‘ప్రాథమికమే’ నరకప్రాయం
‘ప్రాథమికమే’ నరకప్రాయం
Published Sat, May 27 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
నర్సులే సూదిమందు వేస్తారు
అటెండర్లు ఓపీలు చూస్తారు
అసలు వైద్యులు కానరారు
స్టాఫ్ నర్స్ పోస్టులు 40 భర్తీ ఎండమావే...
వచ్చే రోగాలను ప్రాథమికంగా గుర్తించి చికిత్స అందించాల్సిన కీలక వైద్య కేంద్రాలివి. సంపూర్ణ విద్యావంతునిగా తీర్చిదిద్దేందుకు విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలు ఏ విధంగా పునాది రాళ్లు వేస్తాయో పీహెచ్‌సీలు కూడా సంపూర్ణ ఆరోగ్యానికి ఆదిలోనే అరికట్టాలి. కానీ క్షేత్ర స్థాయిలో దీనికి భిన్నంగా ఉంది.
- డాక్టర్లేరీ: 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేరు. పోస్టులు మంజూరైనా నియామకాలు లేవు. అరకొరగా నియామకాలు జరిగినా బాధ్యతలు తీసుకోక వెనుతిరిగిపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
.
- వీరే పెద్ద దిక్కు: వైద్యులు లేని పీహెచ్‌సీల్లో అటెండర్లు, ఏఎన్‌ఎమ్‌లు, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఓపీలు చూస్తూ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఇంజెక‌్షన్లిస్తూ తమకు తెలిసిన మందులు రోగులకు అందజేస్తున్నారు.
.
- ఇక్కడకు రాకండేం: రామచంద్రపురం మండలం వెల్ల, తుని రూరల్ మండలం తేటగుంట, మండల కేంద్రం గొల్లప్రోలు, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, పిఠాపురం మండలం విరవ, ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక, కాట్రేనికోన, కేశనకుర్రు, అమలాపురం నియోజకవర్గం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో వైద్యులు లేక అక్కడకు వచ్చే రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యుడు లేని ఈ ఆసుపత్రులకు ఎందుకు వస్తున్నారు ... ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని అక్కడ సిబ్బందే విసుక్కుంటున్నారు.
.
- మన్యం అరణ్య రోదన: రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి మండలం గుర్తేడు పీహెచ్‌సీలో రెండు పోస్టులుంటే రెండూ ఖాళీగానే ఉన్నాయి. గంగవరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, అడ్డతీగల మండలం దుప్పలపాలెం, ఎల్లవరం, అడ్డతీగల కమ్యునిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లలో కూడా వైద్యులు లేక మన్యం వాసులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఏ వ్యాధి వచ్చినా మరణాలు ఇక్కడ సహజమైపోతున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పల్లెల్లో ఎవరికి ఏ రోగమొచ్చినా అందుబాటులో ఉండేది ... వెళ్లేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. పీహెచ్‌సీలకు వెళ్లే రోగులంతా దాదాపు సామాన్య, మధ్య తరగతి వర్గాలే. అటువంటి ఈ ఆరోగ్య కేంద్రాల్లో నర్సులు, అటెండర్లే వైద్యుల పాత్ర పోషిస్తున్నారు. వైద్యుల కొరత కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వీరే పెద్ద దిక్కుగా మారుతున్నారు.
జిల్లాలో పూర్తి స్థాయి వైద్యులు లేని పీహెచ్‌సీలు 50పైనే ఉన్నాయి. వీటిలో 24 గంటలు సేవలందించాల్సిన పీహెచ్‌సీలు 25 వరకూ ఉన్నాయి. వైద్యులు లేని పీహెచ్‌సీలలో అటెండర్లు, ఏఎన్‌ఎమ్‌లు, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఓపీలు చూస్తూ...ఇంజెక‌్షన్లిస్తూ తమకు తెలిసిన మందులు రోగులకు అందజేస్తున్నారు. రామచంద్రపురం మండలం వెల్ల, తుని రూరల్ మండలం తేటగుంట, మండల కేంద్రం గొల్లప్రోలు, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, పిఠాపురం మండలం విరవ, ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక, కాట్రేనికోన, కేశనకుర్రు, అమలాపురం నియోజకవర్గం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో వైద్యులు లేక అక్కడకు వచ్చే రోగులు అల్లాడిపోతున్నారు.
ఏజెన్సీలో మరీ ఘోరం...
రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి మండలం గుర్తేడు పీహెచ్‌సీలో రెండు పోస్టులుంటే రెండూ ఖాళీగానే ఉన్నాయి. గంగవరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, అడ్డతీగల మండలం దుప్పలపాలెం, ఎల్లవరం, అడ్డతీగల కమ్యునిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లలో కూడా వైద్యులు లేక మన్యం వాసులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. మన్యంలో కాళ్లవాపు, మలేరియా, గర్భిణీలు, నవజాత శిశువుల మరణాల రేటు పెరుగుతున్నా పోస్టులు మాత్రం భర్తీ కావడం లేదని మన్యం వాసులు ఆవేదన చెందుతున్నారు.
ఇదండీ దుస్థితి...
జిల్లాలో 24 గంటల పీహెచ్‌సీలు 38 ఉండేవి. వీటికి కొత్తగా 13వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన తొమ్మిది పీహెచ్‌సీలు కలిపితే మొత్తంగా 47 పీహెచ్‌సీలు ఉన్నాయి. గతంలో 24 గంటల పీహెచ్‌సీలలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టినప్పుడు 60 శాతం చూపించి మిగిలిన పోస్టులను అప్పటి డీఎంహెచ్‌ఒ కార్యాలయంలో కొందరు పైసలిచ్చిన వారికే కట్టబెట్టారనే విమర్శలున్నాయి. దీనిపై ట్రైనీ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణ కూడా చేశారు. అప్పటి నుంచి స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు వైద్యుల నియామక ప్రక్రియలో కూడా అదే ఫార్ములా అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో 128 పీహెచ్‌సీలున్నాయి. వీటిలో మంజూరైన వైద్యుల పోస్టులు 247. వాటిలో కాంట్రాక్ట్ పోస్టులు 111 కాగా, రెగ్యులర్ పోస్టులు 130. వీటిలో మెజార్టీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
13వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన తొమ్మిది పీహెచ్‌సీలలో ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి. కానీ ఎనిమిది మంది కాంట్రాక్ట్ వైద్యులతోనే ఈ పీహెచ్‌సీలు నెట్టుకొస్తున్నాయి. పది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా, 18మంది పూర్తి స్థాయి వైద్యులను నియమించాలి. ఏడాదిగా ఇదే పరిస్థితి. ఇటీవల జిల్లా కలెక్టర్ (గత కలెక్టర్ అరుణ్‌కుమార్) హయాంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భర్తీకి పంపిన ప్రతిపాదనల్లో 12 వైద్యుల పోస్టులను చూపించి మిగిలిన పోస్టులు తొక్కిపెట్టారు. ఆ పోస్టులను మెచ్చిన వారికి నచ్చినట్టు కట్టబెట్టే వ్యూహంతోనే అలా ప్రతిపాదించారంటున్నారు.
.40 స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీ...
జిల్లాలో 203 స్టాఫ్‌నర్సు మంజూరైన పోస్టులు ఉన్నాయి. అందులో 37 పోస్టులు చాలా కాలంగా ఖాళీగానే ఉన్నాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన తొమ్మిది పీహెచ్‌సీలలో మూడు స్టాఫ్‌నర్సుల పోస్టులతో లెక్కలేస్తే జిల్లాలో స్టాఫ్ నర్సు పోస్టులు 40 ఖాళీలున్నాయి.
పల్లెల్లో రోగుల ఇబ్బందులు...
వాతావరణం అగ్నిగుండంగా మారి డేంజర్ జోన్‌లో జిల్లా ఉందని ఇటీవలనే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వీరికి పీహెచ్‌సీలలో ప్రాథమిక వైద్యం చేస్తే మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉండేది. వైద్యులు లేక స్టాఫ్‌నర్సులు విధులు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్యం కోసం సీహెచ్‌సీలు లేదా, ప్రభుత్వాస్పత్రులకు సకాలంలో పంపించే ధైర్యం చేయలేకపోతున్నారు. వైద్యులు లేక పారామెడికల్ సిబ్బంది (స్టాఫ్ నర్సులు, లేబ్‌టెక్నీషియన్‌లు, ఫార్మాసిస్టులు)కి సరైన మార్గనిర్థేశకత్వం లేకుండా పోయింది. అర్హత లేకున్నా తోచిన వైద్యం చేస్తూండటంతో వికటించడం కొన్ని సందర్భాల్లో రోగులు మృత్యువాతపడటం, బంధువులు ఆందోళనలకు దిగుతున్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా యంత్రాంగం ఈ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement
Advertisement