సాక్షి, నల్లగొండ: ప్రీమెట్రిక్ బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం.. చివరకు ఉసూరుమనిపించింది. 2013-14 విద్యాసంవత్సరం నుంచి 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని సర్కారు హామీ
ఇచ్చింది.
వాగ్దానాన్ని నమ్మిన విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ , ఆదాయ పరిమితి వంటి నిబంధన అడ్డంకిగా మారినా అష్టకష్టాలు పడి దరఖాస్తులు సమర్పించారు. తీరా చూస్తే సగంమంది విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు మంజూరు చేసిన పాపాన లేదు.
ఇదీ పరిస్థితి....
ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు నుంచి పదోతరగతి చదివే ఎస్సీ విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తున్నారు. 5-8వ తరగతి బాలికలకు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1500, బాలురకు రూ. 1000 ఖాతాల్లో జమ చేస్తున్నారు. 9, 10వ తరగతి బాలబాలికలందరికీ రూ.2250 కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇంతే మొత్తంలో 9, 10వ తరగతి చదువుతున్న ఎస్టీ విద్యార్థులకూ ఖాతాల్లో వేస్తున్నారు.
ఈ ఏడాది నుంచి 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థినులకు రూ.1000 అందజేస్తామని సర్కారు ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.45వేలు ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంతేగాక కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే అంత తక్కువ మొత్తంలో ఆదాయాన్ని పేర్కొంటూ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేమని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. ఎలాగోలా ధ్రువీకరణ పత్రాలు పొంది రూ. 500 వరకు ఖర్చు చేసి దరఖాస్తు చేస్తున్నారు. ఉపకార వేతనాల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు కూడా తెరిచారు.
బీసీల్లో బాలికలకే అమలు....
ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం దాదాపు 14వేల మందికిపైగా బీసీ విద్యార్థినుల నుంచి అధికారులు దరఖాస్తులు పొందారు. వీరందరికీ ఉపకార వేతనాల కోసం ప్రభుత్వం 59.90లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. అయితే ఇవి 5990మందికే సరిపోతాయి. దీంతో వీటిని పదో తరగతికి చెందిన బాలికలకు మాత్రమే వీటిని అందజేయాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. మిగిలిన వారికి ఎప్పుడోస్తాయో తెలియని పరిస్థితి. కనీసం ప్రీమెట్రిక్ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో ఉపకార వేతనాలు ఇవ్వడంతో సర్కారు తీవ్రంగా విఫలమైందనడానికి ఇది నిదర్శనం.
కొందరికి పొడిగించి..
ఇంకొందరికి ముగించి
ప్రీమెట్రిక్ బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం ఒక్కసారిగా నిలిపివేసింది. గత నెల 31వ తేదీనే గడువు ముగిసింది. దరఖాస్తు చేసుకునేవారు మరో మూడువేల వరకు ఉండవచ్చని అంచనా. వాస్తవానికి బీసీ విద్యార్థుల ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు అందజేస్తామని విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రకటించింది. ఆదాయ ధ్రువీకరణ పరిమితి, సర్టిపికెట్ల జారీలో తీవ్ర జాప్యం కావడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంలో వెనుకబడ్డారు.
ఎస్సీ, ఎస్టీలకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు పొడిగించింది. బీసీ విద్యార్థులు తాజాగా అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలతో సిద్ధంగా ఉన్నప్పటికీ.. అర్ధంతరంగా దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఒకే పథకం కింద లబ్ధిపొందుతున్న వారిలో కొందరికి గడువు ముగించడం.. మరికొందరికి పొడిగించడమేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఇదేం విద్యాదీవెన..!
Published Wed, Feb 5 2014 4:00 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement