జాతీయ రహదారుల శాఖ అధికారులు అంటున్నారు. ఈ వంతెనల నిర్మాణం పైనే ఔటర్‌రింగ్ రోడ్డు నమూనా ఆధారపడి ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.

 

భూసమీకరణా.. భూసేకరణా!
ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి 7,500 ఎకరాల మేర భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భూసేకరణ లేక భూసమీకరణ చేస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. భూసమీకరణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు జాతీయ రహదారుల విభాగం అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయే రైతులకు భూసమీకరణ నిబంధనల ప్రకారం ప్రభుత్వం సేకరించే అటవీ భూముల్లో భూమిని కేటాయించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement