సాక్షి, నెల్లూరు: జిల్లా పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే స్థాయిలో నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రశాంతతకు మారుపేరైన సింహపురి క్రమేణా అశాంతికి నిలయంగా మారుతోంది. ఆర్థిక నేరాలు ఎక్కువయ్యాయి.
చీటీలు, చైన్‌లింక్ స్కీమ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నాయి. నిరుద్యోగుల బలహీనతలను ఆసరగా చేసుకున్న పలువురు ఉద్యోగాలిస్తామంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంటా బయట మహిళలకు రక్షణ కొరవడింది. మెడలో బంగారు నగలు వేసుకుని బయటకు వస్తే మళ్లీ ఇంటికి వెళ్లే లోపు అవి ఉంటాయనే గ్యారంటీ లేకుండా పోతోంది. మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు అధికమయ్యాయి.
అంతర్రాష్ట్ర దొంగలు జిల్లాలో తిష్టవేశారు. బిట్రగుంట, కావలి, చిత్తూరు జిల్లాలోని ఓజికుప్పం, అనంతపురం, గుంతకల్లు, తమిళనాడు, కర్ణాటకకు చెందిన దొంగల ముఠాలు చెలరేగిపోతున్నాయి.
శేషాచలం అడవుల్లో నిఘా పెరగడంతో ఎర్రచందనం అక్రమ రవాణాకు జిల్లా అడ్డాగా మారింది. వెలుగొండల్లోని విలువైన ఎర్రచందనం సంపదను స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు.
ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌లు పెరిగాయి. నెల్లూరు సిటీతో పాటు అన్ని పట్టణాలు, పల్లెలకు క్రికెట్ బెట్టింగ్ విస్తరించింది. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సీజన్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ మాయలో పడి వందలాది కుటుంబాలు వీధినపడుతున్నాయి.
పారిశ్రామికీకరణ నేపథ్యంలో జిల్లాలో భూముల ధరకు రెక్కలొచ్చాయి. అదే సమయంలో భూమాఫియా చెలరేగుతోంది. పలువురు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఆక్రమించి దందాలు చేస్తున్నారు.
ఇసుక, సిలికా అక్రమ వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు టర్బో లారీలుగా సాగుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు భారీగా లారీలు ఇసుక, సిలికాతో తరలిపోతున్నాయి.
మద్యం ఏరులై పారుతోంది. 24 గంటలూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులకు తెలిసినా నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూ తెలియనట్టే వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
నెల్లూరుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొందరు వ్యభిచార స్థావరాలు నిర్వహిస్తున్నారు. కొందరు హైటెక్ పద్ధతిలో వ్యభిచారం చేస్తూ కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. ఇదంతా పోలీసు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలున్నాయి.
నెల్లూరుతో పాటు పలు ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ పరిస్థితి అధ్వానంగా మారింది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ మారినప్పుడల్లా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా అవి నాలుగు రోజులకే పరిమితమవుతున్నాయి.
బాధ్యతల స్వీకరణ రేపు
జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సెంథిల్‌కుమార్ బుధవారం నెల్లూరు రానున్నారు. గురువారం ఆయన బాధ్యతలు చేపడతారు. ఇటీవల వరకు అనంతపురం ఎస్పీగా వ్యవహరించిన ఆయన విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేస్తూ, సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తారని గుర్తింపు పొందారు. నేరస్తులు, అక్రమాలు, అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని ఆయన గత పనితీరు స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో నేరగాళ్లకు షెల్టర్‌జోన్‌గా మారిన నెల్లూరుకు ఎస్పీగా సెంథిల్‌కుమార్ రావడంతో శాంతిభద్రతల విషయంలో ఆయనపైనే జిల్లా ప్రజలు ఆశలుపెట్టుకున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేసి పాటు శాంతి భద్రతలను అదుపులోకి తెస్తారని ఆశిస్తున్నారు.
గాడితప్పిన పోలీసు వ్యవస్థ
ప్రధానంగా పోలీసు వ్యవస్థ గాడితప్పింది. ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చెడ్డపేరు మూటగట్టుకుంటున్నారు. ఏకంగా దొంగలతో చేతులు కలిపిన సంఘటనలు వెలుగు చూడడంతో గతంలో బిట్రగుంటలో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. పలువురు కానిస్టేబుళ్లు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొం టున్నారు. ఇక మద్యం మత్తులో వీరంగం సృష్టించిన కానిస్టేబుళ్లు పలువురు ఉన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోనూ ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ స్టేషన్లలో దీర్ఘకాలికంగా తిష్టవేసిన సిబ్బంది అంతా తామై వ్యవహరిస్తున్నారు. జీడీ వ్యవస్థ పేట్రేగిపోతోంది. టీ బంకు నుంచి స్మగ్లింగ్ వరకు ప్రతి దానికీ ఓ రేటు నిర్ణయించి జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కొందరు ఏకంగా పేకాట, వ్యభిచార కేంద్రాలకు బాసటగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిఘా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఎస్పీకి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఈ విభాగంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారు ఇష్టారాజ్యంగా వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు సమాచారం. జిల్లాలోని అనేక పోలీసుస్టేషన్లు సివిల్ పంచాయితీలకు నిలయంగా మారాయి. సామాన్యులకు మాత్రం సకాలంలో న్యాయం జరగని పరిస్థితి నెలకొంది. సీసీఎస్ విభాగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. అధికారులున్నా సరైన విధులు లేక ఖాళీగా కార్యాలయాల్లో కూర్చుని పిచ్చాపాటి మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు.
ఆశలన్నీ సెంథిల్‌పైనే
Published Wed, Jul 30 2014 3:02 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement