చౌక దుకాణాల డీలర్ షిప్పులు కట్టబెట్టేందుకు యత్నాలు
సాక్షి, కర్నూలు : జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు చౌక దుకాణాల డీలర్‌షిప్పులను కట్టబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో ఇన్‌చార్జీల పాలనలో ఉన్న రేషన్‌షాపులకు నోటిఫికేషన్ ఇచ్చి శాశ్వత డీలర్ల నియామకం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన తమ్ముళ్ల రుణం తీర్చుకునేందుకు అధికారపార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. పనిలోపనిగా ఎక్కువ షాపుల డీలర్‌షిప్పులను చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,411 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అవకతవలకు పాల్పడిన కొందరు రేషన్ డీలర్లను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు, బనగానపల్లె, నందికొట్కూరులో పలు చౌకధరల దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేశారు. వీటిని సమీపంలోని కొందరు డీలర్లకు అప్పగించారు. ఇప్పుడు వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి శాశ్వత ప్రాతిపదికన డీలర్లకుఅప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి అర్హులను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా గత సెప్టెంబరు నెలలో ఖాళీలుగా ఉన్న రేషన్‌షాపులకు డీలర్లను భర్తీ చేసే ప్రక్రియకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇక్కడే అసలు కథ మొదలైంది. అప్పటి వరకూ కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న రేషన్‌షాపులను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ నేతలు వేసిన ఎత్తుగడ ఫలించింది. ఫలితంగా ఆ నోటిఫికేషన్‌ను ఉన్నతాధికారులు తాత్కాలికంగా నిలిపివేయడం.. వెనువెంటనే కొందరి డీలర్లపై కక్షపూరిత చర్యలకు ఉపక్రమించడం.. మాటవినని వారిపై అక్రమ కేసులు బనాయించడం.. మరు క్షణమే ఆయా డీలర్లను సస్పెండ్ చేయడం వంటి ప్రక్రియలు చకచకా జరిపోయాయి. ఒక్క ఆదోని డివిజన్‌లోనే ఈ విధంగా దాదాపు 100 మంది డీలర్లను సస్పెండ్ చేసి.. సమీపంలోని మరో డీలరుకు ఆ దుకాణాలను అప్పగించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా 400 వరకు దుకాణాలు ప్రస్తుతం ఇన్‌చార్జుల పాలనలో ఉన్నాయి.
తాజా మళ్లీ తెరపైకి నోటిఫికేషన్..
గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన నోటిఫికేషన్‌ను మరోసారి జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు పనిలోపనిగా నోటిఫికేషన్ జారీ అయ్యేలోగా మరికొందరి డీలర్లపై అక్రమ కేసులు నమోదు చేయించి వాటిని కూడా తమ్ముళ్లకే అప్పగించాలని కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ మాట వినని డీలర్ల జాబితాను సిద్ధం చేసి వారిపై కేసులు బనాయించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇప్పటికే సమీప డీలర్లకు అప్పగించి రేషన్ షాపులను తెలుగు తమ్ముళ్లకు అధికారులు తాత్కాలిక కేటాయింపుల కింద అప్పగించారు. అయితే రేషన్ దుకాణాలు తాత్కాలిక కేటాయింపులు చేయకూడదనే ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఇటీవల వంద మందికి అక్రమంగా దుకాణాలు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా చౌకధరల దుకాణాల కేటాయింపు అధికారం ఆర్డీవోలకు ఉంది. వీటికి నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపులు చేయకూడదు. కానీ కర్నూలు జిల్లాలో పదుల సంఖ్యలో దుకాణాలను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై జిల్లాలో దూమారం రేగుతోంది.
తమ్ముళ్లే.. ఇక డీలర్లు!
Published Tue, Mar 3 2015 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement