గొంతెండుతోంది.. | The proposal for funding reconnaissance | Sakshi
Sakshi News home page

గొంతెండుతోంది..

Published Wed, Mar 4 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

The proposal for funding reconnaissance

1268 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు
రూ.13.10కోట్లతోప్రణాళిక
{పభుత్వానికి ప్రతిపాదన నిధుల కోసం ఎదురుచూపు

 
 వేసవి తరముకొస్తోంది.. నీటి ఎద్దడి ముంచుకొస్తోంది..వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లు,భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ వేసవిలో తీవ్రనీటి ఎద్దడి నెలకొనే పరిస్థితులు ప్రస్పుటమవుతున్నాయి. ముఖ్యంగా మెట్ట, ఏజెన్సీప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించిన అధికారులు.. ఇందుకుతగిన ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధుల కోసంఎదురు చూస్తున్నారు.
 
 సాక్షి, విశాఖపట్నం: రానున్న వేసవిలో జిల్లాలోని 1268 పంచాయతీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందని గ్రామీణ నీటిసరఫరా విభాగం ప్రాథమికంగా అంచనాకొచ్చింది. ఈ పంచాయతీల పరిధిలోని హేబిటేషన్స్‌లో సుమారు 10.50లక్షల మంది నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారని లెక్కలేసింది. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో పెరగక పోవడంతో మిగిలిన గ్రామాల్లోనూ  తాగునీటి కష్టాలు తప్పవన్న భావనకొచ్చింది. ముందుగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే పంచాయతీలపైనే ఆర్‌డబ్ల్యూఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసింది. రూ.13.10కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నిధులు మంజూరు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో 9320 ఆవాస ప్రాంతాలుంటే..వాటిలో 3015 మెట్ట ప్రాంతంలోనూ, 6305 ఏజెన్సీలోనూ ఉన్నాయి. ఇక రక్షిత నీరు 1669 పంచాయతీల్లో పూర్తి స్థాయిలోనూ, 3799 ఆవాసాల్లో పాక్షిక స్థాయిలోనూ సరఫరా చేస్తున్నారు. రక్షితనీటివనరులు లేని గ్రామాలు 45ఉండగా, అసలు నీటి వనరులే లేని గ్రామాలు 16 ఉన్నాయి. జిల్లాలో చేతిపంపులు 18,178 ఉండగా,వాటిలో15,273 మెట్ట,. 2905 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో 629 గ్రామాలను పూర్తి కరువు ఛాయలున్నట్టుగా గుర్తించారు. వీటిలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి 161 గ్రామాలకు ట్రాన్స్ పోర్టు ద్వారా నీరందించాల్సిన పరిస్థితులన్నాయని గుర్తించారు. ఐదు బావులను లోతుచేయాలని, 438 బావులను ఫ్లెషింగ్ చేయాలని, 25ఓపెన్ వెల్స్‌ను కూడా లోతు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.2.07 కోట్లు వ్యయమవుతుందని అంచనా కొచ్చారు. 638 గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు సీపీడబ్ల్యూ స్కీమ్స్, బోర్‌వెల్స్ మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ కనెక్షన్లు, మోటార్లు పనిచేయకపోవడం తదితర సమస్యల పరిష్కారానికి రూ.11.03 కోట్లు అవసరమవుతాయని అంచనావేశారు.
 
 ఎద్దడి లేకుండా చర్యలు
 గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఈసారి నీటి ఎద్దడి నెలకొనే అవకాశాలున్నాయి. అయినప్పటికీ సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం.
 -తోట ప్రభాకరరావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement