ఇక వెలుగులే వెలుగులు!
- అక్టోబర్ రెండు నుంచి నిరంతర విద్యుత్ సరఫరా
- కేంద్రం పెలైట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ఎంపిక
- గృహావసరాలకు తొలి ప్రాధాన్యం
- వ్యవసాయం, పరిశ్రమలకు ఇచ్చేందుకు కృషి
విజయవాడ : జిల్లా వాసులకు త్వరలో కరెంటు కష్టాలు తీరనున్నాయి. అక్టోబర్ రెండో తేదీ నుంచి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్పీడీసీఎల్) అధికారులు చేస్తున్నారు. దేశంలో విద్యుత్ సమస్యను తీర్చి నిరంతరంగా కరెంటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 24 ఁ 7 విద్యుత్ సరఫరా చేసేందుకు ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లను ప్రయోగాత్మకంగా (పెలైట్ ప్రాజెక్టు) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతర సరఫరాకు అవసరమైన విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
10.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం
జిల్లాలో 13.82 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. నిత్యం 10.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. వేసవిలో జిల్లాలో 13.5 మిలియన్ యూనిట్లు అవసరం కాగా, అందులో నగరానికి సుమారు ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జిల్లా అంతటికీ విద్యుత్ ఇవ్వకపోయినా ఎంపిక చేసిన నగరాల్లో విజయవాడ ఉండడంతో నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందని భావిస్తున్నారు.
ఆచరణలో సాధ్యమేనా?
గత వేసవిలో జిల్లాలో 12 గంటలు, నగరంలో ఐదు గంటలు విద్యుత్ కోతలు విధించారు. ఇప్పటికీ గ్రామాల్లో వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ నాలుగైదు గంటలకు మించి ఇవ్వడం లేదు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నిరంతర విద్యుత్ సరఫరా అంటే ఎంతమేరకు సాధ్యమనే ప్రశ్న ఉదయిస్తోంది. అవసరమైన అదనపు విద్యుత్‌ను నేషనల్ గ్రిడ్ నుంచి మన రాష్ట్రానికి కేటాయిస్తేనే ఇక్కడ నిరంతర సరఫరా సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు
అవకాశాలున్నాయి
నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు నగరాన్ని ఎంపికచేసిన మాట వాస్తవమే. అందుకు సరిపడా మౌలిక సదుపాయాలు మన వద్ద ఉన్నాయి. వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదు. వాడుకున్న విద్యుత్‌కు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది వ్యవసాయ, గృహావసర ఫీడర్లను మాత్రమే వేరుచేస్తే సరిపోతుంది.
-ఎన్.వెంకటేశ్వర్లు, డీఈ