సాక్షి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామన్నపేటలో ఏర్పాటు చేయనున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రామన్నపేటలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కంపెనీ ఏర్పాటును అఖిలపక్షం నేతలు వ్యతిరేకిస్తున్నారు.
రామన్నపేటలో అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే లింగయ్య అరెస్ట్. పోలీసులతో లింగయ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసు వాహనంలో లింగయ్యను స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది.
ఇక, ప్రజాభిప్రాయ సేకరణ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రాంతానికి భారీగా చేరుకుంటున్నారు అఖిలపక్ష నేతలు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికేతరులను అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. అభిప్రాయసేకరణను జరగనివ్వమని అఖిలపక్ష నేతలు చెబుతున్నారు. మరోవైపు.. స్థానికులు కూడా అంబుజా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
రామన్నపేట పట్టణ కేంద్రంలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతి ఇవ్వద్దని పలు గ్రామాల ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల కాలుష్య సమస్య తలెత్తి ప్రజా ఆరోగ్యాలు దెబ్బ తినడంతో పాటు పచ్చటి పంట పొలాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని మండల పరిధిలోని కొమ్మాయిగూడెంలో సుమారు 350 ఎకరాలను కొనుగోలు చేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు ఈనెల 23న ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment