
అక్రమాలకు చిరునామా!
ఇది ‘రియల్’ మోసం
రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల మాయాజాలం
తప్పుడు చిరునామాతో తక్కువ ధరకే రిజిస్ట్రేషన్
ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలల్లో గండి
చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున కన్నం
వ్యవహారంలో ఓ కన్సల్టెన్సీ పాత్ర
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జాతీయ రహదారికి ఆనుకుని కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న స్థలంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసింది. అయితే, రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేసరికి వీకర్స్ సెక్షన్ కాలనీలో ఉందని చెబుతోంది. ఎందుకు ఇలా అడ్రస్‌లు మారుస్తోందనే విషయం లోతుగా విశ్లేషిస్తే.. కోట్ల రూపాయల్లో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న దుర్మార్గమైన ఆలోచన కనిపిస్తుంది. ఇందులోఅటురిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బందితో పాటు వెంకటరమణ కాలనీలోని ఓ కన్సల్టెన్సీ సంస్థ పాత్ర కూడా వెలుగుచూసింది.
కథ నడుస్తోంది ఇలా...!
జాతీయ రహదారికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న స్థలంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ వేస్తోంది. ఇది ఈద్గాకు సమీపంలో ఉంది. జాతీయ రహదారి నుంచి ఎల్కూరు బంగ్లాకు వెళ్లాలంటే(బళ్లారి చౌరస్తా నుంచి ఉల్చాల రోడ్డులో కాకుండా) ఈ వెంచర్‌ను దాటుకునే వెళ్లాలి. ఎల్కూరు ఎస్టేట్‌లోని స్థలానికి రిజిస్ట్రేషన్ చేయాలంటే చదరపు గజానికి రూ.5 వేలు కట్టాల్సిందే. అయితే, ఈ వెంచర్ అంతకంటే ముందుగానే జాతీయ రహదారికి అతి సమీపంలో ఉంది. అంటే ఈ లెక్కన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇంకా అధిక ధరను చెల్లించాల్సి ఉంటుందనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎల్కూరు బంగ్లాలో ఉన్న స్థలం కంటే ఇక్కడ ఇంకా తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అధికారులు. అది ఎలా అంటే.. ఈ స్థలం చిరునామాను ఇందిరాగాంధీ కాలనీ/వీకర్ సెక్షన్ కాలనీ అని పేర్కొంటూ రూ.5 వేలకు కాకుండా రూ.3 వేలకే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తద్వారా చదరపు గజానికి రూ.2 వేల మేరకు ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. మిగిలిన మొత్తాన్ని అటు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది, మధ్యలో బ్రోకర్లు పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.