సాక్షి, కడప: సౌదీ అరేబియాలో నిరుద్యోగ సమస్య పెరగడంతో అక్కడి ప్రభుత్వం నితాఖత్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం స్థానికులకు ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ ఇవ్వాలి. విజిట్ వీసాలపై వచ్చి పని చేస్తున్న వారిని స్వదేశాలకు వెళ్లగొట్టాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సౌదీలోని కంపెనీల్లో మన దేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పిన్ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. సౌదీ ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశానికి చెందిన వారే సుమారు 2 మిలియన్ల మంంది ఉన్నారు. అందులోనూ తెలుగువారు అధికంగా ఉంటే, వారిలో వైఎస్సార్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా అక్కడ కార్మికులుగా, ఉద్యోగులుగా పని చేస్తున్నారు. టూరిస్ట్ వీసాలపై వెళ్లి అక్కడ తాత్కాలిక ఉద్యోగులుగా రహస్యంగా పని చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. వీరందరూ ఆమ్నెస్టీ (అక్రమ నివాసులు) కిందకు వస్తారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న వారి వివరాలు వెలికి తీసి, వారిని సొంత దేశాలకు పంపేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గతంలోనే గడువు ముగిసినా:
నిబంధనలకు విరుద్ధంగా సౌదీలో ఉంటున్నవారు జూలై 3వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఇది వరకే సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిశాక ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆగస్టులో రంజాన్ పర్వదినం, అక్టోబరులో బక్రీద్ ఉండటంతో బాధితులను ఇబ్బంది పెట్టకూడదని సౌదీరాజు అబ్దుల్లా నవంబరు 4 వరకూ గడువు పొడిగించారు. దీంతో అప్పటికే ఆమ్నెస్టీ అరెస్టుల ద్వారా జైళ్లో పెట్టిన వారిని కూడా విడిచిపెట్టారు. వీసాలను సరిచేసుకుని రావాలని సూచించారు. సౌదీలో ఆరు నెలల వరకూ కంపెనీలలో సెలవు పెట్టేందుకు వీలుంది. దీంతో సెలవుపై ఇండియాకు వచ్చి తిరిగి వీసాలను పకడ్బందీగా చేసుకుని తిరిగి వెళ్లాలనే ఆశతో ఇప్పటికే 4వేలమంది బాధితులు స్వస్థలాలకు చేరారు.
ఇంకా పదివేలమంది దాకా సౌదీలోనే:
ప్రస్తుతం మన జిల్లా వాసులు దాదాపు 10వేల మందికిపైగా సౌదీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది విమాన టికెట్టు కొనడానికి డబ్బులు లేక అక్కడే నిలిచిపోయారు. ఔట్‌పాస్ కోసం ఇండియన్ ఎంబసీలో దరఖాస్తు చేసుకున్నా రోజులు గడుస్తున్నా అక్కడ ఔట్‌పాస్ ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. దమామ్ పట్టణంలో వందలాది మంది పొట్ట చేతపట్టుకుని ఫుట్‌పాత్‌లపై, పార్కులలో కాలం వెళ్లదీస్తున్నారని సౌదీలో ఉంటున్న ప్రొద్దుటూరు వాసి కమాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ చర్యలు ఏవీ?:
సౌదీ ప్రభుత్వం విధించిన ఆఖరి గడువు నవంబర్ 4తో ముగియనుంది. గడువు దాటితే జిల్లా వాసులంతా సౌదీ జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సుస్పష్టంగా తెలుసు. ఈ క్రమంలో మరో 19 రోజుల్లో గడువు ముగుస్తుందని తెలిసినా, ఇప్పటి వరకూ మన జిల్లా వాసులను రప్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడం, బాధితులను రప్పించేందుకు ప్రత్యేకంగా మంత్రిని నియమించడం లాంటి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించలేదు.
అయితే కేరళ ప్రభుత్వం జూలై 3 గడువుకు ముందే వారి రాష్ట్రానికి చెందిన వారందరికీ టిక్కెట్లు చెల్లించి ప్రత్యేకంగా రప్పించింది. అయితే మన ప్రభుత్వం మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ ప్రకటన, సమైక్య ఉద్యమ ప్రభావంతో ప్రజాప్రతినిధులు ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించి బాధితులను రప్పిస్తారో, లేదో అని బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి తమ వారిని స్వస్థలాలకు చేర్చాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
గల్ఫ్ గుబులు
Published Wed, Oct 16 2013 2:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement
Advertisement