ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల విధానానికి ఈ ఏడాది సాంకేతిక విద్యామండలి శ్రీకారం చుట్టింది.
- 1290 మంది విద్యార్థులు హాజరు
- పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన
- నేడు, రేపు ఆప్షన్లు మార్చుకునే అవకాశం
- సెప్టెంబర్ 1 నుంచి ఆడ్మిషన్లు
సాక్షి, విజయవాడ : ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల విధానానికి ఈ ఏడాది సాంకేతిక విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ 7వ తేదీన మొదలై సోమవారంతో ముగిసింది. నగరంలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించింది. నగరంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల పరిశీలనకు కొంత మేరకు బాగానే విద్యార్థులొచ్చినా... వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు మాత్రం విద్యార్థుల నుంచి స్పందన పూర్తిగా కొరవడింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థుల భవితవ్యం కొంత గందరగోళంలో పడటంతో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాషాట్రల్లో విద్యాభాస్యానికి తరలివెళ్లారు. జిల్లాలోని 41 ఇంజనీరింగ్ కళాశాలల్లో 13,384 సీట్లు ఉన్నాయి. వీటిల్లో 27 కళాశాలలు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈక్రమంలో 41 ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 2,600 మేనేజ్‌మెంట్ కోటా సీట్లున్నాయి. రాష్ట్ర విభజన పరిణామాల క్రమంలో విద్యార్థులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఇంజనీరింగ్ కళాశాలలు రకరకాల ఆఫర్లతో హడావుడి చేస్తున్నాయి.
ముగిసిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ...
ఈనెల 17న నగరంలోని ఆంధ్రలయోలా కళాశాలలో, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌ఆప్షన్ల కార్యక్రమం నిర్వహించారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన వెబ్‌ఆప్షన్లకు 1290 మంది విద్యార్థులు హజరయ్యారు. పాలిటెక్నిక్ కళాశాలలో 500 మంది విద్యార్థులు, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో 300 మంది ఆంధ్ర లయోలా కళాశాలలో 491 మంది విద్యార్థులు హజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 7262 మంది విద్యార్థులు హజరయ్యారు.
నేడు,రేపు చివరి అవకాశం..
ఇంజనీరింగ్ ప్రవేశం కోరే విద్యార్థులకు ఆప్షన్లు మార్చుకోవటానికి మంగళ, బుధవారాల్లో షెడ్యూల్‌ను నిర్ణయించారు. ఆప్షన్లు మార్చుకునే విద్యార్థులకు ఇదే చివరి ఆవకాశం. ఈ ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ 1నాటికి ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు మొదలు పెట్టనున్నారు.