స‘పోర్టు’ ఇచ్చేనా?
- కొత్త ప్రభుత్వం, కొత్త ప్రతిపాదనలు
- పీపీపీ అంటూ కొత్త రాగం
- నవయుగ సంస్థతో ఇంతవరకు చర్చలే లేవు
- బడ్జెట్‌లో బందరు పోర్టుకు నిధులేవీ?
- ఆరు నెలల్లో పోర్టు పనుల హామీ నెరవేరేనా?
జిల్లా వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బందరు పోర్టు వ్యవహారం మూడడుగులు ముందుకీ... ఆరడుగులు వెనక్కీ అన్న చందంగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోర్టు నిర్మాణ విషయంలో పాలకులు కొత్తరాగం ఆలపించడం షరా మామూలైందనే వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వం బీవోటి పద్ధతి ప్రతిపాదిసే.. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ పద్ధతిని ప్రతిపాదిస్తుండడంతో పోర్టు అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం సాగదీత ధోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని జిల్లాకు చెందిన మంత్రులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలు పూర్తికావస్తోంది. ఇంత వరకు పోర్టు పనులు ప్రారంభానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు.
బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోర్టు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పోర్టు నిర్మిస్తామని ప్రకటించారే తప్పా ఏ మేరకు నిధులు కేటాయిస్తారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. కాగా గత ప్రభుత్వ హయాంలో బందరు పోర్టు నిర్మాణాన్ని బీవోటీ పద్ధతిలో నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. టీడీపీ ప్రభుత్వంలో పీపీపీ పద్ధతి ద్వారా పోర్టు నిర్మిస్తామని చెబుతుండటంతో... అసలు పోర్టు పనులు ప్రారంభమవుతాయా అనే అనుమానాలకు తెరలేస్తుంది. 13 సంవత్సరాలుగా బందరు పోర్టు నిర్మించాలనే ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి మారిన ప్రతిసారీ పోర్టు నిర్మాణం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ ఈ అంశాన్ని సాగదీస్తూ వస్తున్నారు.
నవయుగ సంస్థతో చర్చలే జరపలేదు ...
బందరు పోర్టు నిర్మాణ పనులను నవయుగ కన్సార్టియం సంస్థకు 2010 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య అప్పగించారు. 2012 మే 2వ తేదీన పోర్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి 5324 ఎకరాలను కేటాయిస్తూ జీవో నంబరు 11ను జారీ చేశారు. అప్పటి నుంచి భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ముందడుగు పడలేదు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెలల వ్యవధిలో బందరుపోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదు. భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయలేదు. కాగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తేనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.