ఎప్పుడు పుట్టావు ‘బంగారూ’! | The opposite of 'gold'! | Sakshi
Sakshi News home page

ఎప్పుడు పుట్టావు ‘బంగారూ’!

Published Wed, Jan 29 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

The opposite of 'gold'!

 బొంరాస్‌పేట మండలం రేగడిమైలారంకు చెందిన ముసులగళ్ల  ఇందిరకు 3నెలల క్రితం తొలుచూరు ఆడబిడ్డ పుట్టింది. అందరూ ఆడబిడ్డ పుడితే ‘బంగారుతల్లి’ అంటూ గుండెలకు హత్తుకుంటుండగా.. ఇందిర మెట్టినింటివారు ఆడబిడ్డ పుట్టిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇందిర పుట్టింటి వారు ఆమెను రేగడిమైలారంకు తీసుకువచ్చి తల్లీ, బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

 ప్రభుత్వం బంగారు తల్లి పథకం ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నదన్న ఆశతో.. బంగారుతల్లి పథకం లబ్ధికోసం దరఖాస్తు చేసుకుందామన్నా తమకు ఎవరూ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పథకం పరిధిలో చిన్నారి పేరును నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడిందని.. ప్రభుత్వం ద్వారా తమకు చేయూతనందించాలని ఇందిరతోపాటు ఆమె తల్లిదండ్రులు  కోరుతున్నారు.
 
 నవాబుపేట మండలం అమ్మాపూర్‌కు చెందిన బాలామణి అనే మహిళకు 8 నెలల కిందట పాప పుట్టింది. బంగారు తల్లి పథకం కింద ఆ చిన్నారి పేరును నమోదు చేయాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని తల్లి చెప్తోంది. గ్రామ పంచాయతీ ద్వారా ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్‌ను అనుమతించడం లేదని, బర్త్ సర్టిఫికెట్‌కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యత్నిస్తే.. మీ సేవలో అప్‌లోడ్ కావడం లేదని, ఆధార్ కార్డు ఇంకా రాలేదన్న కారణంగా  పథకం కింద తమ పాప పేరును నమోదు చేయలేకపోతున్నామని ఆమె ఆవేదనతో చెప్పింది.  పాప పుట్టి ఎనిమిది  నెలలవుతున్నా.. ధ్రువీకరణ పత్రాల పేరుతో కాలయాపన చేస్తుండటం ఇబ్బందిగా మారిందని ఆమె అంటోంది. ఇలా.. జిల్లా వ్యాప్తంగా వేల మంది 2013 మే 1వ తేది తర్వాత పుట్టిన ఆడపిల్లల పేర్లను ‘బంగారుతల్లి పథకం’ పరిధిలో నమోదు చేయించేందుకు యత్నించి విసిగి వేసారిపోతున్నారు.
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : ఆడపిల్లగా పుడితే ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాలనుకోవాలి.. ప్రభుత్వం వారు ఎదిగేవరకు అన్ని విధాలా ఆర్థిక సహకారం అందిస్తుంది.. అంటూ సర్కారు ఊకదంపుడు ఉపన్యాసాలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. తెలుపు రేషన్ కార్డు కలిగిన బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డకు ఆసరాగా ఉండటానికి ఉద్దేశించిన బంగారుతల్లి పథకం సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. గతేడాది మే 1 తర్వాత జిల్లా వ్యాప్తంగా దాదాపు 12వేల మంది ఆడశిశువులు జన్మించగా అందులో 6వేల లోపు మంది మాత్రమే ఈ పథకం కింద నమోదైనట్లు సమాచారం.
 
 బాలికల సంక్షేమానికి ఉద్దేశించిన పథకం.. ప్రారంభించి 9 నెలలు గడుస్తున్నా.. బాలారిష్టాలు దాటడం లేదు. బంగారు తల్లుల తల్లిదండ్రులకు భరోసానివ్వటం లేదు. మొదట్లో ఆర్భాటాలు చేసిన ప్రభుత్వం  గ్రామీణ పేదలకు అవగాహన కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదు. పథకం ప్రారంభమైన గతేడాది మే నుంచి ఇప్పటి వరకూ జన్మించిన బాలికలకు, పథకం కోసం ఐకేపీలో నమోదవుతున్న సంఖ్యకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.
 
 అధికారులూ సహకరించడం లేదు
 గణాంకాలను బట్టి చూస్తే జిల్లాలో.. 50 శాతానికిపైగా ప్రజలకు బంగారు తల్లి పథకం గురించే తెలియదనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు పథకం గురించి కొందరికి తెలిసినా అధికారులు సహకరించకపోవడంతో తిప్పలు పడుతున్నారు. బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లిపేరిట బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి పంచాయతీ అధికారులు, భాతాలు తెరవడానికి బ్యాంకర్లు రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో పలువురు ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడటం లేదు. దీనికితోడు ఆధార్ కార్డులు సకాలంలో జారీ కాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
 అమలు ఇలా..
 ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మే ఒకటి తర్వాత జన్మించినట్లు ధ్రువీకరణ పత్రం అందిస్తే వెంటనే రూ.2500 జమచేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజుకు రూ.1000 చెల్లిస్తారు.  రెండో ఏడాది వచ్చేసరికి మరో రూ.1000 చెల్లిస్తారు. మూడో ఏట అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమచేస్తారు. ఇలా 4,5 ఏళ్లకు ఒక్కో ఏటా రూ.1500 వంతున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదోతరగతి వరకూ ఏడాదికి రూ.2000 చొప్పున చెల్లిస్తారు. 6,7,8 తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ.2500 జమచేస్తారు.  9,10 తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ.3వేలు వంతున ఇస్తారు. బాలికకు 16ఏళ్లు వచ్చేసరికి ఇంటర్ రెండేళ్లకు ఏడాదికి రూ,3,500 వంతున జమచేస్తారు.  డిగ్రీలో చేరిన తర్వాత వరుసగా ఏడాదికి రూ.4వేలు చొప్పున అందజేస్తారు. అలాగే అదనంగా డిగ్రీలో మరో రూ.4వేలు ఇస్తారు. డిగ్రీ పూర్తయి పట్టా పొందిన తర్వాత ప్రభుత్వం ఆమె పేరిట రూ.1లక్ష జమ చేస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement