ప్రైవేటు సిమెంటు కంపెనీకి గ్రీన్‌సిగ్నల్‌ | The state government is the green signal for the creation of a private cement plant | Sakshi
Sakshi News home page

ప్రైవేటు సిమెంటు కంపెనీకి గ్రీన్‌సిగ్నల్‌

Published Wed, Jul 12 2017 5:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

ప్రైవేటు సిమెంటు కంపెనీకి గ్రీన్‌సిగ్నల్‌

ప్రైవేటు సిమెంటు కంపెనీకి గ్రీన్‌సిగ్నల్‌

 ఆదిలాబాద్‌ శివారులో ఏర్పాటుకు అంగీకారం
 లీజుకు 825 ఎకరాల ప్రభుత్వ భూమి
 36 నెలల్లో పూర్తి చేయాలని జీఓ జారీ
 నిరుద్యోగులకు  ఉపాధి
 సీసీఐ తెరుచుకోవడం  అనుమానమే

ఆదిలాబాద్‌టౌన్‌:  ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రైవేట్‌ సిమెంటు కార్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 825 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు ఇస్తూ 36 నెలల్లో ఏర్పాటు చేయాలని జీవో కూడా జారీ చేసింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు  ప్రభుత్వం అంటుండగా.. ఖాయిలా పడ్డ ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐను తెరిపించడంలో పాలకుల వైఫల్యమని, దానిపై ఆధారపడ్డ కార్మికుల పొట్టగొట్టడమేనని సీసీఐ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రైవేట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకారం లభించడంతో ఇక మూతపడ్డ ప్రభుత్వ రంగ సిమెంట్‌ ఫ్యాక్టరీ సీసీఐ పునరుద్ధరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ సీసీఐ పునరుద్ధరణకు పలుసార్లు కేంద్రమంత్రులను కలిసినప్పటికీ పరిస్థితిలో మార్పు కానరావడం లేదు. దీంతో ప్రైవేట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా చర్యలు సాగాయి.

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి సీసీఐ పునరుద్ధరణకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఫ్యాక్టరీ తెరవడం అనుమానంగానే ఉంది. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం పరిధిలోని యాపల్‌గూడ, రామాయి గ్రామాల్లో ప్రభుత్వ భూమి 825 ఎకరాలను రేణుక సిమెంట్‌ ప్యాక్టరీకి 50 సంవత్సరాలపాటు లీజుకు ఇచ్చింది. 36 నెలల్లో ఫ్యాక్టరీని ప్రారంభించాలని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీ ఏర్పాటుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారైనా...
ఆదిలాబాద్‌ మండలం రామాయి, యాపల్‌గూడ గ్రామాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సిమెంట్‌ ఫ్యాక్టరీలతో ఒప్పందం చేసింది. 1996 నుంచి ఇప్పటి వరకు లీజు అగ్రిమెంట్లు మారుస్తున్నప్పటికీ పనులు ప్రారంభం కావడం లేదు. ఈసారైనా రేణుక ఇండ్రస్టీస్‌ వారు 36 నెలల్లో పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీ ప్రారంభిస్తారో లేదోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 1996లో జెనీత్‌ స్టీల్‌ పైప్‌ ఇండ్రస్టీస్‌ వారికి 1572.99 ఎకరాల భూమిని 20 సంవత్సరాలపాటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు లీజు అగ్రిమెంట్‌ చేసింది.

వారు ఫ్యాక్టరీ పనులు చేపట్టకపోవడంతో 1998లో బీర్లా సిమెంట్‌ ఇండ్రస్టీస్‌కు అగ్రిమెంట్‌ను మార్పుచేసింది. బీర్లా సిమెంట్‌ 36 నెలల్లో ఫ్యాక్టరీ ప్రారంభం చేయకపోవడంతో వారికి నోటీసులు జారీ చేసి ప్రస్తుతం రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీకి అగ్రిమెంట్‌ చేశారు. అయితే 1572 ఎకరాలలో 747 ఎకరాల భూమి నోటీఫైడ్, అసైన్డ్‌ భూమి కావడంతో రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీకి 825 ఎకరాల భూమిని కేటాయించింది. 36 నెలల్లో ఫ్యాక్టరీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరు ఏడాదికి ఒక కోటి 20 లక్షల టన్నులు సిమెంట్‌ ఉత్పత్తి చేయనున్నట్లు అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమైతే నిరుద్యోగులకు మేలు జరగనుంది.

జిల్లా అభివృద్ధికి ముందడుగు..
వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాను పారిశ్రామిక రంగంలో ముందుండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్‌ చిన్న జిల్లాగా ఏర్పడింది. ఆదిలాబాద్‌ అభివృద్ధి జరగాలంటే పరిశమ్రలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. 1978లో జిల్లాకు మంజూరైన సీసీఐ ఆదిలాబాద్‌ పట్టణ శివారు ప్రాంతంలో 874 ఎకరాల్లో ప్రభుత్వ భూమితోపాటు 2 వేల ఎకరాలు లీజులో ఉంది.

1982 ఆగస్టు 15న సిమెంట్‌ ఉత్పత్తి ప్రారంభం కాగా, రూ.60 కోట్లతో స్థాపించారు. ఆ సమయంలో సుమారు 4 వేల మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 3వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులే. మిగతా వారు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేశారు. కొన్ని ఆటంకాలతో రెండేళ్ల పాటు వాణిజ్యంగా సిమెంట్‌ను ఉపయోగించలేదు. 1984 మేలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నారాయణదత్‌ తివారీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు.

అప్పటి నుంచి 1991 వరకు ఉత్పత్తి చేస్తూ సిమెంట్‌ సరఫరా అయ్యేది. 1991లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. తద్వారా 1991, 1992, 1993 సంవత్సరాల్లో సీసీఐ వేల కోట్లలో లాభాలు గడించింది. ఇదే సమయంలో ప్రభుత్వం లేవీపద్ధతి(60శాతం ప్రభుత్వం కొనుగోలు చేయడం)ని రద్దు చేయడంతో సీసీఐకి బడ్జెట్‌ కేటాయింపులు నిలిచిపోయాయి. దీంతో 1993 అక్టోబర్‌లో సీసీఐ ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీంతో వేలాది మంది కూలీలు రోడ్డున పడ్డారు. పరిశ్రమల రంగంలో ఆదిలాబాద్‌ జిల్లాను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రైవేట్‌ సిమెంట్‌ కార్మాగారాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా బాటలు వేస్తోంది.

ఫ్యాక్టరీ ఏర్పాటుపై మంత్రి హర్షం
ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ మండలం యాపల్‌గూడ, రామాయిలో ప్రైవేట్‌ సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి రామన్న సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో 5 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి ముందడుగు వేసినట్టవుతుందని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement