
దేవా.. ఇదేం న్యాయం
► దశాబ్దాలుగా రైతుల సాగులో 274 ఎకరాలు
►ఇనాం భూములుగా గుర్తించి గతంలో హైకోర్టు తీర్పు
► రైతుల పేరిట పాసుపుస్తకాలు కూడా మంజూరు
► ఇప్పుడేమో ఎండోమెంట్ భూములుగా రికార్డుల్లో మార్పు
► కౌలు వేలానికి దేవాదాయ శాఖ సిద్ధం.. రైతుల గగ్గోలు
► మూడు గ్రామాల్లో 274 ఎకరాల్లో సాగులో ఉన్న 200 రైతుల్లో ఆందోళన
► రికార్డుల్లో మార్పులు చేయడం తగదంటున్న రైతులు
ఇంతకాలం అన్నం పెట్టిన భూములు దూరం కానుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాలుగా తమ సాగులో ఉంటున్న భూములు అసలు మీవికాదని అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇంతవరకు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఆ భూములను ఇప్పుడు ఎండోమెంట్ శాఖవిగా గుర్తించడంతో వాటిని వదులు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కె.కోటపాడు : మండలంలోని చౌడువాడ, పాచిలవానిపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో సుమారు 200 మంది రైతుల సాగులో 274 ఎకరాల భూమి ఉంది. గత ఏడాది నవంబర్ 30 వరకు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఈ పంట పొలాలను ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎండోమెంట్ భూములుగా నమోదు చేశారు. ఈ మేరకు ఆన్‌లైన్ పనులు పూర్తి అయ్యాయి. మరో వైపు ఈ భూములకు ఎండోమెంట్ శాఖ వారు మూడేళ్ల కాలానికి కౌలును నిర్దేశించేందుకు గ్రామాల్లో వేలం పాటలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో రైతు కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి.
ఎండోమెంట్ భూములు అన్యాక్రాంతం కాకుండా
ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 10న జీవో నంబర్ 343 జారీ చేసింది. దీని ప్రకారం ఈ మూడు గ్రామాల్లో శ్రీరాజా చింతలపాటి బుచ్చిసీతయ్యమ్మ బహద్దూర్ పేరున ఉన్న పొలాలను రెవెన్యూ అధికారులు శ్రీరాజా చింతలపాటి బుచ్చిసీతయ్యమ్మ సత్రం పేరున ఆన్‌లైన్ పనులు పూర్తిచేశారు. దీంతో ఆయా భూములు సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 60 ఏళ్లకు పైబడి సాగులో ఉన్న భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఎంటువంటి సమాచారం లేకుండా భూములను ఎండోమెంట్ వారి పేరుతో రికార్డుల్లో ఎలా మార్పు చేస్తారని రైతులు రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
1959 నుండి వివాదం
చౌడువాడ, పాచిలవానిపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో ఉన్న 274 ఎకరాల భూములపై 1959 నుండి వివాదం నడుస్తోంది. 1959లో అప్పటి తహసీల్దార్ ఈ భూములు ఎండోమెంట్‌వి కాదని ఇనాంవని గుర్తించారు. దాని ఆధారంగా 1989లో అప్పటి ఆర్డీవో ఇనాం భూమిగా గెజిట్‌లో ప్రకటించారు. అయితే 1991లో భూములపై పునర్విచారణ చేయాలని డీఆర్‌వో ఆదేశించడంతో రైతులు హైకోర్డును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్డు 1994లో ఈ భూములను రైత్వారీ జమిందారి, ఇనాం విలేజ్‌గా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో అదే ఏడాది రెవెన్యూ అధికారులు ఈ భూములకు సంబంధించి కొంత మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఈ పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులు బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు మళ్లీ ఎండోమెంట్ భూమిగా మార్చడంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రజా ప్రతినిధులు, అధికారులు తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
హైకోర్టు రైతుల వాదననే సమర్థించింది
గతంలో హైకోర్టును ఆశ్రయించి తమ వాదనను వినిపించాం. ప్రస్తుతం మా సాగులో ఉన్న భూములను ఇనాం భూములుగా గుర్తించి కోర్టు తీర్పు చెప్పింది. కొందరు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఆ భూములను ఇప్పుడు ఎండోమెంటులిగా రికార్డుల్లో మార్పు చేయడం దారుణం. - పాచిల మహలక్ష్మి, రైతు, పాచిలవానిపాలెం
మా కుటుంబాలు రోడ్డున పడతాయి
పాచిలవానిపాలెం, చౌడువాడ, గరుగుబిల్లి గ్రామాల్లో ఇనాం భూములపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇనాం భూములకు రైత్వారీ పట్టాల కోసం రైతులు దరఖాస్తులు చేశారు. ఇనాం భూములుగా నమోదై ఉన్న భూములను ఇటీవల ఎండోమెంట్ భూములుగా నమోదు చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి
- రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, చౌడువాడ