భీమసింగి సుగర్స్(జామి): ప్రభుత్వం నియమించిన సహకార చక్కెర కర్మాగారాల అధ్యయనం శుక్రవారంతో ముగిసింది. కమిటీ సభ్యులు భరద్వాజ, గురువారెడ్డిలు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులను,భీమసింగి సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కమిటీ సభ్యులకు మొరపెట్టుకున్నారు. కర్మాగారంలో కటింగ్ ఆర్డర్ల విషయంలోను, ఇబ్బందుల విషయంపై, అలాగే చెరుకు మద్దతు ధర విషయంలో గిట్టుబాటు కావడం లేదని వాపోయారు.
భీమసింగి సహకార చక్కెర కర్మాగారం మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి, జెడ్‌పీటీసీ బండారు పెదబాబు మాట్లాడుతూ కర్మాగారం ప్రస్తుతం రూ.40కోట్ల నష్టాల్లో ఉందని, ప్రభుత్వం ఈనష్టాలను భర్తీచేసి ఆదుకోవాలని, పాతఅప్పులను ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. చెరుకు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలన్నారు.
సహకారచక్కెర కర్మగారాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధ్యయన కమిటీ
సహకార చక్కెర కర్మాగారాల వ్యవస్థపై అధ్యయన కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.సహకార వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పురాతన యంత్రాలతో పనిచేస్తోందని, ప్రసుత్తం ఈ యంత్రపరికరాల విలువ శూన్యమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొత్తటెక్నాలజీ వచ్చిందని, పాత పరిస్థితులే కొనసాగితే కర్మాగారం మనుగడ కష్టతరమన్నారు. సహకార వ్యవస్థలో రైతులు,యాజమాన్యం సంయుక్తంగా కర్మగారాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. రైతులకు గిట్టుబాటుకావడంలేదని,యాజమాన్యం నష్టాల్లో ఉందని ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా ఉంటే కర్మాగారం అభివృద్ధి చెందదన్నారు. అధ్యయనం నివేదికను పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అందిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ బండారు పెదబాబు,రైతులు వి.రామావతారం,ఎ.అప్పలనాయుడు,సీహెచ్.సూరిబాబు, కె.ఎర్నిబాబు,ఎం.డి. డి.నారాయణరావు పలువురు రైతులు పాల్గొన్నారు.