
సినిమాల్లో ఛాన్స్ రాలేదని..
లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య
పెద్దాపురం(సామర్లకోట) : గాయకుడై గాత్రం వినిపించాల్సిన ఆ గొంతుకు ఉరితాడు బిగిసి.. శాశ్వతంగా మూగబోయిన సంఘటన ఇది. సినిమాల్లో సింగర్ కావాలని కలలు కన్న అతడు.. చదువును కూడా నిర్లక్ష్యం చేసి.. పాటలు పాడే ఛాన్‌స కోసం ఎంతో ప్రయత్నించాడు. అటు సినిమాల్లో పాడే అవకాశం లభించక.. ఇటు చదువూ దక్కకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఇంట్లో ముఖం చూపించలేనంటూ ఆ యువకుడు ఓ లాడ్జిలో ఉరి వేసుకున్నాడు. ఎస్సై వై.సతీష్ కథనం ప్రకారం.. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నానికి చెందిన మందారపు వెంకట్రాజు (24) ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.
అతడి తల్లిదండ్రులు శ్రీనివాస్, ఆదిలక్ష్మి కౌలు వ్యవసాయం చేస్తున్నారు. వీరు రెండెకరాలు కౌలు సాగు చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడైన వెంకట్రాజు ఇంకా పై చదువులు చదువుతున్నానంటూ ఇంట్లో తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకునేవాడు. అతడికి సినిమాల్లో సింగర్ కావాలని కోరిక ఉండేది. ఆ ప్రయత్నం కోసం హైదరాబాద్, చెన్నై చుట్టూ అనేకసార్లు తిరిగాడు. అతడికి ఎటువంటి అవకాశం లభించకపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు.
ఇంటికి వెళ్లి ముఖం చూపించలేక, ఈ నెల 18న పెద్దాపురంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. రెండు రోజుల అద్దె ముందుగా చెల్లించాడు. ఎక్కువ రోజులు ఉండడంతో, అద్దె తర్వాత ఇస్తానని లాడ్జి నిర్వాహకులతో చెప్పారు. ఇలాఉండగా గురువారం ఉదయం నుంచి వెంకట్రాజు గది తలుపులు తెరువలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది సాయంత్రం గది కిటికీ నుంచి లోనికి చూశారు. ఫ్యాన్‌కు వెంకట్రాజు ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించి, ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్సై సతీష్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. ఇంటికి వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, ఎస్సై సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు చనిపోయాడని తెలిసి వెంకట్రాజు తల్లిదండ్రులు బోరున విలపించారు.