పరిగి, న్యూస్‌లైన్: కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అవుతున్న సిమెంట్‌ను డ్రైవర్లతో కుమ్మక్కైన కొందరు ట్యాంకర్లలోంచి దొంగిలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫ్యాక్టరీల నుంచి బయలుదేరుతున్న లారీలు గమ్యస్థానాల్లో సిమెంట్‌ను పూర్తిగా ఖాళీ చేయకుండా తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో సదరు సిమెంట్‌ను అక్రమార్కులకు అడ్డగోలుగా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఐదారేళ్ల క్రితం పరిగి ప్రాంతంలో ప్రారంభమైన ఈ దందా ప్రస్తుతం వ్యాపారులను శాశించే స్థాయికి చేరుకుంది.
వేళ్లూనుకున్న వ్యాపారం..
సిమెంట్ అక్రమ వ్యాపారం పరిగి ప్రాంతంలోని సుల్తాన్‌పూర్ గేటు, భవానీ థియేటర్, పూడూరు మండలం మన్నెగూడలో యథేచ్ఛగా సాగుతోంది. కొందరు ఏకంగా దుకాణాలు ఏర్పాటు చేసి దందాను నడుపుతున్నారు. కర్ణాటక రాష్ట్రం సేడెం, మల్కెడ్ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి నగరానికి ట్యాంకర్ల ద్వారా సిమెంట్‌ను తరలిస్తుంటారు. అయితే మార్గంమధ్యలోని పైప్రాంతాల్లో డ్రైవర్లు ట్యాంకర్ల నుంచి సిమెంట్‌ను తీస్తున్నారు.
సిమెంట్ ట్యాంకర్ల డ్రైవర్లతో అక్రమార్కులు కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. నిత్యం 20-30 ట్యాంకర్ల నుంచి సిమెంట్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారు. రూ. 200-250 చొప్పున ఓ బస్తా అమ్ముతున్నారు. దీనికి తోడు బ్యాగులో తక్కువ సిమెంట్ నింపి ప్రజలను మోసం చేస్తున్నారు. అది ఒరిజినల్ సిమెంటా.. కాదా అనేది దేవుడి తెలుసు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు వస్తుండడంతో జనం ఎగబడుతున్నారు.
ఈ క్రమమ దందాను పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు తమ పొట్టగొడుతున్నారని స్థానిక సిమెంట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తాము డబ్బు కట్టి ఏజెన్సీలు, లెసైన్సులు తీసుకొని దుకాణాలు నడుపుకొంటుంటే అక్రమార్కులు నష్టం కలిగిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జోరుగా సిమెంట్ అక్రమ వ్యాపారం!
Published Thu, Feb 13 2014 12:19 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement