గుండె కోత...
- కర్షకులకు కరెంట్ కష్టాలు
- 4 గంటలూ రాని విద్యుత్
- అంధకారంలో గ్రామాలు
- లోడ్ రిలీఫ్ పేరిట సరఫరాకు బ్రేక్
ఉదయం 9 గంటలు : వ్యవసాయూనికి త్రీఫేజ్ కరెంట్ వచ్చింది.
10.30 గంటలు : కట్ అయింది.
11.00 గంటలు : మళ్లీ కరెంట్ వచ్చింది.
12.30 గంటలు : విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అప్పటినుంచి అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు కరెంట్ రానే లేదు. ఇదీ... వర్ధన్నపేట, పంథిని సబ్‌స్టేషన్ల పరిధిలో బుధవారం చేపట్టిన ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో తేలిన నిజం. మొత్తం మీద రోజులో వ్యవసాయూనికి సరఫరా అయిన విద్యుత్ రెండు గంటల ముప్పై నిమిషాలు మాత్రమే. అంతేకాదు... వీటి పరిధిలోని గ్రామాలకు సరఫరా అయ్యే సింగిల్ ఫేజ్ కరెంట్ పరిస్థితి ఇలానే ఉంది. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్న అధికారిక కోత పోనూ... రాత్రి 11.30 నుంచి 1.30 గంటల వరకూ అనధికారికంగా విద్యుత్ నిలిచిపోవడంతో ఆయూ గ్రామాలు అంధకారమయ్యూయి.
హన్మకొండ, న్యూస్‌లైన్ : జిల్లాలో విద్యుత్ సరఫరా అధ్వానంగా మారింది. వ్యవసాయూనికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలు ప్రగల్భాలకే పరిమితమయ్యూయి. అధికారుల హామీలు నీటిమూటలయ్యూయి. విద్యుత్ సరఫరా సమయం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆరు... ఐదు... నాలుగు గంటలకు పడిపోగా... తాజాగా మరింత దిగజారినట్లు వర్ధన్నపేట, పంథిని సబ్‌స్టేషన్ల పరిధిలో బుధవారం చేపట్టిన పరిశీలనలో రూఢీ అయింది. అదేవిధంగా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ ఎప్పుడొస్తుందో తెలవని పరిస్థితి ఉంది. అక్కడ రాత్రి పూట సరఫరా నిలిపివేస్తుండడంతోపాటు పరిశ్రమలకు ఫీక్ అవర్స్ విధించారు.
ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్‌ను లైటింగ్‌కు మాత్రమే వినియోగించాలని ఆంక్షలు పెట్టారు. ఇది పోనూ అనధికారికంగా ఒక్క రోజు పవర్ హాలిడేకు ఆదేశాలిచ్చారు. డిమాండ్ మేరకు సప్లయ్ కావాల్సిన విద్యుత్‌లో భారీ స్థాయిలో లోటు ఉండడమే ఇందుకు కారణం. వరంగల్ సర్కిల్‌కు ప్రస్తుతం 8.24 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరముండగా... మూడు రోజుల నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ 6.12 మిలియన్ యూనిట్లు మాత్రమే. 2.12 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండడంతో కోతలు అనివార్యమైనట్లు తెలుస్తోంది.
రబీ రంది...
వ్యవసాయూనికి ఉదయం 5 గంటలు, రాత్రి 2 గంటల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి. కానీ... ప్రస్తుత పరిస్థితుల్లో 4 గంటలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 2.60 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా... రబీ సీజన్‌లో ప్రస్తుతం పంటలన్నీ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఏడు గంటల సరఫరా ఇస్తేనే... ఈ పంటలు గట్టెక్కే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అధికారులు చెబుతున్నట్లు 4 గంటలపాటు విద్యుత్ సరఫరా అవుతున్నా... 20 నిమిషాలకోసారి బ్రేక్ ఇస్తూ అనధికారిక కోతలు అమలు చేస్తున్నారు. ఉదయం 2 నుంచి 3 గంటలు, రాత్రి ఓ గంట ఇస్తున్నా... లోడ్ రిలీఫ్ (ఎల్‌ఆర్) పేరిట నిలిపివేస్తున్నారు.
గ్రామాలు
గ్రామాల్లో కరెంట్ బుగ్గ వెలిగితే... ప్రజలు అదే అదృష్టంగా భావిస్తున్నారు. అధికారికంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ కోత ఉంటుందని అధికారులు ప్రకటించారు. కానీ... రాత్రి పూట మరో 3 గంటలకు పైన అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. అంటే 14 గంటలకు పైనే కోత పెడుతున్నట్లు తెలుస్తోంది.
మండలాలు
మండలాలు, సబ్ స్టేషన్ కేంద్రాలు, పట్టణాలు, నగర పంచాయతీలు, మునిసిపాలిటీల్లో అధికారికంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు కోతలు అమలు చేయూలి. కానీ... ఈ వారం రోజుల నుంచి ఆ సమయూలతోపాటు రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ కరెంట్ ఉండడం లేదు.
కార్పొరేషన్
వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంకా కోతలు విధించడం లేదని అ దికారులు చెబుతున్నా... వ్యూహాత్మకంగా సరఫరా నిలిపివేస్తున్నారు. ఏరియాల వారీగా గంటల తరబడి సరఫరా ఆపేస్తున్నారు. సుబేదారి సెక్షన్‌లోని దర్గారోడ్ ఏరియాలో గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. అధికారులను అడిగితే... మాకేం సమాచారం లేదంటూ చెబుతున్నారు. అంతేకాకుండా... బాలసముద్రం, ఏకశిల పార్కు ప్రాం తాల్లో కూడా మధ్యాహ్నం రెండు గం టలు కోత పెట్టారు. వరంగల్ ప్రాం తంలోని పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు ప్రాంతాల్లో రెండు గంటలపాటు సరఫరా ఆపేశారు.
రెండు దొయ్యలు కూడా పారడం లేదు...
రబీలో ఐదెకరాల్లో వరి సాగు చేశా. ఎండా కాలం రెండు, మూడు రోజులకే తడి పెట్టాల్సి వస్తుంది. రోజుకు మూడు గంటలు కూడా కరెంట్ సక్కగా ఇస్తలేరు. రోజుకు రెండు పొలం దొయ్యలు కూడా పారడం లేదు. ఇట్లయితే పంట ఎండిపోవుడు ఖాయం. ఇప్పటికే ఎకరాకు రూ. 10వేల పెట్టుబడి పెట్టిన. నీళ్లున్నా... కరెంట్ ఉంటలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
- గుజ్జుల సంపత్‌రావు, రైతు రాంపూర్
అన్యాయం చేస్తున్నారు...
రబీ పంటలు సాగుచేసుకోండి.. కరెంటు కోసం భయపడకండని భరోసా ఇచ్చి.. పొట్టదశకు వచ్చినంక అన్యాయం చేస్తున్నారు. కరెంట్ ఏడు కాదుకదా.. మూడు గంటలు కూడా ఇత్తలేరు. రూ. 40 వేలు పెట్టి మూడెకరాల్లో పంట సాగు చేస్తే... ఎకరం ముందుగాల్నే ఎండిపోయింది. పొద్దస్తమానం కరెంటు కోసం బాయికాన్నే ఉంటున్నా. మొన్న(26న) మధ్నాహ్నం పోయిన కరెంటు మరుసట్రోజు (27) రాత్రి 9 గంటలు దాటినా రాలేదు. వచ్చినా... కరెంటు నాలుగైదు సార్లు ట్రిప్ అయితాంది. సక్కగా మొదటి మడి కూడా తడవడం లేదు.
- పందిపెల్లి నర్సింహారెడ్డి, రైతు, బచ్చన్నపేట
చేతికొచ్చే దశలో దెబ్బతీస్తోంది
రెండు ఎకరాల్లో మిర్చి, నాలుగెకరాల్లో మొక్కజొన్న, పత్తి సాగు చేస్తున్నా. మరో 15 రోజుల్లో మిర్చి పంట చేతికొచ్చే సమయం. నెల రోజులుగా కరెంటు సరిగ్గా ఉంటలేదు. రోజంతా కరెంట్ కోసం బావి వద్ద పడిగాపులు కాస్తున్నా. నీరు సక్కగా లేక మిర్చి ఇప్పటికే దెబ్బతింది. ఉన్న పంటనైనా కాపాడుకుందామని రాత్రిపూట కరెంట్ కోసం బావుల వద్దే పడుకుంటున్నా. అయినా ఫలితం లేకుండా పోతోంది. కరెంట్ కోతలతో పంట చేతికొచ్చే దశలో దెబ్బపడుతోంది.
- బాదావతు మోహన్, రైతు, ఈర్యతండా
పై నుంచే నిలిపివేస్తున్నారు...
ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరగడంతో లోడ్ రిలీఫ్ అమలు చేస్తున్నాం. లోటు ఎక్కువగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి పూట కూడా కోత పెడుతున్నాం. పైనుంచే సరఫరా నిలిపివేస్తున్నారు. వ్యవసాయ పంటలకు ప్రస్తుతం ఫీక్ టైం. అందుకే సప్లయి చేసిన విద్యుత్‌లో రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీంతో వినియోగదారులకు కోతలు తప్పడం లేదు.
- మోహన్‌రావు, వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ