Cement factory
-
భువనగిరి: రామన్నపేటలో టెన్షన్.. భారీగా పోలీస్ బందోబస్తు
సాక్షి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామన్నపేటలో ఏర్పాటు చేయనున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రామన్నపేటలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కంపెనీ ఏర్పాటును అఖిలపక్షం నేతలు వ్యతిరేకిస్తున్నారు.రామన్నపేటలో అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే లింగయ్య అరెస్ట్. పోలీసులతో లింగయ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసు వాహనంలో లింగయ్యను స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఇక, ప్రజాభిప్రాయ సేకరణ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రాంతానికి భారీగా చేరుకుంటున్నారు అఖిలపక్ష నేతలు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికేతరులను అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. అభిప్రాయసేకరణను జరగనివ్వమని అఖిలపక్ష నేతలు చెబుతున్నారు. మరోవైపు.. స్థానికులు కూడా అంబుజా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రామన్నపేట పట్టణ కేంద్రంలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతి ఇవ్వద్దని పలు గ్రామాల ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల కాలుష్య సమస్య తలెత్తి ప్రజా ఆరోగ్యాలు దెబ్బ తినడంతో పాటు పచ్చటి పంట పొలాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని మండల పరిధిలోని కొమ్మాయిగూడెంలో సుమారు 350 ఎకరాలను కొనుగోలు చేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు ఈనెల 23న ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. -
నిర్మలమ్మ కరుణించేనా..
ఎదులాపురం: ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే జిల్లా అభివృద్ధికి తలమానికంగా నిలిచే సీసీఐ (సిమెంట్ ఫ్యాక్టరీ)ని పునరుద్ధరించాలని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు నిధులు కేటా యించాలని రాజకీయ అఖిల పక్ష నాయకులు డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు నల్లా గణపతిరెడ్డి అధ్యక్షతన బుధవారం రాజకీయ అఖిల పక్ష స మావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఆదిలాబాద్ అభివృద్ధి సాధన పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ బండి దత్తాత్రి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం విమానా శ్రయం, గిరిజన యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు వంటివి వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకోసం దశల వారీగా ఉద్యమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కో కన్వీనర్లుగా బాలూరి గోవర్ధన్‌రెడ్డి (కాంగ్రెస్), విజ్జగిరి నారాయణ (బీఆర్ఎస్), ప్రభాకర్‌రెడ్డి (సీపీఐ), వెంకట్‌నారాయణ (న్యూడెమోక్రసీ), జగన్‌సింగ్ (ప్రజాపంథా), మల్యాల మనోజ్(టీఎమ్మార్పీఎస్), అగ్గిమల్ల గణేశ్ (ధర్మ సమాజ్‌పార్టీ), గుడుగు మహేందర్ (బీఎస్పీ), కొండా రమేశ్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి (రైతు సంఘం), కమిటీ సభ్యులుగా పూసం సచిన్, బండి దేవిదాస్ చారి, రోకండ్ల రమేశ్, నంది రామ య్య, కుంటాల రాములు, దర్శనాల అశోక్, నక్క రాందాస్, నీరటి ఉదయ్ కిరణ్, మాడవి గణేశ్ ఎన్నికయ్యారు. కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నిక ల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర పద్దు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించే బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. రైల్వే ప రంగా జిల్లాకు కొత్త వరాలు ప్రకటిస్తారా..పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తారా అనే దానిపై ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే జిల్లాలో విద్య, వైద్యం పరంగా యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరుగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో వస్తున్న బడ్జెట్ కావడంతో ప్రధానంగా రైతులకు మేలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జిల్లాకు ఏ మేర న్యాయం చేకూరుస్తారనే దానిపై అన్నదాతల్లో ఆసక్తి నెలకొంది. ►ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. అయితే దీన్ని ఏర్పాటు చేయాల్సిన కేంద్రం ఆదిలాబాద్–పఠాన్‌చెరు రైల్వేలైన్ ఏర్పాటుకు సంకల్పించింది. ఇందులో భాగంగా సర్వే సైతం పూర్తయింది. అయితే ఈ పనులను పఠాన్‌చెరు–ఆదిలాబాద్ చేపట్టాలని నిర్ణయించడంపై జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఆదిలాబాద్ నుంచి మొదలుపెడుతూ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ►ఆదిలాబాద్–గడ్చందూర్ బేల మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిధులు మంజూరు చేసింది. సర్వే కూడా పూర్తయింది. అయితే నిధులు కేటాయించాల్సి ఉంది. గత రెండు బడ్జెట్లలో నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ►ఆదిలాబాద్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్, మహారాష్ట్రలోని ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. పూర్తిస్థాయిలో రైళ్లు లేకపోవడంతో రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నాందేడ్ వరకు నడుస్తున్న నాందేడ్– బెంగుళూరు, నాందేడ్–శ్రీ గంగానగర్, నాందేడ్–అమృత్సర్, ధర్మబాద్–ముంబై రైళ్లను ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు పొడిగిస్తే జిల్లా వాసులు ఆయా ప్రాంతాలకు సునాయసంగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. రైళ్లను పొడిగించాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ►ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక కేంద్రీయ విద్యాల యం ఉంది. మరిన్ని విద్యాలయాలు మంజూరు చేస్తే పేద విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్‌తో కూడిన నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. ►జవహర్ నవోదయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు జిల్లాలో లేవు. వాటిని ఏర్పాటు చేయాలని పదేళ్లుగా జిల్లావాసులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. వాటిని మంజూరు చేస్తే జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సైనికులుగా దేశ సేవ కోసం ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ►ఆదిలాబాద్.. ఆదివాసీలతో కూడిన జిల్లా. ఇలాంటి ప్రాంతంలో ఉన్నత విద్య అవకాశాలు అందాలంటే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. గిరిజన వర్సిటీని గతంలో మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని వరంగల్‌కు తరలించారు. దీనిపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఈ బడ్జెట్లోనైనా గిరిజన యూనివర్సిటీని మంజూరు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ►జిల్లాలో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల కోసం అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. అన్ని విధాలా అనుకూలతలున్నాయి. గతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సర్వే చేపట్టి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వీటిలో ఏఒక్క దానికై నా నిధులు మంజూరైతే ఆదిలాబాద్ అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. ►జిల్లాలో సాగునీటిని అందించే ప్రాజెక్టులు మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటి ద్వారా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతాంగానికి సా గునీరు అందడం లేదు. కాలువలు లేకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరని పరిస్థితి. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కోర్టా–చనాఖా బ్యారేజీ నిర్మాణం సైతం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుద ల చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. -
మా భూములు మాకివ్వండి
ఆదిలాబాద్ రూరల్: సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే వరకు తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని రామాయి శివారులో గల రేణుకా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన స్థలం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినీరెడ్డి ఆదివాసీలతో కలిసి భూముల వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అరెస్టు చేయడంతో మిగతావారు పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు. ఈ క్రమంలో ఓ మహిళ తమను అడ్డుకోవద్దని సీఐ కాళ్లు పట్టుకొని వేడుకుంది. అనంతరం వారందరినీ అరెస్టు చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పోలీసు వాహనంపైకి ఎక్కారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని కిందకు దించి ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్, భీంపూర్, తదితర స్టేషన్లకు తరలించారు. ఇంకొందరు మహిళలు పురుగుమందు డబ్బాలతో వచ్చారు. కొంతమంది రైతులు నాగలితో భూములు దున్నేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉపాధికి దూరమయ్యాం... సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కోసం 2018లో తమ పంట భూములు ఇస్తే ఇప్పటివరకు పరిశ్రమ ప్రారంభం కాలేదని, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పి పరిశ్రమ యజమానులు మాట తప్పారని ఆరోపించారు. మొత్తం 107 ఎకరాల భూమి తీసుకుని ఐదేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము ఉపాధి కరువై కూలీలుగా మారామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ కోసం నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు కనీసం మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కోయంబత్తూరులో భారతి సిమెంట్ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీ సంస్థ భారతీ సిమెంట్.. తమిళనాడులోని కోయంబత్తూరులో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అత్యాధునిక బల్క్ సిమెంట్ టెర్మినల్‌ను ఏర్పాటు చేసింది. కడప ప్లాంటు నుంచి ఈ కేంద్రానికి బల్క్ సిమెంట్ సరఫరా అవుతుంది. ఇక్కడ ప్యాకింగ్ చేసి సిమెంట్ పంపిణీ చేస్తారు. వికా గ్రూప్ చైర్మన్, సీఈవో గీ సీడో, వికా ఇండియా సీఈవో అనూప్ కుమార్ సక్సేనా, మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి ఈ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ మార్కెట్ల కోసం క్విక్సెమ్ పేరుతో తదుపరి తరం పర్యావరణ అనుకూల ప్రీమియం సిమెంట్‌ను విడుదల చేశారు. -
అందుకే సాధ్యమైంది.. వరుసగా మూడోసారి నంబర్‌వన్: సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. కొలిమిగుండ్లలో బుధవారం.. రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభలో సీఎం ప్రసంగిస్తూ రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని అన్నారు. ‘‘కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగావకాశాలు రావాలి. రానున్న 4 ఏళ్లలో 20వేల ఉద్యోగాలు వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ వరుసగా 3వ సారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమైంది. మాది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ సారి పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు లీజు చెల్లిస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా ఉండాలి. గ్రోత్ రేటులో దేశంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది.రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. చదవండి: రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్ -
సీసీఐ ఫ్యాక్టరీ కోసం జాతీయ రహదారి దిగ్బంధం
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని పునఃప్రారం భించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీసీఐ సాధన కమిటీ 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించింది. పట్టణ శివారు ప్రాంతంలోని జందాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ మినహా అన్నిపార్టీలు మద్దతు తెలిపాయి. మూడు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో నాగ్‌పూర్, హైదరాబాద్ రోడ్డు మార్గాల్లో వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే వరకు ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశా రు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, మూత పడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని గతంలో కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేసిన హన్స్‌రాజ్ ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే 2018 ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే సిమెంట్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని ఎంపీ సోయం బాపురావు కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా బాపురావు సోయి లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
పెరగనున్న ఉపాధి, ఉద్యోగావకాశాలు
‘వైఎస్సార్ నవోదయం’తో జిల్లాలోని అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ( ఎంఎంఎస్ఈ) ఊపిరి పోసుకోనున్నాయి. కంపెనీలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు రుణాల రీ షెడ్యూల్‌కు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో పలు కంపెనీలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోంది. ఇప్పటికే పలు సిమెంట్ కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించగా, రాంకో కంపెనీ పనులు వేగంగా జరుగుతున్నాయి. అల్ట్రాటెక్, ప్రిజమ్ కంపెనీలు వస్తుండటంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. సాక్షి, కర్నూలు(అర్బన్): జిల్లాలో మరో రెండు సిమెంట్ కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ, ప్రియా, జయజ్యోతి సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామం సమీపంలో ఇప్పటికే రూ.1,500 కోట్ల పెట్టుబడితో రాంకో సిమెంట్ కంపెనీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ కంపెనీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2018 డిసెంబర్లో ఈ కంపెనీ పనులకు శంకుస్థాపన చేసినా, ఈ ఏడాది జూన్ నుంచే పనులు ఊపందుకున్నాయి. 2020 మార్చి, ఏప్రిల్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే మరో రెండు సిమెంట్ కంపెనీలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూ.2వేల కోట్లతో దాదాపు 1850 మందికి ఉపాధి కల్పించే దిశగా అల్ట్రాటెక్, రూ.4వేల కోట్ల పెట్టుబడితో ప్రిజమ్ కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనట్లు సమాచారం. ప్రిజమ్ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ మూడు సిమెంట్ కంపెనీలు జిల్లాలో ఉత్పత్తి ప్రారంభిస్తే వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వైఎస్సార్ నవోదయంతో ఎంఎస్ఎంఈలకు ఊపిరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ నవోదయం’ కార్యక్రమంతో జిల్లాలోని అనేక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎంఎస్ఈ ) ఊపిరి పోసుకోనున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు రూ.10 లక్షల పెట్టుబడితో 6,017 ఎంఎస్ఎంఈలు ఉండగా, వీటిలో 2,628 రీస్ట్రక్చరయ్యాయి. అలాగే రూ.10 లక్షలకు పైగా పెట్టుబడితో 201 ఎంఎస్‌ఎఈలుండగా, ఇందులో 20 మాత్రమే రీస్ట్రక్చరయ్యాయి. ఆయా ఎంఎస్ఎంఈలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున పలు ఎంఎస్ఎంఈలకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ఆర్థిక వెసులుబాటు కలిగితే తిరిగి ఆయా ఎంఎస్ఎంఈలు పునర్జీవం పొందడమే గాక, ఉత్పత్తులు ప్రారంభించే అవకాశాలున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధితో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్ వల్ల మరి కొన్ని రంగాలకు లబ్ధి చేకూరే అవకాశముంది. కొత్త సిమెంట్ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి జిల్లాకు కొత్తగా రెండు సిమెంట్ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి. అల్ట్రాటెక్, ప్రిజమ్ కంపెనీల ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిశారు. రాంకో సిమెంట్ పరిశ్రమ ప్రారంభమైతే చాలా మందికి ఉపాధి లభిస్తుంది. వైఎస్సార్ నవోదయం పథకం ద్వారా జిల్లాలో అనేక ఎంఎస్ఎంఈలు పునర్జీవం పొందనున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. ఔత్సాహికులు సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు, అనుమతులు పొందొచ్చు. – జీ సోమశేఖర్‌రెడ్డి, డీఐసీ జీఎం -
కర్నూలు సిమెంట్ ఫ్యాక్టరీకి అనంతపురం ఇసుక
ఇది శింగనమల నియోజకవర్గం ఉల్లికల్లు గ్రామంలోని ఇసుక రీచ్. అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామనే పేరుతో ఇసుకను కర్నూలు జిల్లాలోని సిమెంటు ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇక్కడ నేరుగా ఇసుక రీచ్‌లోకి టిప్పర్లు వెళ్లడంతో పాటు జేసీబీతో లోడింగ్ చేస్తున్నారు. వాస్తవానికి రీచ్ నుంచి స్టాక్ పాయింట్ వరకు కేవలం ట్రాక్టర్ల ద్వారా, అది కూడా మనుషులతోనే ఇసుకను లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇసుకాసురులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పట్టించుకోకపోవడంతో ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుగొండ, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. సాక్షి, అనంతపురం: ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా ముసుగులో విలువైన ఇసుక జిల్లా సరిహద్దులే కాదు.. ఏకంగా రాష్ట్ర సరిహద్దులను దాటి అక్రమంగా తరలిపోతోంది. ఈ వ్యవహారంలో కొద్దిమంది ఇసుక కాంట్రాక్టర్లు భారీగా వ్యవహారాలు నడుపుతూ.. రెవెన్యూ, పోలీసులను అటువైపు రాకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. బళ్లారి, బెంగళూరు వంటి నగరాలకు ఇక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీసు వ్యవస్థలు అచేతనంగా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తరలిస్తున్నారు. తద్వారా ఈ ఇసుకను అధిక ధరకు మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇసుక రీచ్ నుంచి ఇసుకను తరలించే వాహనాల వివరాలను ముందుగా సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే పేర్కొన్న వాహనాల్లో మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతిస్తారు. అది కూడా అనుమతించిన వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జీపీఎస్ వ్యవస్థను నిరంతరం రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు పర్యవేక్షించాలి. తద్వారా అనుమతి ఇచ్చిన ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే ఇసుక సరఫరా అవుతోందా? పక్కదారి పడుతుందా అనే విషయం తెలిసిపోతుంది. అయితే, ఇక్కడే ఇసుకాసురులు దోపిడీకి మార్గం ఏర్పడింది. అనుమతి తీసుకున్న వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చుకోవడం లేదు. ఒకవేళ అమర్చుకున్నప్పటికీ నిర్దేషిత ప్రాంతానికి వెళ్లిన తర్వాత జీపీఎస్ వ్యవస్థ పనిచేయకుండా చేస్తున్నారు. తద్వారా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అంతేకాకుండా నిర్దేషించిన వాహనాలను మాత్రమే కాకుండా ఇతర వాహనాలను కూడా ఇసుక సరఫరాలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం అనుమతి తీసుకున్న వాహనం పనిచేయడం లేదని చెబుతున్నారు. ఈ విధంగా ఇసుకాసురులు రెచ్చి పోవడానికి ప్రధాన కారణం.. రెవెన్యూ, మైనింగ్, పోలీసు వ్యవస్థలు కూడా అమ్యామ్యాలకు అలవాటుపడటమే. పర్మిట్లు ఇచ్చే విషయం నుంచి ఇసుకను తరలించే వరకూ ఈ విధంగా అన్ని విధాల అధికారులు ఇసుకాసురులకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవీ నిబంధనలు..! ఇసుక సరఫరాలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. అప్పటి నుంచి ఇసుకాసురులు తమ ఆటలు సాగవని తెలుసుకుని సందట్లో సడేమియాగా ఇప్పుడే సొమ్ముచేసుకుంటున్నారు. నిబంధనల మేరకు ఇసుక రీచ్ నుంచి కేవలం మనుషుల ద్వారా లోడింగ్ చేసుకోవాలి. అది కూడా కేవలం ట్రాక్టర్లకు మాత్రమే. ఇక్కడి నుంచి స్టాక్ పాయింట్‌కు తీసుకొచ్చిన తర్వాత ఇతర వాహనాల్లో ఇసుకను తరలించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా దూరం మరీ ఎక్కువైతేనే టిప్పర్లను అనుమతిస్తారు. అదేవిధంగా ఈ వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జిల్లాలో ఇసుక సరఫరా వ్యవహారంలో ఈ నిబంధలను అధికారులు ఎక్కడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా ఇసుకాసురులు ఆడింది ఆట.. పాడింది పాటగా వ్యవహారం సాగుతోంది. -
‘కేశోరాం’లో కార్మికుడి మృతి
సాక్షి, పాలకుర్తి(కరీంనగర్): పాలకుర్తి మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో బుధవారం లిఫ్ట్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి కొడారి నర్సింగం(42) అనే పర్మినెంట్ కార్మికుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు, తోటికార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింగం కేశోరాం సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఉదయం షిఫ్ట్ విధులకు హాజరై సిమెంట్ మిల్లు వద్ద నాల్గో అంతస్తులో పని చేస్తుండగా ఉదయం సుమారు 10 గంటలకు టీ తాగేందుకు లిఫ్ట్ ద్వారా కిందకు దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు 60 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలతోపాటు చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటికార్మికులు, అధికారులు కంపెనీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్‌లతోపాటు ఇతర నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్మికసంఘం నాయకులు, అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన వీఆర్‌పీఎం లిఫ్ట్ ప్రాంతాన్ని, సిమెంట్ మిల్లు నాల్గో అంతస్తు పైకి ఎక్కి పరిశీలించి మృతుడి కుటుంబానికి రూ.40లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐదుగంటల పాటు ఉద్రిక్త వాతావరణం కార్మికుడు నర్సింగం మృతితో కార్మికులు ఉదయం షిప్టు విధులను బహిష్కరించి కంపెనీ గేట్ ఎదుట నిరసనకు దిగారు. తొలుత యాజమాన్యం రూ.20లక్షలతోపాటు నర్సింగం కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈమేరకు కంపెనీ ప్లాంట్ హెడ్ రాజేశ్‌గర్గు ఈవిషయాన్ని కార్మికసంఘం నాయకులకు తెలుపగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కార్మికసంఘం నాయకులకు, అధికారులకు మధ్య పలుదఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో నాయకులు, కార్మికులు గేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దాదాపు 5గంటల పాటు పలు దఫాలుగా కొనసాగిన చర్చల అనంతరం మృతుడి కుటుంబానికి రూ.33లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో పాటు మృతుడి కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం, సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన విచారణ నిర్వహించి చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరిస్తూ వ్రాతపూర్వకంగా ఒప్పందపత్రాన్ని అందజేశారు. దీంతో కార్మికులు, నాయకులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మికసంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్, జీడీనగర్, బసంత్‌నగర్, పాలకుర్తి సర్పంచులు సూర సమ్మయ్య, కట్టెకోల వేణుగోపాలరావు, జగన్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్, పాలకుర్తి వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, నాయకులు అయోధ్య సింగ్, తంగెడ అనిల్‌రావు, ముల్కల కొంరయ్య, అంతర్గాం జెడ్పీటీసీ నారాయణతోపాటు సమీప గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. కాగా మృతుడికి భార్య సరితతోపాటు ఇద్దరు కుమారులున్నారు, మృతుడి తల్లి సుశీల కంపెనీ ఎదుట పండ్ల షాపు నిర్వహిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే నర్సింగం మృతితో ఈసాలతక్కళ్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణం కేశోరాం కర్మాగారంలో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్మాగారంలో ఐదో అంతస్తులు గల సిమెంట్ మిల్లు వద్ద కార్మికులు ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన గల వీఆర్‌పీఎం లిఫ్ట్‌కు ఆపరేటర్ లేడని, లిఫ్ట్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఒకచోట ఆగాల్సింది ఇంకో చోట ఆగుతోందని ఈవిషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ సరిగ్గా ఆగకపోవడం వల్లనే నర్సింగం అదుపుతప్పి కింద పడి మృతిచెందాడని, వెంటనే సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
స్లాగ్ లారీలను కట్టడి చేయండి
నంద్యాల (కర్నూలు): పాణ్యం రైల్వే స్టేషన్ నుంచి లారీల్లో స్లాగ్‌ను లోడ్‌కు మించి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్తున్నా.. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని శోభా ఫంక్షన్హాల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీల్లో ఎక్కువ స్లాగ్‌ను తీసుకొని వెళ్లడంతో అది రోడ్డుమీద పడుతోందన్నారు. స్లాగ్ ఒక్కసారి కంట్లో పడితే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. అధిక లోడుతో వెళితే సీజ్ చేయాలన్నారు. నంద్యాల సిటీకేబుల్(డిజిటల్ టీవీ కమ్యూనికేషన్) యాజమాన్యం కేబుల్ వ్యవస్థ అంతా తమ చేతుల్లోనే ఉంచుకోవాలని చూస్తోందన్నారు. దీని కోసం ఆపరేటర్లను భయపెట్టడం, వారు తగ్గకపోతే కనెక్షన్ తక్కువ ధరకే ఇచ్చి వారిని దెబ్బతీయడం చేస్తోందన్నారు. గడివేముల మండలంలో కొందరు ఆపరేటర్లు సిటీకేబుల్ నుంచి పక్కకు వచ్చి సొంతంగా కేబుల్ ఏర్పాటు చేసుకుంటే వారిని దెబ్బతీయడానికి నెలకు రూ.130 ఉన్న కనెక్షన్‌ను ఒక్క గడివేముల మండలంలో మాత్రం రూ.50కే ఇస్తున్నారన్నారు. గడివేముల మండలం నుంచి ఇన్ని సంవత్సరాలు కోట్లాది రూపాయలు ఆదాయం తీసుకున్నారని, ఆ ఆదాయంతో రూ.50కి కనెక్షన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అయితే నంద్యాల పట్టణంలో కూడా రూ.50కే కనెక్షన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సిటీకేబుల్ యజామాన్యం ప్రజలను, ఆపరేటర్లను ఇబ్బందులు పెడితే త్వరలోనే తాను నంద్యాలలో కేబుల్‌టీవీ ఏర్పాటు చేస్తానన్నారు. తాను ఎన్నడు వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎవరి వ్యాపారం వారు చేసుకుంటారని, అయితే స్వచ్ఛం దంగా పని చేసుకుంటున్న గడివేముల ఆపరేటర్లను భయపెట్టడం తగదన్నారు. కార్యక్రమంలో పాణ్యం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్ ఆర్బీ చంద్రశేఖర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, బాలహుసేని, బిలకలగూడూరు చంద్రశేఖర్‌రెడ్డి, ఆపరేటర్లు పాల్గొన్నారు. -
అమాత్యా.. ఇది తగునా!
సాక్షి ప్రతినిధి, కడప : ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 23ఏళ్లు ఎదురుచూపులు...వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని వద్దిరాల పరిసర గ్రామాల్లో సిమెంటు ఫ్యాక్టరీ నెలకొల్పుతామని అసోషియేటెడ్ సిమెంటు కంపెనీ (ఏసీసీ) లిమిటెడ్ 1995 సంవత్సరం నుంచి పలు దఫాలుగా సుమారు 3వేల ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉపాధి లభిస్తోందని, తక్కువ ధరతో భూములిచ్చిన వందలాది మంది రైతుల నోట్లో మన్ను కొట్టిన ఏసీసీ నేటికి ఫ్యాక్టరీ నిర్మాణం మొదలెట్టలేదు. తుపాకీ నీడలో సదస్సు నిర్వహణ... 2015 మైనింగ్ చట్టం (ఎంఎంబిఆర్) ప్రకారం 2016 అక్టోబర్ 29లోగా అనుమతులు తీసుకోకపోతే కంపెనీ టీఓఆర్ రద్దు అవుతుంది. సొంత భూముల్లోని గనులు సైతం వేలంలోనే పాడుకోవాల్సి వస్తుంది. దాంతో బయపడ్డ ఏసీసీ యాజమాన్యం పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ కాలుష్యనియంత్రణ మండలికీ 2016లో దరఖాస్తు చేసుకుంది. ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడంలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి అప్పటి జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ అధ్యక్షతన 2016 సెప్టెంబర్ 9వతేదీన ప్రజాభిప్రాయసేకరణ సదస్సును ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ నిర్మిస్తామని గత రెండు దశాబ్దాలుగా మోసపుచ్చుతూ వచ్చిన ఏసీసీ యాజమాన్యం ఇప్పుడు నిర్మిస్తుందన్న నమ్మకం తమకు లేదని, ముందు తమ సమస్యలను పరిష్కారించాకే సదస్సు నిర్వహించాలంటూ మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, జమ్మలమడుగు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతులు సదస్సును అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయిన రాష్ట్ర ప్రభుత్వం 500 మందికిపైగా పోలీసులను రంగంలోకి దింపి 2016 అక్టోబర్ 20న తుపాకీ నీడలో ప్రజాభిప్రాయసేకరణ సదస్సును మమ అన్పించింది. పెండింగ్‌లో మైనింగ్ దరఖాస్తులు... సదస్సు నిర్వహణ పూర్తి కావడంతో ఇక తమకు మైనింగ్ అనుమతులు మంజూ రు చేయాలని ఏసీసీ యాజమాన్యం అదే ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే రెండేళ్లుగా ఈ ఫైలు రాష్ట్ర సచివాలయం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం తమకు అనుమతులు మంజూరు చేసిన వెంటనే ఫ్యాక్టరీ నిరా ్మణం మొదలు పెట్టడానికి తాము సిద్ధం గా ఉన్నామని ఏసీసీ డైరెక్టర్ నారాయణరావు ఇక్కడి రైతులకు తరచూ ఫోన్ ద్వారా వివరిస్తూ వస్తున్నారు.కాగా,అధికారపార్టీ పెద్దలు–కంపెనీ యాజమాన్యం మధ్య పర్సెంటేజీల విషయంలో రహస్య ఒప్పందాలు ఓ కొలిక్కి రాకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిలిపివేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఏదో ఒక అబద్ధం చెప్పి రైతుల చెవిలో పూలుపెట్టి ఇంకొంతకాలం పొద్దు పుచ్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. గంటకో మాట... జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మొదటి నుంచి ఏసీసీ బాధిత రైతులను మోసగిస్తూనే వస్తున్నారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. తనను నమ్మి సదస్సు నిర్వహణకు సహకరించాలంటూ 2016 సెప్టెంబర్ 9న రైతులను కోరిన ఆది ఫ్యాక్టరీ నిర్మించకుండా ఇన్నాళ్లు ఆలస్యం చేసినందుకు కంపెనీ నుంచి ఎకరాకు రూ.3.50 లక్షలు నష్ట పరిహారం ఇప్పిస్తామని సభా సాక్షిగా రైతులకు హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించి మూడు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టిస్తానని ముఖ్యమంత్రి స్వయంగా తనకు హామీ ఇచ్చారని అదే ఏడాది అక్టోబర్‌లో ఆది రైతులను భ్రమల్లో దించారు. సదస్సు పూర్తి అయిన తర్వా త ఆదినారాయణరెడ్డి రైతులతో మాట్లాడుతూ 2017 ఉగాది నాటికి పరిహారం డబ్బులు మీ అకౌంట్లుల్లో జమ అవుతాయని, ఆ డబ్బులతోనే ఉగాది పండగ చేసుకోండంటూ ఊదరగొట్టారు. 2018 ఉగాది కూడా ముగిసినప్పటికీ ఇటు నష్టపరిహారం చెల్లించే విషయంలో, అటు ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో మరోసారి రైతు ల చెవిలో పూలు పెట్టడానికి ఆదినారా యణరెడ్డి సిద్ధపడ్డారు. ఆమేరకు ఈసారి 4వాహనాలల్లో 200 మంది రైతులను అమరావతికి తీసుకెళ్లిన ఆయన 2018 మే1 సాయంత్రం ముఖ్యమంత్రితో భేటీ చేయించారు. కాగా, సీఎం చంద్రబాబు నోటనైనా ఖచ్చితమైన హామీ వస్తుందనుకున్న రైతులకు అక్కడ నిరాశే ఎదురైంది. ఫైలు పెండింగ్‌లో ఉందా... చూద్దాం... చేద్దాం...అంటూ ఆయన గారు దాటవేత ధోరణితో మాట్లాడారు. దీంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఈ ప్రశ్నకు జవాబేదీ? రెండు దశాబ్దాలుగా పేరుకుపోయిన తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆ తర్వాతే సదస్సు నిర్వహించుకోవాలంటూ బాధిత రైతులు 2016 సెప్టెంబర్ 9న ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును అడ్డుకుంటే.. నెలన్నర రోజు ల వ్యవధిలోనే వందలాది మంది పోలీ సు బలగాలను పిలిచి తుపాకీ నీడలో సదస్సు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ అనుమతులు ఇవ్వటంలో ఎం దుకు ఇంత జాప్యం చేస్తుందన్న ప్రశ్నకు ఇటు అమాత్యుని వద్ద, అటు కంపెనీ యాజమాన్యం వద్ద జవాబు దొరకడం లేదు. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు తమకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా కనీసం ఫ్యాక్టరీ నిర్మిస్తే భూములు కోల్పోయినా వందలాది మందికి ఉద్యోగాలు, వేల మందికి ఉపాధి లభిస్తుందని రైతులు ఆశపడితే అందులో కూడా స్వార్థ ప్రయోజనాలను ఆశించి తమ నోట్లో మన్ను వేశారని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాలు భూములు కొని బీడుగా పెట్టి రైతుల జీవితాలతో 23 ఏళ్లుగా చెలగాటం ఆడుతోన్న ఏసీసీ యాజమాన్యం మెడలు వంచి ఫ్యాక్టరీ నిర్మింపజేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... అనుమతులు కోసం కంపెనీ పెట్టుకున్న దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉంచడం ఎంతవరకు సమంజసమని బాధిత రైతుల ప్రశ్నిస్తున్నారు. అమాత్యుని కమ్మని మాటలు విని విసిగి వేశారిన బాధిత రైతాంగం ఉద్యమబాట పట్టడానికి సిద్ధమవుతోంది. అప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును సరిదిద్దుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే! -
ప్రైవేటు సిమెంటు కంపెనీకి గ్రీన్‌సిగ్నల్
⇒ ఆదిలాబాద్ శివారులో ఏర్పాటుకు అంగీకారం ⇒ లీజుకు 825 ఎకరాల ప్రభుత్వ భూమి ⇒ 36 నెలల్లో పూర్తి చేయాలని జీఓ జారీ ⇒ నిరుద్యోగులకు ఉపాధి ⇒ సీసీఐ తెరుచుకోవడం అనుమానమే ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ సిమెంటు కార్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 825 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు ఇస్తూ 36 నెలల్లో ఏర్పాటు చేయాలని జీవో కూడా జారీ చేసింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు ప్రభుత్వం అంటుండగా.. ఖాయిలా పడ్డ ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐను తెరిపించడంలో పాలకుల వైఫల్యమని, దానిపై ఆధారపడ్డ కార్మికుల పొట్టగొట్టడమేనని సీసీఐ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకారం లభించడంతో ఇక మూతపడ్డ ప్రభుత్వ రంగ సిమెంట్ ఫ్యాక్టరీ సీసీఐ పునరుద్ధరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ సీసీఐ పునరుద్ధరణకు పలుసార్లు కేంద్రమంత్రులను కలిసినప్పటికీ పరిస్థితిలో మార్పు కానరావడం లేదు. దీంతో ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా చర్యలు సాగాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి సీసీఐ పునరుద్ధరణకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఫ్యాక్టరీ తెరవడం అనుమానంగానే ఉంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని యాపల్‌గూడ, రామాయి గ్రామాల్లో ప్రభుత్వ భూమి 825 ఎకరాలను రేణుక సిమెంట్ ప్యాక్టరీకి 50 సంవత్సరాలపాటు లీజుకు ఇచ్చింది. 36 నెలల్లో ఫ్యాక్టరీని ప్రారంభించాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీ ఏర్పాటుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా... ఆదిలాబాద్ మండలం రామాయి, యాపల్‌గూడ గ్రామాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సిమెంట్ ఫ్యాక్టరీలతో ఒప్పందం చేసింది. 1996 నుంచి ఇప్పటి వరకు లీజు అగ్రిమెంట్లు మారుస్తున్నప్పటికీ పనులు ప్రారంభం కావడం లేదు. ఈసారైనా రేణుక ఇండ్రస్టీస్ వారు 36 నెలల్లో పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీ ప్రారంభిస్తారో లేదోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 1996లో జెనీత్ స్టీల్ పైప్ ఇండ్రస్టీస్ వారికి 1572.99 ఎకరాల భూమిని 20 సంవత్సరాలపాటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు లీజు అగ్రిమెంట్ చేసింది. వారు ఫ్యాక్టరీ పనులు చేపట్టకపోవడంతో 1998లో బీర్లా సిమెంట్ ఇండ్రస్టీస్‌కు అగ్రిమెంట్‌ను మార్పుచేసింది. బీర్లా సిమెంట్ 36 నెలల్లో ఫ్యాక్టరీ ప్రారంభం చేయకపోవడంతో వారికి నోటీసులు జారీ చేసి ప్రస్తుతం రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి అగ్రిమెంట్ చేశారు. అయితే 1572 ఎకరాలలో 747 ఎకరాల భూమి నోటీఫైడ్, అసైన్డ్ భూమి కావడంతో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి 825 ఎకరాల భూమిని కేటాయించింది. 36 నెలల్లో ఫ్యాక్టరీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరు ఏడాదికి ఒక కోటి 20 లక్షల టన్నులు సిమెంట్ ఉత్పత్తి చేయనున్నట్లు అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమైతే నిరుద్యోగులకు మేలు జరగనుంది. జిల్లా అభివృద్ధికి ముందడుగు.. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామిక రంగంలో ముందుండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్ చిన్న జిల్లాగా ఏర్పడింది. ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలంటే పరిశమ్రలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. 1978లో జిల్లాకు మంజూరైన సీసీఐ ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో 874 ఎకరాల్లో ప్రభుత్వ భూమితోపాటు 2 వేల ఎకరాలు లీజులో ఉంది. 1982 ఆగస్టు 15న సిమెంట్ ఉత్పత్తి ప్రారంభం కాగా, రూ.60 కోట్లతో స్థాపించారు. ఆ సమయంలో సుమారు 4 వేల మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 3వేల మంది రెగ్యులర్ ఉద్యోగులే. మిగతా వారు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేశారు. కొన్ని ఆటంకాలతో రెండేళ్ల పాటు వాణిజ్యంగా సిమెంట్‌ను ఉపయోగించలేదు. 1984 మేలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నారాయణదత్ తివారీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి 1991 వరకు ఉత్పత్తి చేస్తూ సిమెంట్ సరఫరా అయ్యేది. 1991లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. తద్వారా 1991, 1992, 1993 సంవత్సరాల్లో సీసీఐ వేల కోట్లలో లాభాలు గడించింది. ఇదే సమయంలో ప్రభుత్వం లేవీపద్ధతి(60శాతం ప్రభుత్వం కొనుగోలు చేయడం)ని రద్దు చేయడంతో సీసీఐకి బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయాయి. దీంతో 1993 అక్టోబర్‌లో సీసీఐ ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీంతో వేలాది మంది కూలీలు రోడ్డున పడ్డారు. పరిశ్రమల రంగంలో ఆదిలాబాద్ జిల్లాను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రైవేట్ సిమెంట్ కార్మాగారాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా బాటలు వేస్తోంది. ఫ్యాక్టరీ ఏర్పాటుపై మంత్రి హర్షం ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడ, రామాయిలో ప్రైవేట్ సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి రామన్న సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో 5 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముందడుగు వేసినట్టవుతుందని హర్షం వ్యక్తం చేశారు. -
సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం..ఇద్దరి మృతి
తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని ఇండియా సిమెంట్స్ కర్మాగారంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కర్మాగారంలో నిద్రిస్తున్న ముగ్గురు కార్మికులను గమనించని జేసీబీ డ్రైవర్ వారిపై నుంచి పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దీపక్, సంజయ్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా. తిలక్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కొలిమిగుండ్లలో ఉద్రిక్తత
కొలిమిగుండ్ల(కర్నూలు): సిమెంట్ కర్మాగారం కోసమంటూ సేకరించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, పడావు పడిన ఆ భూమిని సాగు చేసుకునేందుకు నిర్వాసిత రైతులు చేపట్టిన ప్రయత్నం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి సమీపంలోని కోటపాడు, కల్వటాల గ్రామాల రైతులకు చెందిన దాదాపు రెండు వేల ఎకరాల భూమిని ప్రిజం సంస్థ సిమెంటు కర్మాగారం నిర్మాణం కోసం ఎనిమిదేళ్ల క్రితం సేకరించింది. అయితే, ఇప్పటికీ ఎలాంటి పనులు ఆ స్థలంలో చేపట్టలేదు. దీంతో నిర్వాసిత రైతులు గత రెండు రోజులుగా ఆ స్థలంలో పెరిగిపోయిన కంపచెట్లను జేసీబీల సాయంతో తొలగింపు చేపట్టారు. శనివారం అక్కడ కొనసాగుతున్న పనులను పోలీసులు అడ్డుకున్నారు. జేసీబీలను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. తమకు జీవనాధారమైన భూమిని కొనుగోలు చేసిన సదరు సంస్థ అక్కడ కర్మాగారం ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డామని వాదులాటకు దిగారు. ఉన్న భూమిని కోల్పోవటంతోపాటు ఉపాధి దొరకలేదని, గత్యంతరం లేకనే తాము ఆ భూమిలో సాగు ప్రయత్నాలు చేపట్టామని తెలిపారు. -
మలేసియాలో మనోళ్ల పాట్లు
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌కు చెందిన 300 మంది వేతనం అడిగితే దాడులు చేస్తున్నారని ఆవేదన భీమ్‌గల్: ఏజెంట్ల చేతిలో మోసపోయిన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 300 మంది మలేసియాలో అష్టకష్టాలు పడుతున్నారు. ఏజెంటు ఇచ్చిన టూరిస్టు వీసా గడువు ముగిసి మలేసియా పోలీసులకు చిక్కి పరిహారం చెల్లించిన కొందరు స్వదేశం చేరుకోగా, మిగిలిన వారంతా అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. స్వదేశానికి వచ్చిన వారిలో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. వారి కథనం మేరకు.. భీమ్‌గల్‌కు చెందిన పొలాస నడ్పి భూమేశ్వర్, తొగర్ల గంగాధర్‌లను కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన గల్ఫ్ సబ్ ఏజెంట్ మధుగౌడ్.. వేములవాడకు చెందిన ప్రధాన ఏజెంట్ జోరిగ దేవరాజ్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన ఒక్కొక్కరి వద్ద రూ. 1.20 లక్షలు తీసుకొని మలేసియా పంపించాడు. అక్కడ పవర్‌ప్లాంట్‌లో నెలకు రూ. 30 వేల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. తొలుత టూరిస్టు వీసాపై అక్కడికి వెళ్తే.. మూడు నెలల్లో కంపెనీ వీసా ఇప్పిస్తానని, లేనిపక్షంలో డబ్బులు తిరిగి ఇస్తానని హమీపత్రం రాసిచ్చాడు. దీంతో వీరు నమ్మి ఏజెంట్ చేతిలో పాస్‌పోర్టు పెట్టారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వీరి కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్‌ప్లాంట్ నిర్మాణంలో ఉందని చెప్పి నెలరోజులు ఖాళీగా ఉంచాడు. ఓ చిన్న గదిలో 40 మందిని ఉంచారు. మరోనెలలో సిమెంట్ ప్యాక్టరీలో పనికి కుదిర్చాడు. అక్కడి నుంచి సూపర్ మార్కెట్లో పనికి కుదిర్చాడు. అందులో మూడు నెలలు పని చేసినా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇదేమని అడిగితే.. ఏజెంటును తీసుకురమ్మని గదమాయించారు. ఏజెంటుకు ఫోన్ చేస్తే పత్తాలేకుండా పోవడంతో వారి పరిస్థితి దిక్కుతోచకుంది. వీసా గడువు ముగియడంతో ఇక్కట్లు ఇక్కడ ఏజెంట్ చెప్పినట్లుగా మూడు నెలల తర్వాత కంపెనీ వీసా ఇవ్వలేదు. విజిట్ వీసా గడువు ముగియడంతో ఏజెంట్‌ను ప్రశ్నించగా, కుదరదనడంతో పాటు ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకో’మని బెదిరించాడు. దీంతో వీరు ఇక్కడి బంధువులను ఆశ్రయించగా, టికెట్లు కొనిపంపించారు. అక్కడి ప్రభుత్వం తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని దేశం విడిచి వెళ్లేందుకు అవకాశమిస్తూ గడువు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకొని బయటపడ్డారు. వీసా గడువు నిబంధనలు ఉల్లంఘించినందుకు అక్కడి ప్రభుత్వం విధించిన రూ. 400 రింగిట్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 8 వేలు జరిమానా)ను ఇంటినుంచి పంపడంతో చెల్లించి బయటపడ్డారు. -
మానవతా దృష్టితో ఆదుకోండి
మైలవరం,న్యూస్‌లైన్: నవాబుపేట బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కలిసి శనివారం ఆయన నవాబుపేట గ్రామంలో దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్‌షేడ్ కూలడంతో మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.50 వేలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 20 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 10 వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా బాధిత కుటుంబాలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు, గాయపడినవారికి రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ తమ ట్రస్టు తరపున భవననిర్మాణ కార్మికులకు బీమా చేయించామని మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు బీమా వస్తుందన్నారు. గ్రామంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు వల్ల ఇళ్లు, గో డలు పగుళ్లు వారుతున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దాల్మియాపై పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కేకే కొం డారెడ్డి, నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులను రుణ విముక్తులను చేయాలి రైతులను రుణ విముక్తులను చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల పంటరుణాలు, బంగారు రుణాలే కాకుండా కౌలుదారుని రుణాలను కూడా మాఫీ చేయాలన్నారు. కోల్డ్ స్టోరేజిలు, గోడౌన్లు, దాల్‌మిల్లులు, యంత్ర పరికరాలకు సంబంధించిన నూర్పిడి యంత్రాలు, వర్మి కంపోస్ట్, నర్సరి, ఉద్యానవన మొక్కలు తదితర వ్యవసాయ రంగానికి చెందిన అన్ని రకాల రుణాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో పొందు పరిచిన డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగభృతి తదితర వాటిని అమలు చేయకపోతే నిరసనలు తప్పవన్నారు. ఈ సమావేశంలో తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కేకే కొండారెడ్డి, శివనాథరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా సిమెంట్ అక్రమ వ్యాపారం!
పరిగి, న్యూస్‌లైన్: కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అవుతున్న సిమెంట్‌ను డ్రైవర్లతో కుమ్మక్కైన కొందరు ట్యాంకర్లలోంచి దొంగిలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫ్యాక్టరీల నుంచి బయలుదేరుతున్న లారీలు గమ్యస్థానాల్లో సిమెంట్‌ను పూర్తిగా ఖాళీ చేయకుండా తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో సదరు సిమెంట్‌ను అక్రమార్కులకు అడ్డగోలుగా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఐదారేళ్ల క్రితం పరిగి ప్రాంతంలో ప్రారంభమైన ఈ దందా ప్రస్తుతం వ్యాపారులను శాశించే స్థాయికి చేరుకుంది. వేళ్లూనుకున్న వ్యాపారం.. సిమెంట్ అక్రమ వ్యాపారం పరిగి ప్రాంతంలోని సుల్తాన్పూర్ గేటు, భవానీ థియేటర్, పూడూరు మండలం మన్నెగూడలో యథేచ్ఛగా సాగుతోంది. కొందరు ఏకంగా దుకాణాలు ఏర్పాటు చేసి దందాను నడుపుతున్నారు. కర్ణాటక రాష్ట్రం సేడెం, మల్కెడ్ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి నగరానికి ట్యాంకర్ల ద్వారా సిమెంట్‌ను తరలిస్తుంటారు. అయితే మార్గంమధ్యలోని పైప్రాంతాల్లో డ్రైవర్లు ట్యాంకర్ల నుంచి సిమెంట్‌ను తీస్తున్నారు. సిమెంట్ ట్యాంకర్ల డ్రైవర్లతో అక్రమార్కులు కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. నిత్యం 20-30 ట్యాంకర్ల నుంచి సిమెంట్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారు. రూ. 200-250 చొప్పున ఓ బస్తా అమ్ముతున్నారు. దీనికి తోడు బ్యాగులో తక్కువ సిమెంట్ నింపి ప్రజలను మోసం చేస్తున్నారు. అది ఒరిజినల్ సిమెంటా.. కాదా అనేది దేవుడి తెలుసు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు వస్తుండడంతో జనం ఎగబడుతున్నారు. ఈ క్రమమ దందాను పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు తమ పొట్టగొడుతున్నారని స్థానిక సిమెంట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తాము డబ్బు కట్టి ఏజెన్సీలు, లెసైన్సులు తీసుకొని దుకాణాలు నడుపుకొంటుంటే అక్రమార్కులు నష్టం కలిగిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.