
బైపాస్.. తుస్!
► ఏడాదైనా పూర్తి కాని డీపీఆర్
► కొలిక్కిరాని రహదారి బదలాయింపు
► ఈ ఏడాది పనుల ప్రారంభం డౌటే
► సిటీజనులకు తీరని హైవే బెడద
సాక్షి, విశాఖపట్నం: హైవే.. ఈ మాటంటేనే నగర ప్రజలు ఉలిక్కిపడతారు. నగరం మీదుగా వ్యాపించిన జాతీయ రహదారిని చూస్తే చాలు.. మెలికలు తిరిగిన కాలసర్పాన్ని చూసినంతగా జడుసుకుంటారు. ఆ సర్పం ఎప్పుడు ఎవరిని కాటేస్తుందోనని బెంబేలెత్తుతారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా నగరం మీదుగా వ్యాపించిన 73 కిలోమీటర్ల జాతీయ రహదారి ఎప్పుడెవరిని కబళిస్తుందో, హైవేపై దూసుకొచ్చే వాహనాల వల్ల ఎప్పుడు ఏ ప్రాణం గాలిలో కలిసిపోతుందోనని హడలెత్తుతారు. ఈ ముప్పు ఎప్పుడు తొలగుతుందానని ఆలోచిస్తారు. అయితే ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ఈ భయం తీరడం లేదు.. హైవేను ఊరికి దూరం చేసే ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు.
జాతీయాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే హైవే నగర ప్రజలకు మాత్రం హైబీపీ తెప్పిస్తోంది. అమిత వేగంతో దూసుకొచ్చే వాహనాల వల్ల జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారుతోంది. ఈ రహదారిని విశాఖకు దూరం చేసే బైపాస్ మార్గం మాత్రం ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో సందేహంగా ఉంది. బైపాస్‌గా పేరుపడ్డ అనకాపల్లి- ఆనంద పురం రహదారిని ఆరులైన్ల రోడ్‌గా విస్తరించి హైవేకు అనుసంధానం చేయాలన్న ఆలోచన కాగితాల స్థాయి దాటి కదలనంటోంది.
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు కింద వాజపాయ్ ప్రభుత్వ హయాంలో శివారు ప్రాంతాల మీదుగా నాలుగులైన్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. నగరం విస్తరించడంతో ఈ జాతీయరహదారి నగరంలో అంతర్భాగమైపోయింది. విశాఖ మీదుగా సాగే ఈ రహదారిపై నిత్యం 75 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇచ్చాపురం
నుంచి తడ వరకు ఉన్న హైవేపై ఏటా జరిగే ప్రమాదాల్లో సుమారు 250 మంది మృత్యువాతపడుతుంటే వారిలో 22 శాతం విశాఖ పరిధిలోని ఎన్‌హెచ్‌పైనే అసువులు బాస్తున్నారంటే ఈ ప్రాంతం ఎంత ప్రమాదకరమైందో అర్ధమవుతోంది. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిని ఆరులైన్ల మార్గంగా విస్తరించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా అనకాపల్లి నుంచి పెందుర్తి మీదుగా ఆనందపురం వరకు ఉన్న ఒకప్పటి జాతీయ రహదారిని బైపాస్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. 58 కిలోమీటర్ల పొడవు గల ఈ మార్గాన్ని నాలుగులైన్ల రోడ్‌గా విస్తరించేందుకు రూ.440 కోట్లతో ఆర్ అండ్ బీ డిపార్టుమెంట్ గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
దీనిని మళ్లీ జాతీయ రహదారుల విభాగం పరిధిలోకి తీసుకొచ్చి ఆరులైన్ల రహదారిగా విస్తరించాలని, అనకాపల్లి నుంచి విశాఖ నగరం మీదుగా ఆనందపురం వరకు ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్-16ను రాష్ర్ట రహదారుల శాఖకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఆరులైన్ల రహదారిపై కేంద్ర ఉపరితల రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సరిగ్గా ఏడాది క్రితం ప్రకటన వెలువరించింది. ఇందుకోసం అవసరమైన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని జాతీయ రహదారుల విభాగాన్ని ప్రభుత్వం కోరింది. కానీ అదే జరగడం లేదు.
ఒత్తిడి పర్యవసానం? : ఆరులైన్ల రహదారి కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరపాల్సి ఉంది. అనకాపల్లి-ఆనందపురంమధ్య టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల భూములు ఉన్నాయి. అలైన్‌మెంట్ రూపకల్పనలో అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారని, అందుకే డీపీఆర్ తయారీలో అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. కనీసం డీపీఆర్ తయారీ కూడా ఈ ఏడాది పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. తర్వాత మరెంతో పని ఉంది. దీంతో బైపాస్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది చివర్లో కానీ ప్రారంభమయ్యే సూచనలు కన్పించడం లేదు. బైపాస్ అందుబాటులోకి వస్తే ఈ ర హదారి పూర్తిగా నగర పరిధిలోకి వస్తుంది.తద్వారా వాహనాల రాకపోకల సంఖ్య తగ్గడంతో ఒత్తిడి తగ్గుతుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా అనకాపల్లి-ఆనందపురం రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతు న్నారు.
అక్కడా ప్రమాదాలే : అనకాపల్లి-ఆనందపురం బైపాస్ మార్గం ఇప్పటికే కీలక దారిగా గుర్తింపు పొందింది. సిటీలోకి రాకుండా ప్రయాణం జాగించడానికి వీలయ్యే ఈ మార్గం గుండా పెద్ద సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తాయి. అయితే 20 అడుగులకు మించి వెడల్పు లేని ఈ మార్గం కూడా ప్రమాదాలకు నెలవుగా మారింది. అందుకే ఈ మార్గాన్ని విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.