ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు పాల ధర అదనపు భారమవుతోంది.
కొడవలూరు, న్యూస్‌లైన్: ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు పాల ధర అదనపు భారమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రైవేటు డెయిరీలు ధరను పెంచేయగా ప్రభుత్వ రంగ సంస్థ విజయా డెయిరీ 17వ తేదీన అధికారికంగా ప్రకటించనుంది. మొత్తంగా అన్ని డెయిరీలు కలిపి 20వ తేదీ లోపు ధర పెంచాలని నిర్ణయించాయి. లీటర్‌కు రెండు రూపాయలు పెంచుతుండటంతో జిల్లా వాసులపై అదనంగా నెలకు రూ.42 లక్షల భారం పడనుంది. మధ్యతరగతి ప్రజలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. పాల ప్యాకెట్లను ఎక్కువగా మధ్య తరగతి వారే వినియోగిస్తున్నారని అంచనా. రోజుకు లీటరు పాలు వినియోగించే వారు ఇకపై నెలకు అదనంగా రూ.60 వెచ్చించాలి.
కుంటి సాకులే
పాల ధర పెంపునకు సేకరణ ధర, డీజిల్ ధరల పెరుగుదలను డెయిరీలు కారణం చూపుతున్నా అవి కుంటుసాకులేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొడ్ల డెయిరీ వారయితే ఈ కారణాలు చూపుతూ కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే రైతులకిచ్చే పాల ధర ఇటీవల కాలంలో పెంచిన దాఖలాలు లేవు.
కొద్ది నెలల క్రితం మాత్రమే కాస్త పెంచారు. రైతుల వద్ద కొనే పాలలో పది శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.46 చెల్లిస్తామని ప్రకటించారు. ధర నిర్ణయించే సమయంలో మాత్రం వెన్న శాతం ఆరు నుంచి ఏడు లోపే ఉన్నట్లు చూపి ధర తగ్గించేస్తున్నారు. సగటున ఒక్కో రైతుకు లీటర్‌కు రూ.34 మాత్రమే లభిస్తుంది. డీజల్ ధర పెరుగుదల నిజమే అయినప్పటికీ డెయిరీల వారు కేవలం పాల రవాణాకు మాత్రమే దానిని వినియోగిస్తారు. దీనినే ప్రధాన కారణంగా చూపి పాల ధరను ఒక్కసారిగా లీటరుకు రూ.రెండు పెంచడం దారుణమని వినియోగదారులు మండిపడుతున్నారు.