పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సెలూన్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్న ఓ వ్యక్తి శనివారం దారుణ హత్యకు గురయ్యా డు. పాతకక్షలే ఈ హత్యకు దారితీశాయని తెలిసింది.
ముదిగుబ్బ, న్యూస్‌లైన్ : పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సెలూన్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్న ఓ వ్యక్తి శనివారం దారుణ హత్యకు గురయ్యా డు. పాతకక్షలే ఈ హత్యకు దారితీశాయని తెలిసింది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు... తిమ్మనాయుని(టీఎన్)పాళ్యంకు చెం దిన టీడీపీ కార్యకర్త బొగ్గు మునయ్య (50) ఏడేళ్లుగా ముదిగుబ్బలో నివాసముంటున్నాడు.
టీఎన్ పాళ్యం సమీపంలోని యోగి వేమన రిజర్వాయర్ (వైవీఆర్) ప్రాజెక్టులో చేపలు పట్టే విషయమై ఈయనకు మరొక వర్గానికి తరచూ ఘర్షణలు జరిగేవి. ఇదే విషయమై 20 రోజుల క్రితం ఇరు వర్గాల వారూ గొడవపడి పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ షాపులో షేవింగ్ చేయిం చుకుంటున్న మునయ్యపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడిచేశారు.
తల, చేయి తదితర భాగాలపై విచక్షణారహితంగా నరకడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామానికి భీతిల్లిన సెలూన్‌షాపు నిర్వాహకుడు బయటకు పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న నల్లమాడ సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మునయ్యకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రత్యర్థి వర్గం వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి వరదాపురం సూరి ఆరోపించారు.