కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం.. సురక్షితంగా గమ్యానికి చేరుస్తాం.. అంటూ నినదించే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవడం లేదు. డొక్కు బస్సులతో కాలం గడుపుతోంది. అభివృద్ధి చార్జీ పేరుతో ప్రయాణికుడిపై అదనపు భారం మోపుతున్నా సౌకర్యాల్లో మెరుగుదల కనిపించడం లేదు. జిల్లాలో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు కొత్త బస్సులు రాకపోడంతో కాలం చెల్లిన, కండీషన్‌లో లేని వాటిని తిప్పుతున్నారు. కిటీకీలకు అద్దాలు లేకుండా, సీట్లు విరిగి పోయి.. బస్సులో పలు భాగాలు పగిలిపోయి కనిపిస్తున్నాయి. ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స కోసం ఏర్పాటు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు చాలా బస్సులో కనిపించడం లేదు.
మోటారు వాహన చట్టం (రవాణ శాఖ) ప్రకారం ప్రయాణికులను తీసుకెళ్లే ప్రతీ బస్సు, ఇతర వాహనంలోనూ ఫస్ట్ ఎయిడ్ బాక్సు ఏర్పాటు చేయాలి. అందులో మెడికల్ కిట్టు పెట్టాలి. కాటన్ (దూది), బ్యాండేజ్, సర్జికల్ స్పిరిట్, యాంటి సెప్టిక్ క్రీము, కాటన్ బ్యాండేజ్‌తోపాటు పెయిన్ కిల్లర్ ( నొప్పుల మాత్రలు) ఉండాలి. రిజిస్ట్రేషన్ తోపాటు పాసింగ్ కోసం వెళ్లినప్పుడు రవాణా శాఖ అధికారులు పరిశీలించిన తరువాత ఫిట్‌నెస్ పాసింగ్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. కాని ఆర్టీసీ ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ఇంద్ర బస్సుల్లో తప్ప ఇతర వాటిలో వీటి నిర్వాహణ లేదు.
వినోదం కరువు:
ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి వినోదం కరువైంది. హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేయాలి. అత్యధికంగా డబ్బును చార్జీల రూపంలో వసూలు చేస్తున్నప్పటికీ ఆర్టీసీ తగిన వినోదాన్ని అందించలేకపోతోంది.
అగ్నిమాపక పరికరాలు ఉండవు
బస్సుల్లో అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలం చెందింది. ఇంద్ర బస్సుల్లో తప్ప మిగిలిన బస్సుల్లో కనబడవు. కనీసం దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ (హైటెక్)లోనూ ఏర్పాటు చేయలేదు. దీంతో అగ్ని ప్రమాదాల సమయంలో ప్రయాణికుల భద్రత ఏమేరకు ఉందో చెప్పవచ్చు.
అసౌకర్యాల ప్రయాణం
Published Mon, Jan 6 2014 2:06 AM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM
Advertisement
Advertisement