లారీ దాచిపెట్టి చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి..
హిందూపురం అర్బన్ : లారీ దాచిపెట్టి చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, లారీపై తీసుకున్న ఫైనాన్స్ ఎగ్గొట్టి, ఆపై ఇన్సూరెన్సు పొందాలని ప్లాన్ వేసిన లారీ యాజమానితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లారీలు, లారీ చారుుస్, నెంబర్లు మార్చడానికి ఉపయోగించే పరికారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు మంగళవారం వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం... హిందూపురం సమీపంలోని సడ్లపల్లికి చెందిన నరసింహమూర్తి శ్రీరామ్‌ఫైనాన్స్‌లో రూ.6లక్షలు అప్పుగా తీసుకున్నారు.
దానికి తన ఇంటిని అమ్మితే వచ్చిన సొమ్ము రూ.2.80లక్షలు కలిపి లారీ కొన్నాడు. లారీ సరిగా తిరగక అప్పులు ఎక్కువై లారీని రూ.2లక్షలకు షాబాజ్‌ట్రాన్స్‌పోర్టు మహబూబ్‌బాషకు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని సలహా మేరకు లారీని దాచిపెట్టి, చోరీ అయ్యిందని ఫిర్యాదు చేస్తే ఇన్సూరెన్స్ కింద రూ.6లక్షలు వస్తుందని, దాంతో అప్పులు తీర్చుకుని కుతురుపెళ్లి చేయవచ్చునని ప్లాన్ వేశారు. ఈ మేరకు తన లారీ ఏపీ 02వై 6842 చోరీకి గురైందని నవంబర్ 19న టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇంతలో నరసింహమూర్తి షాబాజ్ లారీ ట్రాన్స్‌పోర్టు ఓనర్ మహబూబ్ బాష సహకారంతో 15వ తేదీనే లారీని ఇరువురు కలిసి ఎవరికీ తెలియకుండా కర్ణాటకలోని హోసకోట గ్రామ సమీపంలోని ఇటసంద్ర తీసుకెళ్లారు. అక్కడ మహబూబ్‌బాష అన్న అల్లాబకాష్ ఇంటి వద్ద 20 రోజులు ఉంచి కొత్త పెయింటింగ్ చేశారు. లారీకి ఉన్న పాతపేరు నాగలక్ష్మి తొలగించి షాబాజ్‌ట్రాన్స్ పోర్టుగా మార్చి లారీ నంబరును ఏపీ26 యు 9898గా మార్చుకున్నారు. ఈ నెంబరు లారీకి నెల్లూరు శ్రీరాంఫైనాన్స్‌లో స్కాప్‌కింద రెండేళ్ల కిందట కొన్న లారీ నంబరు మహబూబ్‌బాష వేశారు.
ఆ స్కాప్‌కింద కొన్న లారీకి ప్రొద్దుటూరులో ఓ వ్యక్తితో కొన్న లారీ ఏపీ 36 యు 6455నెంబరు వేరుుంచారు. చాసి నెంబరును 426021బిడబ్ల్యుజెడ్ 705373గా మార్చుకున్నాడు. నెల్లూరు స్కాప్‌లో కొన్న లారీ నెంబరు, చాసీ నెంబర్లను 426021సిడబ్లుజెడ్ 203474 నరసింహమూర్తి లారీకి మార్చుకున్నారు. ఈ రెండు లారీల చాసి నెంబర్లు మార్చుకోవడానికి రహమత్‌పురంలోని ఆయూబ్‌తో చాసి నెంబర్లును గ్రైండింగ్‌చేయించి సిద్ధం చేశారు.
నరసింహమూర్తి మాటలపై అనుమానం వచ్చి డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో టూటౌన్ ఎస్సై అబ్దుల్‌కరీం సబ్‌డివిజన్ టాస్క్‌ఫోర్సు ఎస్సై ఆంజినేయులు, సిబ్బంది తిరుమలేసు, మల్లికార్జున, శివకుమార్, షాకీర్‌లు దర్యాప్తు చేసి నరసింహమూర్తి, మహబూబ్‌బాష, షేక్ ఆయూబ్‌లను అరెస్టు చేసి, రెండు లారీని సీజ్ చేశారు. సీఐలు మధుభూషన్, రాజగోపాల్, ఎస్సైలు ఆంజినేయులు, కరీం, సిబ్బంది పాల్గొన్నారు.