
దారుణంగా దెబ్బతిన్న హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి
సాక్షి, హైదరాబాద్: ఇది పేరుకే జాతీయ రహదారి. కానీ ఎక్కడా ఆ రూపు లేదు. గుంతలమయమై చెదిరిపోయింది. గ్రామాల్లోని మామూలు రోడ్డు కంటే హీనంగా తయారైంది. కొద్ది నెలల క్రితం వరకు ఎక్స్‌ప్రెస్ వే తరహాలోనే కనిపించేది. వాహనాలు కూడా వాయువేగంతో దూసుకుపోయేవి. ఇప్పుడేమో పూర్తిగా చెదిరిపోయింది. వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇదీ హైదరాబాద్–వరంగల్ 163 జాతీయ రహదారి పరిస్థితి. ఆలేరు–హన్మకొండ మధ్య కనిపిస్తున్న రోడ్డు దుస్థితి. జాతీయ రహదారుల విభాగం (ఎన్‌హెచ్), జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మధ్య సమన్వయం లేక ఈ పరిస్థితి నెలకొంది. గుంతలు.. సడన్ బ్రేకులుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణానికీ గంటల తరబడి సమయం పడుతోంది.
ఎందుకీ గందరగోళం..
హైదరాబాద్–వరంగల్ 163వ జాతీయ రహదారిని ఎన్‌హెచ్‌డీపీ కింద 4 వరుసలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. పనిని రెండు భాగాలుగా విభజించి తొలుత హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు పని పూర్తి చేశారు. కానీ అక్కడి నుంచి వరంగల్ వరకు జరుగుతున్న పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. రెండేళ్ల క్రితమే రెండో భాగం నిర్మాణానికీ కేంద్రం అనుమతిచ్చింది. రూ.1,905 కోట్లతో 99 కి.మీ. రోడ్డును 4 వరసలుగా నిర్మించాల్సి ఉంది. మొత్తం భూ సేకరణ జరిగితేనే పని ప్రారంభించాల్సి ఉండటం.. భూ సేకరణలో జాప్యంతో పనులు జరగడం లేదు.
ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించడం నుంచే..
గతంలో జాతీయ రహదారుల విభాగం పరిధిలో ఉన్న ఈ రోడ్డును ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించడంతో సమస్య మొదలైంది. ఎలాగూ రోడ్డు బాధ్యత బదిలీ అవుతున్నందున నిర్వహణను జాతీయ రహదారుల విభాగం పక్కనబెట్టింది. అప్పటికి రోడ్డు బాగానే ఉండటం, ఎలాగూ 4 వరసలుగా నిర్మిస్తున్నందున నిర్వహణ పనులు అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ భావించింది. దీంతో రోడ్డు క్రమంగా చెదిరిపోతూ వస్తోంది. ఇటీవలి భారీ వర్షాలకు పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి.
ఉప్పల్ నుంచి 3.30 గంటలు..
హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో బయలుదేరే ఆర్టీసీ బస్సులు.. ట్రాఫిక్ దాటుకుని ఉప్పల్ కూడలికి చేరుకోడానికి అరగంటకుపైగా సమయం పట్టేది. అక్కడి నుంచి 2.30 గంటల్లో హన్మకొండ చేరుకునేవి. ఇప్పుడు కూడలి నుంచే 3.30 గంటల వరకు సమయం పడుతోంది. వెరసి ఎంజీబీఎస్ – హన్మకొండ ప్రయాణం నాలుగున్నర నుంచి ఐదు గంటలవుతోంది. ఇక ట్రాఫిక్ రద్దీ ఉండే సాయంత్రం, రాత్రి వేళ పరిస్థితి చెప్పనవసరం లేదు. 4 వరుసల రోడ్డు విస్తరణకు మరో రెండేళ్లు పట్టనుంది. దీంతో పని పూర్తయ్యే వరకు ప్రస్తుత రోడ్డుపై ఓ లేయర్ నిర్మాణమైనా జరపాలని వాహనదారులు కోరుతున్నారు.
‘వజ్ర’ ప్రమాదానికి కారణమూ..
ఇప్పటికే గుంతలతో సతమతమవుతున్న వాహనదారులకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. రోడ్డు విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లో రెండు వైపుల వెళ్లే వాహనాలు ఒకేవైపు నుంచి వెళ్లాల్సి రావటంతో సమస్య మరింత తీవ్రమైంది. 3 రోజుల క్రితం వజ్ర బస్సు ఆటోను ఢీకొని ఆరుగురు మృతిచెందిన ప్రమాదమూ ఇలాంటి చోటే జరిగింది. ఓవర్‌టేక్ చేసే సమయంలో స్థలం లేక ఎదురుగా వచ్చిన ఆటోను బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
అప్పుడు బాగుంది
ఏడాది క్రితం మేం రోడ్డును ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించాం. అప్పుడు రోడ్డు బాగుంది. దాన్ని ఆ కండిషన్‌లో ఉంచుతూ విస్తరణ పనులు చేపట్టాలి. ఆ బాధ్యత ఎన్‌హెచ్‌ఏఐదే
– గణపతిరెడ్డి, ఈఎన్‌సీ ఎన్‌హెచ్ విభాగం
చాలాకాలంగా నిర్వహణ లేదు
మాకు బదిలీ అయ్యేవరకే రోడ్డు చెదిరిపోయింది. మాకు పాత్‌హోల్స్ మరమ్మతు వరకు మాత్రమే అధికారం ఉంది. ఆ పని చేస్తున్నాం.
– శ్రీనివాసులు, పీడీ ఎన్‌హెచ్‌ఏఐ
బస్సులు పాడవుతున్నాయి
ఉప్పల్ కూడలి నుంచి హన్మకొండకు 4 గంటల సమయం పడుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. గుంతల వల్ల బస్సులూ దెబ్బతింటున్నాయి. సంబంధిత విభాగాలు సమీక్షించి దీనికి పరిష్కారం చూపాలి.
– రమణారావు, ఆర్టీసీ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment