పేదల భూములపై ‘పచ్చ’ కన్ను!
కాసుల కోసం దేనికైనా సిద్ధమయ్యే ‘పచ్చ’ నేతల కన్ను యడవల్లి పేదల భూములపై పడింది. ప్రభుత్వం తమదేనన్న ధీమాతో టీడీపీ నేతలు అక్రమ దందాకు తెర తీశారు. జీవనోపాధి కోసం 1973లో అప్పటి జిల్లా కలెక్టర్, 2006లో ఆనాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చిన భూములను నయూనో భయూనో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదలకు అండగా ఉండాల్సిన అధికార గణం అక్రమార్కులకు సహకారం అందిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
చిలకలూరిపేట రూరల్: పేదరికంతో అల్లాడిపోతున్న యడవల్లి గ్రామ ఎస్సీలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వమిచ్చిన సాగు భూములను అక్రమ మార్గాల్లో దక్కించుకునేందుకు జిల్లా టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉండటమే దీనికి కారణం. అధికార పార్టీ నేతల ఎత్తుగడలకు రెవెన్యూ అధికారులు యథాశక్తిన సహకరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు.
ఇదీ సంగతి..
1973లో నాటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్య చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న 360 ఎకరాల ప్రభుత్వ భూమిని 120 మంది ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున ఇవ్వగా లబ్ధిదారులు పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనంతరం 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టినపుడు ఈ భూమికి మరో 45.50 ఎకరాలను కలిపి(మొత్తం 405.50 ఎకరాలు) అవే ఎస్సీ కుటుంబాలకు చెందిన 250 మంది లబ్ధిదారులకు విడివిడిగా పంపిణీ చేశారు.
సాగు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం..
భూముల్లో వ్యవసాయం చేసేందుకు అవసరమైన సాగు నీరు సరిగా అందటం లేదని లబ్ధిదారులు వాపోతుండటంతో 2006లో నాటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సమస్యను సీఎం వైఎస్ దృష్టి కి తీసుకువెళ్లారు. దీనికి స్పందిస్తూ రూ. 3.06 కోట్ల అం చనాతో సోమేపల్లి సాంబయ్య లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేశారు. 2008లో ఈ పథకం ప్రారంభం కావటంతో లబ్ధిదారుల సమస్య చాలావరకు తీరింది.
అనధికార సర్వేల నిర్వహణ..
యడవల్లి ఎస్సీలకు ప్రభుత్వమిచ్చిన భూముల్లో గ్రానైట్ నిల్వలున్నట్టు తెలియటంతో టీడీపీ నేతలు మైనింగ్ శాఖ అధికారులతో అనధికారికంగా రహస్య సర్వేలు నిర్వహింపజేశారు. 250 ఎకరాల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్టు తేలటంతో వాటిని దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు.
యడవల్లిలోని 380, 381-15, 16, 17, 20-2ఎ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ నిల్వలను తవ్వుకునే లీజు కోసం నిరభ్యంతర ధ్రువీకరణపత్రం(ఎన్‌వోసీ) జారీ చేయూలని కోరుతూ మండల తహశీల్దార్‌కు దరఖాస్తులు సమర్పించటం ప్రారంభించారు. టీడీపీ నేతల మార్గదర్శకత్వంలో పేట ప్రాంతంలోని ఒక కోల్డ్ స్టోరేజీ యజమాని, మరో పది మంది వివిధ పేర్లతో ఇప్పటికే 15 దరఖాస్తులను సమర్పించారు.
ఎకరం రూ.35 లక్షల పైమాటే..
గ్రానైట్ నిక్షేపాలున్న భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నారుు. గతంలో ఎకరం ధర రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పలుకుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. విక్రయించే వ్యక్తి పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన బీఫారం ఉంటే ఒక ధర, పట్టాదారు పాస్‌పుస్తకం ఉంటే మరో ధర లభిస్తోందని చెబుతున్నారు. సంబంధిత భూములపై ఇప్పటివరకు 12 అగ్రిమెంట్‌లు చేసుకోగా రెండు రిజిస్ట్రేషన్‌లు ఇప్పటికే పూర్తరుునట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మారుతున్న సర్వే నంబర్లు
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూమిని విక్రరుుంచటం, కొనుగోలు చేయటం నేరమని అందరికీ తెలిసిన విషయమే. దీంతో టీడీపీ నేతలు ప్రైవేట్ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నంబర్‌లను మార్పించటానికి యత్నిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన సర్వే నంబర్ల డివిజన్‌లు, సబ్‌డివిజన్‌ల నంబర్లకు మరో నంబర్‌ను జోడిస్తే రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఉండదనేది వారి ఎత్తుగడ. అంతేకాకుండా వేర్వేరు పేర్లతో లింకు డాక్యుమెంట్లు సృష్టిస్తున్నట్టు సమాచారం.
ఎన్‌వోసీపై రహస్య విచారణ
గ్రానైట్ నిక్షేపాలను తవ్వుకునేందుకు రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌వోసీ పొందటం తప్పనిసరి. గతంలో ఎన్‌వోసీ జారీ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉండేది. ప్రస్తుతం ఆ అధికారం మండల తహశీల్దార్లది కావటంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. కాగా, పలువురి నుంచి అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు ఆయూ భూముల పరిస్థితిపై రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
అర్జీలు పెండింగ్‌లో ఉన్నారుు..
యడవల్లి గ్రామంలోని భూముల్లో గ్రానైట్ నిక్షేపాలను తవ్వుకునేందుకు అనుమతులు కోరుతూ దరఖాస్తులు వచ్చిన మాట వాస్తవమేనని తహశీల్దార్ జి.వి.ఎస్.ఫణీంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు 15 అర్జీలు వచ్చాయని, వీటి పరిశీలన పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. భూములపై ఇప్పటివరకు తామెలాంటి విచారణ జరపలేదని పేర్కొన్నారు.