అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన వాన మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. కొన్ని మండలాల్లో దట్టమైన మేఘాలు ఆవరించి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.
మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు గాండ్లపెంట మండలంలో అత్యధికంగా 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కదిరిలో 50.2 మి.మీ, తలుపుల 45, ముదిగుబ్బ 39.2, యల్లనూరు 35.4, మడకశిర 35, నల్లమాడ 31.8, కంబదూరు 27, ఎన్‌పీకుంట 25.4, తాడిమర్రి 24.2, నల్లచెరువు 23.6, పుట్లూరు 23, ఆత్మకూరు 20.2, తాడిపత్రిలో 20 మి.మీ మేర వర్షం పడింది. తక్కిన అన్ని మండలాల్లోనూ ఓ మోస్తరుగా వర్షపాతం నమోదైంది. జిల్లా అంతటా 811 మి.మీ వర్షం కురవడంతో 12.9 మి.మీ సగటు నమోదైంది.
అక్టోబర్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా... ప్రస్తుతానికి 37.8 మి.మీ కురిసింది. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 416.9 మి.మీ వర్షం పడాల్సివుండగా ఏడు శాతం తక్కువగా 388.2 మి.మీ నమోదైంది. కాగా... రానున్న రెండు రోజులూ వర్షం పడే సూచనలున్నాయని రేకులకుంటలోని వాతావరణ, వ్యవసాయ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ ఎస్.మల్లీశ్వరి, సాంకేతిక అధికారి పి.వెంకటరావు మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 21 నుంచి 48 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించారు. అల్పపీడన ద్రోణి ప్రభావం తగ్గే వరకు వేరుశనగ పంట తొలగించుకోవద్దని రైతులకు సూచించారు.
వర్షం ఎక్కువైతే పంటలకు నష్టం
జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు చేటుతెచ్చేలా ఉన్నాయి. వీటివల్ల ఖరీఫ్, రబీ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. జూన్‌లో జిల్లావ్యాప్తంగా 40 వేల హెక్టార్లలో సాగైన వేరుశనగ పంటను చాలా చోట్ల తొలగించారు. అయితే... వేరుశనగ కట్టె పొలాల్లోనే ఉండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగైదు రోజులు వర్షం కొనసాగితే పంట మొత్తం కుళ్లిపోయే ప్రమాదముంది. చెట్టుకు ఉన్న రెండు, మూడు కాయలు నల్లబారడమే కాకుండా పశుగ్రాసం కూడా పనికిరాకుండా పోతుంది. వాములు వేసిన ప్రాంతాల్లో కూడా లోపల బూజు వచ్చే అవకాశముంది.
కళ్యాణదుర్గం, మడకశిర వ్యవసాయ సబ్ డివిజన్లతో పాటు రాప్తాడు, బుక్కపట్నం, పెనుకొండ, కనగానపల్లి, రామగిరి తదితర మండలాల్లో వేరుశనగ రైతులు నష్టపోయే పరిస్థితి కన్పిస్తోంది. రబీలో 50 వేల హెక్టార్లకు పైగా సాగైన పప్పుశనగ పంట కూడా దెబ్బతినే అవకాశముంది. పొలాల్లో నీళ్లు నిలబడితే లేత పప్పుశనగ పైరు కుళ్లిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు ఆముదం పంటను సైతం దెబ్బతీసే పరిస్థితి ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల తర్వాత ఇటీవల కొంత కోలుకున్న ఆముదం పంట ఇప్పుడు పూత, గెల దశలో ఉంది. జడివాన వల్ల దిగుబడులు తగ్గే అవకాశముందని రైతులు చెబుతున్నారు.
వానో వాన..
Published Wed, Oct 23 2013 2:45 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement