హిందూ సమాజమే లక్ష్యం | The goal of Hindu society | Sakshi
Sakshi News home page

హిందూ సమాజమే లక్ష్యం

Published Sat, Dec 13 2014 2:11 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

దేశంలోని వంద కోట్ల మంది హిందువులను ఏకం చేసి సంఘటిత హిందూ సమాజాన్ని నిర్మించడం కోసమే విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) పనిచేస్తుందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్‌భాయ్ తొగాడియా పేర్కొన్నారు.

కడప కల్చరల్ : దేశంలోని వంద కోట్ల మంది హిందువులను ఏకం చేసి సంఘటిత హిందూ సమాజాన్ని నిర్మించడం కోసమే విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) పనిచేస్తుందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్‌భాయ్ తొగాడియా పేర్కొన్నారు. వీహెచ్‌పీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కడప మున్సిపల్ స్టేడియంలో హిందూ శంఖారావం పేరిట బహిరంగ సభ నిర్వహించారు.
 
 ముఖ్య వక్తగా పాల్గొన్న తొగాడియా మాట్లాడుతూ హిందువులలో ఐక్యత లేకపోవడంతోనే విదేశీయులు దాడి చేసి దేశాన్ని ఆక్రమించుకున్నారని, హిందువులను అణిచివేశారని ఆరోపించారు. ఇకనైనా హిందువులు అప్రమత్తం కాకపోతే కొంతకాలానికి ఈ దేశంలో హిందువులు అల్ప సంఖ్యాకులుగా మిగులుతారని హెచ్చరించారు. వంద కోట్లమంది హిందువులను నిద్ర లేపగలిగితే శత్రు దేశాలకు నిద్ర ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఇతర మతాలపై చూపుతున్న ప్రేమను హిందువులపై ఎందుకు చూపడం లేదని నిలదీశారు.
 
  హిందువులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హిందువుల ఆరోగ్య పరిరక్షణ కోసం వందలాది మంది హిందూ వైద్యులను సమీకరించామని, కొన్ని రోజుల్లో వారు వేల మందిగా మారతారని, ఏ హిందువు నుంచి ఫోన్ వచ్చినా వెంటనే స్పందించగలరని తెలిపారు. ముస్లింలకు వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులకు చేసిందేమిటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతోనే హిందువుల ఆత్మగౌరవం ఇనుమడించగలదని తొగాడియా స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టం లేకపోయినా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసి తీరుతామని పేర్కొన్నారు.
 మత మార్పిడి ఆపుదాం
 కొన్ని కారణాల వల్ల మన సోదరులైన హరిజనులను అంటరాని వారీగా దూరం ఉంచామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైన హిందువులంతా హరిజనులను తమ సోదరులుగా, ఆత్మ బంధువులుగా భావించి ఆదరించాలని, మనలో ఒకరిగా చూడాలని ఆయన సూచించారు.
 
  కుల ప్రసక్తి లేని దేశాన్ని చూడడమే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. వంద కోట్ల మంది హిందువుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా 200 కోట్ల పిడికిళ్లు పైకి లేస్తాయని ఆయన హెచ్చరించారు. హిందువులంతా ఒకరికోసం ఒకరు అన్నట్లుగా భావించాలని, రోజూ ఒక పిడికెడు బియ్యం, ఒక రూపాయి సాటి హిందువుల కోసం ఇవ్వగలిగితే దేశంలో హిందువులకు ఆకలి, దారిద్య్రం ఉండబోదని స్పష్టం చేశారు.
 
 గో రక్షణ కోసం....
 గోవు సకల దేవతలకు తల్లి లాంటిదని, దాని విలువ తెలియక వధించడం మూర్ఖత్వమని ఆయన విమర్శించారు. గోమూత్రం, పేడ తదితరాల నుంచి ఆరోగ్యపరంగా అత్యాధునికమైన షాంపూ, సబ్బులు, టూత్‌పేస్ట్, ఫేస్‌ప్యాక్, దోమల మందు తదితరాలను తయారు చేయవచ్చన్నారు. ఇంతటి ఉపయోగాలు గల గోవును వధించడం కంటే ఆశ్రయమిస్తే ఆర్థికంగా బలపడగలమన్నారు.
 
 ప్రత్యేక హెల్ఫ్‌లైన్
 వంద కోట్ల మంది హిందువులలో ఏ ఒక్కరికి వైద్యం, ఇతర సహాయం అవసరమైనా తక్షణసాయం అందించేందుకు ప్రత్యేకంగా 020 66803300 నెంబరుపై హిందూ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏ హిందువు ఒంటరి కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశామన్నారు. హిందువుల జాగరణ కోసం ఫేస్‌బుక్, ఎస్‌ఎంఎస్, వాట్స్‌ప్, ఈ-మెయిల్ ద్వారా ఒకరినొకరు సమాచారం పంపుకుని అందరూ ఒక్కటై వెంటనే స్పందించాలన్నారు. అవసరమైతే ధర్నాలు కూడా చేసేందుకు సిద్దంగా ఉండాలన్నారు.
 
 ఘన స్వాగతం
 తొగాడియా మున్సిపల్ స్టేడియం వద్ద ఘనస్వాగతం లభించింది. తొలుత గోపూజ, అనంతరం వేదికపై ఉన్న దేవతల చిత్రపటాలకు ప్రత్యేక పూజ చేసి అక్కడి సాధు, సంత్‌లకు పాదాభివందనం, సభికులకు అభివందనం చేశారు. సభానంతరం నిర్వాహకుల పక్షాన వేదపండితులు, సాధు సంత్‌లు తొగాడియాను వేదమంత్ర యుక్తంగా సత్కరించారు. అనంతరం సభికులతో శాంతి మంత్రం వల్లింపజేశారు. తొగాడియా రాకకు ముందు విశ్వహిందూపరిషత్ రాష్ట్ర ప్రముఖ్ బెరైడ్డి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు లక్ష్మినారాయణ, కార్యదర్శి కె.శ్రీనివాసులురెడ్డి, నగర కార్యదర్శి జేకే కృష్ణసింగ్, భజరంగ్‌దళ్ ప్రముఖ్ గణేష్, వీహెచ్‌పీ రాష్ర్ట నాయకుడు కేశవరావు, భానుప్రకాశ్, రామరాజు, సురేంద్రారెడ్డి, సాధుసంత్‌లు విరజానంద, స్వరూపానంద తదితరులు వీహెచ్‌పీ లక్ష్యాలను, ఉద్దేశాలను వివరిస్తూ ప్రసంగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement