ప్రైవేటుకు తలుపులు బార్లా!
♦ మెడికల్ కాలేజీల నియంత్రణ చట్టానికి సవరణ చేసిన ఎంసీఐ
♦ ప్రభుత్వాసుపత్రుల్ని ప్రైవేటుకిచ్చేందుకు ఎంఓయూ చేసుకోవచ్చు
♦ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంసీఐ కార్యదర్శి లేఖ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు ప్రభుత్వాసుపత్రుల్ని ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊతమిచ్చేలా భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్ని ప్రైవేటుకు అప్పగించేందుకు తోడ్పడేలా ఎంసీఐ తాజాగా మెడికల్ కాలేజీల నియంత్రణ చట్టానికి సవరణ చేసింది. మెడికల్ కాలేజీ యాక్ట్ 1999 ఇన్ క్లాజ్ 2(5) ప్రకారం వైద్య కళాశాలల అర్హత ప్రాతిపదికను మార్చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంసీఐ కార్యదర్శి డా.రీనా నయ్యర్ ఈ నెల 16న లేఖ రాశారు.
ఇకమీదట ఆస్పత్రులు, వైద్య కళాశాలల విషయంలో ఎవరితో ఎవరైనా అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకోవచ్చునని అందులో పేర్కొన్నారు. ఒక వ్యక్తిగానీ, ఏజెన్సీగానీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి అవసరమైన క్లినికల్ మెటీరియల్‌గానీ, మానవ వనరులుగానీ, మౌలిక వసతులుగానీ కావాలంటే.. నిబంధనల ప్రకారం ఫలానా సంస్థ లేదా ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవచ్చునని తేల్చిచెప్పారు. ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలైనా సరే ఒకరికొకరు ఎంవోయూ చేసుకునే వీలుంటుందన్నారు. సవరించిన మెడికల్ కాలేజీల నియంత్రణచట్టం ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకొచ్చిందని తెలిపారు.
33 ఏళ్లు లీజుకివ్వొచ్చు
ఏ ఆస్పత్రినైనా ప్రైవేటు యాజమాన్యాలకు లేదా కార్పొరేట్ సంస్థలకు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు లీజుకివ్వాలంటే అది కనీసం 300 పడకల ఆస్పత్రి అయి ఉండాలని, నిబంధనల ప్రకారం స్థలం కలిగి ఉండాలని, అలా ఉన్నప్పుడు కనిష్టంగా 33 ఏళ్లపాటు, గరిష్టంగా 99 ఏళ్లు లీజుకిచ్చే అవకాశముందని లేఖలో పేర్కొన్నారు.ఆస్పత్రి, మెడికల్ కాలేజీ రెండు స్థలాల్లో ఉండవచ్చునన్నారు. అంతకుమించి స్థలాల్లో ఉండకూడదన్నారు. ప్రభుత్వాసుపత్రిని లీజుకిచ్చేటప్పుడు ప్రభుత్వకోటా కింద వచ్చే వైద్యసీట్లకు భంగం కలగరాదని, రోగులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం 300 పడకలుంటే అందులో 120 పడకలు శస్త్రచికిత్సల స్పెషాలిటీకోసం, మరో 120 మెడికల్ స్పెషాలిటీకోసం, 60 ప్రసూతి చికిత్సలకు ఉండాలని నిర్దేశించారు. క్రమంగా ఆస్పత్రులను ఉన్నతీకరిస్తే, నిబంధనల ప్రకారం 50 సీట్ల నుంచి 250 ఎంబీబీఎస్ సీట్ల వరకూ పెంచే వీలుంటుంది.