
డేంజర్... యమ డేంజర్..!
⇒ రోడ్డు ఎక్కాలంటేనే హడల్
⇒ అస్తవ్యస్తంగా ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ
⇒ సిబ్బంది కొరత... మౌలిక వసతుల లేమి
⇒ రహదారి భద్రతను పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ... వాహనాల సంఖ్యలోనే కాదు రోడ్డు ప్రమాదాల్లోనూ రాష్ట్రంలోనే అగ్రస్థానం. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 6 లక్షలకుపైగా రవాణా వాహనాలు ఉన్నాయి. లక్షకుపైగా ఉన్న రవాణేతర వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 50 వేల వాహనాలు నగరం గుండా వెళ్తున్నాయి. ఇలా నిత్యం పరుగులు పెడుతున్న వాహనాలను నియంత్రించే స్థాయిలో నగర ట్రాఫిక్ వ్యవస్థ లేకుండాపోయింది. దాంతో నగర రోడ్లపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. గత రెండేళ్లలో అమరావతి పరిధిలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికి నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 60 మంది వరకు దుర్మరణం చెందారు. వారిలో 40 మంది నగర పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లోనే మృత్యువాతపడ్డారు. నగర రహదారులపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ట్రాఫిక్ పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచేందుకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు.
మౌలిక వసతుల లేమి...
విజయవాడలో ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రహదారి భద్రతను గాలికి వదిలేసింది. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేసేందుకు వాహనాలు కూడా లేకపోవడం ట్రాఫిక్ విభాగం దైన్యస్థితికి నిదర్శనం. కనీసం 4 పెట్రోలింగ్ వాహనాలు కావాలని రెండేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. జాతీయ రహదారుల ఆథారిటీ అయితే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కీలకమైన ఇంటర్‌సెప్టర్ వాహనాలూ లేనేలేవు.
అతివేగంతోనూ, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని కట్టడి చేయలేకపోతున్నారు. కనీసం 6 ఇంటర్‌సెప్టర్ వాహనాల కోసం ట్రాఫిక్ పోలీసులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలే అయ్యాయి. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించేందుకు టోయింగ్ వాహనాలు కూడా కేటాయించలేదు. ఇక నగరంలోని కీలక కూడళ్లలో కూడా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయడం లేదు. మహానాడు కూడలితోపాటు పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులే స్వయంగా వాహనాలను నియంత్రించాల్సి వస్తోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత ...
అధికారిక లెక్కల ప్రకారం విజయవాడకు అవసరమైన కానిస్టేబుళ్లు 396 మంది... కానీ ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో ఉన్న కానిస్టేబుళ్లు కేవలం 163 మంది... విజయవాడ ట్రాఫిక్ పోలీసు విభాగంలో సిబ్బంది కొరతకు ఈ ఒక్క తార్కాణం చాలు... రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత కూడా నగర ట్రాఫిక్ వ్యవస్థ మీద ప్రభుత్వం దృషి ్టసారించలేదు. క్షేత్రస్థాయిలో కీలకమైన కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టసాధ్యంగా మారింది. కానిస్టేబుళ్లే కాదు ఇతర పోస్టుల పరిస్థితీ అలాగే ఉంది. 72 మంది హెడ్‌కానిస్టేబుళ్లు ఉండాలి. కానీ కేవలం 42 మందే ఉన్నారు. ఏఎస్సైలు 36మందికి 21మందినే నియమించారు. 24 ఎస్సై పోస్టులకు 21 పోస్టులే భర్తీ చేశారు. దాంతో నగరంలోని ప్రధాన కూడళ్లతోపాటు జాతీయరహదారిపై తగినంత మంది సిబ్బందిని వినియోగించలేకపోతున్నారు.
డైవర్షన్లు అమలైతే పరిస్థితి మరింత దయనీయం
నగరంలోని రామవరప్పాడు – బెంజి సర్కిల్ మార్గంలో ఫ్‌లైఓవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం జాతీయ రహదారి మీద నుంచి వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌జంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌వైపు మళ్లిస్తారు. చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ మీదుగా మోపిదేవి వైపు మళ్లించి జాతీయరహదారి 216వైపు తీసుకుపోతారు. ఇక చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను గుంటూరు, తెనాలి, భట్టిప్రోలు మీదుగా మోపిదేవి, గుడివాడ మీదుగా మళ్లిస్తారు. అందుకోసం కనీసం 30 శాతం అదనపు సిబ్బంది అవసరమని భావిస్తున్నారు. మంజూరైన సిబ్బందినే కేటాయించని ప్రభుత్వం అదనపు సిబ్బంది గురించి ఆలోచిస్తుందా...!