కనుముప్పు | The number of victims of the Mayophiya | Sakshi
Sakshi News home page

కనుముప్పు

Published Fri, Jul 14 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

కనుముప్పు

కనుముప్పు

► చిన్నారుల పాలిట శాపంగా మారుతున్న సెల్‌ఫోన్‌లు, టీవీలు, ట్యాబ్‌లు
► పదేళ్ల వయసొచ్చేసరికే హ్రస్వదృష్టి వస్తున్న వారు వేలల్లో..


మయోఫియా బాధితుల సంఖ్య
భారత్‌ 42 %
అమెరికా 54 %
దృష్టి లోపంతో బాధపడుతున్న పదేళ్లలోపు చిన్నారులు 1,22,000
రోజుకు 2 గంటలకు మించి గాడ్జెట్లు వాడుతున్న చిన్నారులు 4,00,000


చిన్నారుల కంటిచూపునకుకష్టమొచ్చింది. నిండా అమాయకత్వాన్ని నింపుకొన్న ఆ పసి చూపులు మొబైల్‌ మాయలో పడి మసకబారుతున్నాయి. లోకం పోకడే తెలియని ఆ కళ్ల లోగిళ్లలో వీడియో గేమ్స్‌ విలయతాండవం చేస్తున్నాయి. కంప్యూటర్‌ ‘కాల’నాగులు ఆ నేత్రాలను నీడలా వెంటాడుతున్నాయి.. ఎల్‌ఈడీ క్రీ నీడలు నిత్యం వెన్నంటే వస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల కబంధ హస్తాల్లో చిన్నారుల చూపులు చిక్కుకుపోయాయి. మొబైల్, ట్యాబ్, టీవీలను గంటల కొద్దీ చూడటం వల్ల చిన్ని చిన్ని ఆ కళ్లను భూతద్దాలు కూడా కాపాడలేని పరిస్థితులొచ్చాయి.

సాక్షి, అమరావతి :  మా అబ్బాయి వీడియోగేమ్‌లు ఎంత బాగా ఆడతాడో అంటూ ముచ్చటపడిపోతాం. పిల్లాడి చేతులు కీబోర్డ్‌పై చకచకా నడుస్తుంటే కళ్లప్పగించి చూస్తూ ఉంటాం. మా అబ్బాయి స్మార్ట్‌ఫోన్‌లో అన్ని గేమ్‌లూ ఆడగలడు అంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పి సంతోషపడతాం. కానీ ఈ అలవాట్లు వ్యసనంగా మారి వారి కంటి చూపును కాటేస్తున్నాయనే విషయాన్ని గమనించలేకపోతున్నాం. గంటల తరబడి తీక్షణంగా వాటి మీదే దృష్టి సారించడం వల్ల రెటీనాపై తీవ్ర ప్రభావం పడుతోంది. వేగంగా కంటిచూపు తగ్గిపోతోంది. దీంతో యాభై ఏళ్ల వరకూ ఆరోగ్యంగా ఉండాల్సిన కళ్లు పదేళ్లకే మసకబారి పోతున్నాయి. ఇలాంటి చిన్నారులపై ‘సాక్షి’కథనం..

బ్లూ లైట్‌ ప్రభావం తీవ్రమైంది..
స్మార్ట్‌ ఫోన్‌లు, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటివాటికి బ్లూలైట్‌ ఉంటుంది. ఇలాంటి పరికరాలను ఎక్కువ సేపు కంటికి దగ్గరగా పెట్టుకుని చూడటం వలన కనుగుడ్డుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఐదేళ్ల వయసు నుంచే కంప్యూటర్‌లో గేమ్స్‌ మొదలెట్టడం, పదేళ్లొచ్చే సరికి రోజుకు ఆరు గంటల నుంచి 8 గంటల వరకూ వీటితోనే గడుపుతున్నట్టు కూడా జాతీయ అంధత్వ నివారణ సంస్థ గుర్తించింది. వీటి కారణంగా పదేళ్లకే సమస్యలు వస్తున్నట్టు తేల్చారు.

మయోఫియా బారిన చిన్నారులు..
మయోఫియా... దీన్నే హ్రస్వ దృష్టి అంటారు. దీనివల్ల దూరంగా ఉన్నవేవీ సరిగ్గా కనిపించవు. ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు చిన్నారులు. నేషనల్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ దీనిపై సర్వే చేయగా, భారత్, అమెరికాల్లో గతంలో కంటే మయోఫియా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇవేగాక చిన్నారుల్లో తీవ్రమైన తలనొప్పి రావడం, కళ్లు లాగినట్టు ఉండటం, కళ్లలో తేమ శాతం తగ్గి మంటగా ఉండటం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల చిన్నపాటి సూర్యకాంతికి కూడా తట్టుకోలేక అల్లాడిపోయే పరిస్థితి ఎదురవుతోంది.

కనీస జాగ్రత్తలు ఇవీ..
కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్ల వంటివి ఎక్కువసేపు వాడకుండా చిన్నారులను తల్లిదండ్రులు కట్టడి చేయాలి
ఇండోర్‌ లైటింగ్‌లో.. అంటే ఇంట్లో లైట్ల వెలుగులో చిన్నారులు 16 గంటలకు పైగా గడుపుతున్నారు. దీన్ని తగ్గించి పగటి వెలుగులో మరింత సేపు గడిపేలా చూడాలి.
కంటిచూపులో తేడా రాగానే వెంటనే అద్దాలు వాడటం లేదా ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్స చేయించాలి. లేదంటే ఈ చూపు మందగించడం మరింతగా పెరిగిపోతుంది.

తల్లిదండ్రులే చొరవ చూపించాలి..
ప్రస్తుతం మా దగ్గరకు వస్తున్న చిన్నారుల్లోఈ హ్రస్వ దృష్టి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చిన్నారులను ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగ ప్రమాదం నుంచి బయట పడేయడానికి తల్లిదండ్రులే చొరవ చూపించాలి. ఎలక్ట్రానిక్‌ తెరలపై దృష్టి తగ్గిస్తే ఎంతైనా మంచిది. – డా.నరేంద్రనాథ్‌రెడ్డి, ప్రొఫెసర్‌ (కంటివైద్యనిపుణులు), కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల

20-20-20 ఫార్ములా..
20–20–20 అంటే 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును గానీ, చిత్రాన్ని గానీ 20 సెకన్ల పాటు మాత్రమే చూడటం. దీనివల్ల కళ్లకు మధ్య మధ్యలో ఉపశమనం కలిగి కొన్ని జబ్బుల నుంచి బయటపడే అవకాశముందని తేల్చారు వైద్య నిపుణులు. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ ఏదైనా గానీ ప్రతి 20 నిమిషాలకోసారి ఇలా 20 సెకన్లపాటు దృష్టిని మరల్చినప్పుడు కంటికి ఫార్ములా చికిత్సలా పనిచేస్తుందని, ఇది శాస్త్రీయంగా రుజువైందని వైద్యులు చెబుతున్నారు.

మేధస్సు బాగా ఉందనుకున్నాం..
పిల్లాడు వీడియో గేమ్స్‌ ఆడుకుంటూ, ల్యాప్‌టాప్‌లో అన్ని ఫైల్స్‌ ఓపెన్‌ చేస్తా ఉంటే సాంకేతికంగా వీడికి ఎక్కువ మేధస్సు ఉందని అనుకున్నాం. కానీ ఏడేళ్ల వయసు వచ్చే సరికే 20 మీటర్ల దూరంలో ఉండే వస్తువులు కూడా చూడలేకపోయాడు. డాక్టర్‌కు చూపిస్తే అప్పుడు తెలిసింది మయోఫియా అని. – మోహన్‌రావు, ఎన్‌ఎఫ్‌సీ ఉద్యోగి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement