నర్సులే వైద్యులు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : గ్రామీణులు రాత్రి సమయాల్లో వైద్యానికి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన 24ఁ7 పీహెచ్‌సీలు అస్తవ్యస్తంగా మారాయి. కొన్ని ఆస్పత్రులు సాయంత్రానికే మూతపడుతుండా మరికొన్నింటిలో నర్సులే డాక్టర్లుగా మారి ఏకంగా కాన్పులు చేసేస్తున్నారు. ఒక్కోసారి స్టాఫు నర్సులు కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో ఏఎన్‌ఎంలే డాక్టర్ల పాత్ర పోషిస్తున్నారు. వారి చేతుల్లో తల్లి, బిడ్డ ప్రాణాలను వదిలేసి బంధువులు దేవుడిని మొక్కడం మినహా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. స్థానికంగా డాక్టర్లు ఒక్కరంటే ఒక్కరూ అందుబాటులో ఉండటం లేదు.
సాయంత్రానికే పీహెచ్‌సీని వదిలేసి... సమీపంలోని పట్టణాలకు చేరుకుంటున్నారు. ప్రసవం కోసం వచ్చిన వారికి వేదననే మిగులుతోంది. గర్భిణులను ప్రసవానికి తీసుకొచ్చేందుకు అంబులెన్సులు కూడా అందుబాటులో లేవు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వమే వీటిని ఎత్తివేసింది. ఫలితంగా ఇంటి నుంచి గతుకుల రోడ్డులో ఆటోలోనే ప్రసవానికి తీసుకోవాల్సి వస్తోంది. దీంతో నొప్పులు మరింత ఎక్కువై గర్భిణులు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. జిల్లాలో పలు గ్రామాలకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు.
దీంతో ఆటోలో తీసుకొచ్చే సమయంలో నొప్పులు ఎక్కువై పీహెచ్‌సీకి వచ్చేలోగా దారిలోనే ప్రసవం అవుతున్న వారు కొందరైతే... పీహెచ్‌సీకి వచ్చే సరికి బిడ్డ తల బయటకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు మరి కొందరు. జిల్లాలో మొత్తం 24 గంటలు పనిచేస్తున్న ఆస్పత్రులు 40 ఉండగా.. వాటిల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం (12వ తేదీ సెప్టెంబరు) రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ‘సాక్షి’ బృందం నిర్వహించిన విజిట్‌లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్యాపిలి, వెలుగోడు, బండి ఆత్మకూరు, కౌతాళం పీహెచ్‌సీలల్లో స్టాఫు నర్సులే ప్రసవాలు చేయగా... గూడూరు పీహెచ్‌సీలో కనీసం స్టాఫు నర్సు కూడా కనిపించలేదు. ఇక బెళగల్ పీహెచ్‌సీలోనైతే.. డాక్టర్ సాయంత్రమే కర్నూలుకు వెళ్లిపోగా, ఏఎన్‌ఎం డాక్టర్‌గా మారి ప్రసవాలు చేసింది.
నిబంధనలు ఇవీ...!
ప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రసవాలకు ఇబ్బందులు లేకుండా ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. అందుకే వీటిని 24 గంటలు వారంలో 7 రోజుల పాటు అందుబాటులో ఉండే డెలివరీ యూనిట్ అని వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉండే స్టాఫ్ నర్సులను స్కిల్ భర్త్ అసిస్టెంటుగా పేర్కొంటున్నారు. వీరు రాత్రి సమయాల్లో ఎల్లవేళలా పీహెచ్‌సీల్లోనే ఉండాలి. అదేవిధంగా డాక్టర్ కూడా స్థానికంగా నివాసం ఉండాలి. అయితే ఇవేవీ అమలు కావడం లేదు.
సిబ్బంది కొరత
జిల్లాలో వారంలో ఏడు రోజులు.. 24 గంటల పాటు పనిచేసే పీహెచ్‌సీలు 40 ఉన్నాయి. వీటిలో మొత్తం 74 మంది డాక్టర్లు ఉండాలి. ప్రస్తుతం 58 మంది పనిచేస్తుండగా 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ నర్సు పోస్టు ఒకటి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు 2, ఫార్మసిస్టు గ్రేడ్-2 పోస్టులు 5, మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు 9 ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. వీటికి తోడు ఉన్న డాక్టర్లు, సిబ్బంది కూడా అందుబాటులో ఉండకపోవడంతో మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది.