సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడ్స్ మళ్లీ విజృంభిస్తోంది. జాతీయ సగటు కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారితో మరణిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 2016–17లో 13.03 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 12,058 ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. 2017–18లో జనవరి 31 వరకు 11.25 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 10,194 మంది కొత్త బాధితులు తేలారు. 40 ఏళ్లు దాటిన వారే ఎక్కువగా ఎయిడ్స్ బారి న పడుతున్నారు. బాధితుల్లో 52 శాతం మంది 40 నుంచి 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. 15–49 ఏళ్ల వయసున్న వారితోనే ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) పేర్కొంటోంది. ఈ వయసున్న వారిలో 6 శాతం మంది ఎయిడ్స్ పరంగా ‘హై రిస్క్’జోన్‌లో ఉంటారని ఈ సంస్థ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ వయసున్న వారిలో ఆరు శాతం లెక్కన.. 10.50 లక్షల మంది ఉన్నారు. ‘‘40 ఏళ్లు దాటిన వారిలో జీవితపరంగా స్థిరత్వం వస్తోంది. ఆర్థికంగానూ ఇలాగే ఉంటున్నారు. ఎక్కువ మంది ఉపాధి, ఉద్యోగాల కోసం బయటి ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితులో కొత్త వ్యక్తులతో సంబంధాలు ఎయిడ్స్‌కు కారణమవుతున్నాయి’’అని హైదరాబాద్‌లోని ప్రభుత్వ బోధన ఆస్పత్రి వైద్య నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు.
‘ప్రైవేటు’ రోగుల లెక్కలేవి?
రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ విషయంలో సరైన విధానం కనిపించడంలేదు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రాష్ట్ర విభాగం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన వారి సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటోంది. ఎయిడ్స్ రోగుల్లో గ్రామీణులు, పేదలు మాత్రమే ప్రభుత్వ ఎయిడ్స్ చికిత్స కేంద్రాలకు వస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రులలోనే ఎక్కువ మంది ఎయిడ్స్ రోగులు వైద్యం తీసుకుంటున్నారు. వ్యాధి సోకినవారు బయటకి చెప్పుకోవడం లేదు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ జరుగుతున్నా.. అక్కడ మందులు తీసుకుంటే అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రైవేటు చికిత్సకే మొగ్గు చూపుతున్నారు. ఇలా ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారెంత మంది అన్న లెక్కలు ప్రభుత్వ విభాగాల వద్ద ఉండటం లేదు. ప్రైవేటు సంస్థలపై పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడంతో ఎయిడ్స్ నియంత్రణ విషయంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో జాతీయ సగటును మించి కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పరీక్షలు నిర్వహించిన ప్రతి వంద మందిలో ఒకరికి వ్యాధి ఉన్నట్లు తేలగా.. అదే రాష్ట్రంలో ఆ సంఖ్య రెండుగా ఉంటోంది.
చికిత్స అరకొరే..
రాష్ట్రంలో ఏటా కనీసం వెయ్యి మందిని ఎయిడ్స్ బలి తీసుకుంటోంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటికే 31,416 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,80,937 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. వీరిలో 90,156 మంది ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. న్యాకో ప్రతి రోగికి ఉచితంగా మందులు సరఫరా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పింఛన్ ఇస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(టీ సాక్స్) సంస్థ ఆధ్వర్యంలో మందులు పంపిణీ జరుగుతోంది. రెగ్యులర్‌గా మందులు తీసుకోని వారి విషయంలో టీ సాక్స్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో 37,732 మంది ఎయిడ్స్ రోగులు క్రమపద్ధతిలో మందులు తీసుకోవడం లేదు. ఫలితంగా వ్యాధి నియంత్రణ సాధ్యం కావడం లేదు.
సరిపడ ఏఆర్‌టీ కేంద్రాలేవీ?
ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్‌టీ) కేంద్రాలు రాష్ట్రంలో 22 మాత్రమే ఉన్నాయి. నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, మెదక్, వనపర్తి, జోగులాంబ, నాగర్‌కర్నూలు, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో ఒక్క ఏఆర్‌టీ సెంటర్ లేదు.
ఈ మహమ్మారి తీరు..చాప కింద నీరు!
Published Wed, Feb 14 2018 2:50 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment