
జెడ్పీ పీఠం ఎవరిదో!
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక స్థానిక సంస్థల పీఠాలను నింపాల్సి ఉంది. మేయర్, మునిసిపల్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం ఆశావహులంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా కేబినెట్ ర్యాంకు కల్గిన జిల్లాపరిషత్ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది.
ఇప్పటికే ఈ పదవి ఆశించి జెడ్పీటీసీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టుకున్న టీడీపీ నేతలు.. తమ అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రామగిరి జెడ్పీటీసీ సభ్యుడు దూదేకుల చమన్‌సాబ్, గార్లదిన్నె జెడ్పీటీసీ సభ్యురాలు విశాలాక్షి, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందంలో భాగంగా చమన్‌సాబ్‌కు రెండున్నరేళ్లు, పూల నాగరాజుకు రెండున్నరేళ్లు అవకాశం ఇవ్వాలని టీడీపీ జిల్లా నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ఆ ఒప్పందం అమలయ్యేలా లేదు.
చెమన్‌కు పదవి ప్రశ్నార్థకమే!
పరిటాల సునీత రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నేపథ్యంలో ఆమె ముఖ్య అనుచరుడిగా ఉన్న చమన్‌సాబ్‌కు జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రెండు కేబినెట్ పదవులను హిందూపురం పార్లమెంటు స్థానం పరిధిలోని నేతలకు కట్టబెట్టారు. కేబినెట్ స్థాయి కల్గిన జెడ్పీ చైర్మన్ పదవిని అదే పార్లమెంటు పరిధిలోని వారికి కేటాయించక పోవచ్చని తెలుస్తోంది.
చైర్మన్ పీఠాన్ని ఆశించి ఎన్నికల్లో చమన్, పూల నాగరాజు భారీగా ఖర్చు చేసినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే చమన్ పరిటాల అనుచరుడు కావడంతో పాటు ఫ్యాక్షన్ నేపథ్యం, పలు కేసుల్లో నిందితుడిగా ఉండటం వల్ల అవకాశం కల్పించకూడదని మెజార్టీ నాయకులు అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
మంత్రి పదవితోనే పరిటాల వర్గం జిల్లాలో బలపడనుందని, చమన్ చేరితే వారి బలం మరింత పెరుగుతుందని భావిస్తూ ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా పరిటాల వర్గం బలపడితే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీలోని ఇతర నాయకులు భావిస్తున్నారు. దీంతో చమన్‌కు చైర్మన్ గిరి దక్కక పోవచ్చని అత్యధిక నేతలు భావిస్తున్నారు. గెలుపు ఓటమిల్లో కీలక పాత్ర వహించే సామాజిక వర్గంగా పేరున్న బోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మఘట్ట జెడ్పీటీసీ పూల నాగరాజు కూడా జెడ్పీ పీఠం బరిలో ఉన్నారు. గుమ్మఘట్ట అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలో ఉండడం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
అయితే నాగరాజుకు ఇతర టీడీపీ నేతల మద్దతు కొరవడినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు భాస్కర్ ఫర్టిలైజర్స్ యజమాని సన్నిహితుడు. ఇతని భార్య విశాలాక్షి గార్లదిన్నె జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఈమె కూడా ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గాండ్ల సామాజిక వర్గానికి చెందిన విశాలాక్షికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలంటూ కాలవ శ్రీనివాసులుతో పాటు ఎమ్మెల్సీ శమంతకమణి, శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల, తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
జేసీ సోదరుల మద్దతు ఎవరికో...
జెడ్పీ చైర్మన్ విషయంలో జేసీ సోదరుల మద్దతు ఎవరికన్నది అంతుచిక్కడం లేదు. జిల్లాలో అత్యధిక స్థానాలను గెలిపించిన జేసీ సోదరులకు అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వారికి బద్ధశత్రువుగా ఉన్న పరిటాల సునీతకు రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కడంతో వారి వర్గీయులు లోలోపల రగిలిపోతున్నారు. ఈ క్రమంలో పరిటాల సునీత ముఖ్య అనుచరుడు చమన్‌కు చైర్మన్ పదవి ఇస్తే.. ఆ వర్గం మరింత బలపడే అవకాశం ఉందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ సోదరులు ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పూల నాగరాజు, విశాలాక్షి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది.
జెడ్పీకి భారీగా నిధులు
జిల్లాపరిషత్‌కు బీఆర్‌జీఎఫ్‌తో పాటు జనరల్ ఫండ్, వివిధ గ్రాంట్ల రూపంలో ప్రతియేటా దాదాపు రూ.170 కోట్లు వస్తుంటాయి. సాధారణంగా బీఆర్‌జీఎఫ్ కింద ఏడాదికి రూ.35-40 కోట్ల వరకు నిధులు విడుదలవుతాయి. జనరల్ ఫండ్స్, స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌సీ).. ఇలా వివిధ గ్రాంట్ల కింద రూ.110-130 కోట్ల వరకు వస్తుంటాయి. ఈ నిధులన్నీ చైర్మన్ ద్వారానే ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తారు. ఈ పరిస్థితుల్లో జెడ్పీ చైర్మన్ పదవికి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది.