అనంతపురం అగ్రికల్చర్/ ఉరవకొండ, న్యూస్‌లైన్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో అక్టోబర్ మూడో వారంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు వేరుశనగతో పాటు పప్పుశనగ రైతులనూ దారుణంగా దెబ్బతీశాయి. అధిక వర్షాల వల్ల పొలాల్లో నీరు చేరడంతో పప్పుశనగకు ‘కల్లోటోట్రైకమ్ బ్లైట్’ అనే కొత్తరకం తెగులు సోకింది. దీనివల్ల పంట నిలువునా ఎండిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత రబీ సీజన్‌లో పప్పుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 83,678 హెక్టార్లు.
అయితే.. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మంచి వర్షాలు పడటంతో జిల్లాలో నల్లరేగడి భూములు కలిగిన 25 మండలాల పరిధిలో90 వేల హెక్టార్లలో పంట సాగు చేశారు. ఉరవకొండ మండలంలో 13 వేల హెక్టార్లు, వజ్రకరూరులో తొమ్మిది వేలు, విడపనకల్లులో 12 వేలు, పుట్లూరులో ఏడు వేలు, యల్లనూరు మండలంలో మూడు వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో పప్పుశనగ సాగైంది. ఈ మండలాల పరిధిలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో దాదాపు ఏడు వేల హెక్టార్లలో పంట తుడిచిపెట్టుకుపోయింది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారమే ఐదు వేల హెక్టార్లలో దెబ్బతింది.
ఉరవకొండ వ్యవసాయ డివిజన్‌లోని ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, గుంతకల్లు వుండలాల్లో అక్టోబర్ రెండో తేదీ నుంచి పప్పుశనగ సాగులోకి వచ్చింది. అయితే... అక్టోబర్ 22 నుంచి 26 వరకు ఎడతెరిపిలేని వర్షం కురవడంతో పంటకు తెగులు సోకింది. ఎండిపోయిన పంటను రైతులు తొలగించేస్తున్నారు. దీని స్థానంలో కొందరు ధనియాలు, మరికొందరు మరోసారి పప్పుశనగనే విత్తుకుంటున్నారు. వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఏరువాక సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ ఇటీవల ఉరవకొండ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పప్పుశనగ పొలాలను పరిశీలించారు. పూర్తిగా ఎండిన పంటను తొలగించాలని రైతులకు సూచించారు. ఎండుతెగులు వ్యాపించకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చారు.
పొలాల్లో తేమ శాతం ఎక్కువ కావడం వల్లనే ఈ తెగులు వ్యాపించిందని శాస్త్రవేత్త డాక్టర్ జాన్‌సుధీర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తొలుత లేత ఆకులు ఎండిపోయి క్రమంగా చెట్టంతా ఎండిపోతుందని వివరించారు. 2011లోనూ ఈ తెగులు సోకినట్లు గుర్తు చేశారు. లక్షణాలు కనబడిన వెంటనే 1 గ్రాము బావిస్టన్ లేదా 1 మి.లీ టిబుకొనజోల్ లేదా 2 మి.లీ కాంటాఫ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. తెగులు ఉధృతిని బట్టి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలన్నారు. తేమ ఆరిన తరువాత పొలంలో అంతర కృషి చేయాలన్నారు.
పొట్టు మిగిలింది
Published Sat, Nov 9 2013 3:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement